- పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 2 మెగావాట్లు
- పెద్దపల్లి జిల్లా మంథని పరిధిలో యూనిట్స్
- డీఆర్డీఏ, రెడ్కో, ట్రాన్స్‌కో ఆధ్వటర్యంలో ప్లాంట్స్
పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి జిల్లాలో సోలార్ ప్లాంట్ యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ల్యాండ్ సర్వే నిర్వహించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మంథని మండలంలో మొదటగా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ స్కీమ్ లో బాగంగా మహిళల ఆర్థిక స్థితి పెంపొందించడం కోసం, రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా డీఆర్డీఏ, టీజీ రెడ్-కో టీజీ ట్రాన్స్ కో భాగస్వామ్యం తో ఏర్పాటు చేయనున్నారు. గత డిసెంబర్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం సభలో మహిళా సాధికారత కోసం సోలార్ పవర్ ప్రొడక్షన్‌కు ప్రాధాన్యమిస్తూనే, ప్లాంటుల నిర్వహణ మహిళలకు ఇస్తామని సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రకటించారు.
దాంట్లో బాగంగానే జిల్లాలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసి మహిళలను నిర్వాహకులను చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారులు మంథని మండలంలోని ఎక్లాస్పూర్, సిరిపురం, గుంజపడుగు గ్రామాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయుటకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జిల్లాలో సోలార్ ప్లాంట్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ల ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి లభించే చాన్స్ ఉంది.
సోలార్ పై సర్కార్ దృష్టి
పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే నాలుగు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా దాదాపు 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నట్లు సమాచారం. రామగుండం నియోజకవర్గంలో ఎన్టీపీసీలో గ్రౌండ్ సోలార్ ప్లాంటు ద్వారా 10 , వాటర్ ప్లోటింగ్ సోలార్ ప్లాంటు ద్వారా 100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని. అలాగే మంథని, కాల్వశ్రీరాంపూర్ మండలాల్లో కూడా ఇప్పటికే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మరో 40 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు తెలుస్తుంది. కానీ సేకరించిన భూములు కావడంతో తరుచుగా రైతుల ద్వారా పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను గుర్తించి రానున్న రోజుల్లో మహిళల నేతృత్వంలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి, వాటి ద్వారా కనీసం 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చనే అంచనాలో అధికారులు ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరిశ్రమల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కన్పిస్తుంది.
ఇటీవల పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజవర్గంలో విద్యుత్ ప్లాంటు నిర్మాణానికి శంకుస్తాపన చేసిన క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటి మినిష్టర్ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లిఎంపీ గడ్డం వంశీకృష్ణలు మాట్లాడుతూ సోలార్ పవర్ ప్రొడక్షన్‌కు ప్రాధాన్యత ఇస్తామని, అలాగే సోలార్ విద్యుత్ ఉత్పత్తి మహిళల ద్వారా చేపట్టి వారిని కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో రానున్న రోజుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు విస్తృతంగా జరుగనున్నట్లు తెలుస్తుంది. పెద్దపల్లిలో పారిశ్రామికీకరణలో బాగంగా సోలార్ ప్లాంట్ల నిర్మాణం జరిగితే గత పదేళ్లుగా ఎదురుచూస్తున్న యువతకు ఉపాధి కూడా లభిస్తుంది.