భూ వినియోగంపై పొంతన లేని లెక్కలు

తెలంగాణలో భూ వినియోగానికి సంబంధించిన గణాంకాలు ఎప్పుడూ సంక్లిష్టమే. ప్రభుత్వం చెబుతున్న దానికి, క్షేత్ర స్థాయి పరిస్థితులకు మధ్య పొంతన ఉండటం లేదు. అందుకే ప్రభుత్వం చెబుతున్న నికర సాగు భూమి లెక్కలు అనుమానాస్పదంగా ఉంటున్నాయి. ప్రభుత్వ గణాంకాల్లో నికర సాగు భూముల విస్తీర్ణం పెరిగిపోవడం వల్ల, రైతు బంధు పేరుతో పెట్టుబడి సాయం కోసం బడ్జెట్ లో నిధుల కేటాయింపులు కూడా పెరిగిపోతున్నాయి. సాగు చేయని భూములకు కూడా సాయం అందించడం వల్ల విలువైన బడ్జెట్ కేటాయింపులు దుర్వినియోగం అవుతున్నాయి.
వ్యవసాయానికి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహం వల్ల, చెరువులు బాగు చేసి, ప్రాజెక్టులు నిర్మించి, సాగు నీరు విస్తృతంగా అందుబాటులోకి  తేవడం వల్ల, పడావు, బంజరు భూములన్నీ సాగు భూములుగా మారిపోతున్నాయని ప్రభుత్వ నివేదికలు రాస్తున్నాయి. మరో వైపు అన్ని  జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూసేకరణ వల్ల, రియల్ ఎస్టేట్ వెంచర్ల వల్ల, లక్షల ఎకరాల సాగు భూములు పంటలు వేయని పడావు భూములుగా మారిపోవడం మనం చూస్తున్నాం. 

రాష్ట్ర భూ వినియోగ నివేదికల ప్రకారం రాష్ట్రంలో ఖాళీ, సాగు యోగ్యం కాని భూములు, శాశ్వత గడ్డి భూములు, ఇతర మేత భూములు, పొదలు, చెట్లు ఉన్న భూములు, తాజా(కరెంట్)బీడు భూములు, ఇతర బీడు భూములు, వృథా భూములు గణనీయంగా తగ్గిపోతూ, సాగు భూములుగా మారుతున్నాయి.  రైతు బంధు పెట్టుబడి సాయ పథకం లక్ష్యం  తప్పకుండా ఉపయోగ కరమైనదే. కానీ వాస్తవ సాగు భూములను, వాస్తవ సాగుదారులను గుర్తించకుండా, రెవెన్యూ రికార్డుల్లో వ్యవసాయ భూములుగా కొనసాగుతున్న భూములకు, భూ యజమానులకు  రైతు బంధు పథకం అమలు చేయడం వల్ల నిధుల దుర్వినియోగం జరుగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన 2014-2015, 2019–20, 2020–21 భూ వినియోగ గణాంకాల ప్రకారం.. ఆయా భూముల్లో ఎన్ని ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయో, ఎన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్నాయో స్పష్టత లేదు. కేవలం రికార్డుల్లో వ్యవసాయ భూములుగా ఉండటం వల్ల, సాగు చేయకపోయినా, పంటలు పండకపోయినా, ఎన్ని ఎకరాలకు రైతు బంధు పెట్టుబడి సాయం అందిస్తున్నారో తెలియదు. మరో వైపు వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకు, మహిళా రైతులకు రైతు బంధు సాయం అందడం లేదు. ఇతర వ్యవసాయ అభివృద్ధి పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయింపు బాగా తగ్గిపోయింది . 

పెరిగిన అడవి 61 ఎకరాలే

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2022 సంవత్సర స్టాటిస్టికల్ ఇయర్ బుక్, 2023 సామాజిక ఆర్థిక నివేదిక, గత10 సంవత్సరాల్లో రాష్ట్రంలో భూమి వినియోగంలో తీవ్రమైన మార్పులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర భూమి వినియోగ గణాంకాల ప్రకారం 2011–-12లో రాష్ట్ర మొత్తం భూ విస్తీర్ణం 2,83,65,480 ఎకరాలు కాగా 2020–21 నాటికి అది 2,76.83,760 ఎకరాలకు తగ్గింది. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాంత 7 మండలాలు ఆంధ్ర ప్రదేశ్ లో కలపడం దీనికి కారణం. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం ఈ పదేండ్లలో 67,75,210 ఎకరాల నుంచి 68,36,960 ఎకరాలకు పెరిగింది. అంటే 61,750 ఎకరాల అడవి పెరిగినట్లు ఈ నివేదికలు చెబుతున్నాయి. వేల కోట్లు ఖర్చు పెట్టి, పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీలను  వేధించి ఈ ప్రభుత్వం పెంచిన అడవి విస్తీర్ణం అతి తక్కువే అన్న  మాట. మరో వైపు ఇదే ప్రభుత్వం పెద్ద ఎత్తున అడవులను జాతీయ రహదారులు, రింగ్ రోడ్లు, నీటి పారుదల ప్రాజెక్టుల పేరుతో ఇతర అవసరాలకు మళ్లించింది. 

32 లక్షల ఎకరాల పెరుగుదలపై అనుమానం

ఈ పదేళ్లలో 21,78,540 ఎకరాల నుంచి 20,64,920 ఎకరాలకు వ్యవసాయేతర అవసరాల భూ వినియోగం తగ్గినట్లు ప్రభుత్వం మనకు చెబుతున్నప్పటికీ నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీలు, జిల్లా, మండల కేంద్రాల చుట్టూ రియలెస్టేట్ పేరుతో లక్షల ఎకరాల వ్యవసాయ భూమి మళ్లి పోవడం క్షేత్ర స్థాయిలో మనం చూస్తున్నాం. మరో వైపు ఖాళీ, సాగు యోగ్యం  కాని భూములు ఈ పదేళ్లలో 15,23,990 ఎకరాల నుంచి14,99,290 ఎకరాలకు తగ్గినట్లు, శాశ్వత గడ్డి భూములు, ఇతర మేత భూములు కూడా 7,45,940 ఎకరాల నుంచి 6,91,600 ఎకరాలకు తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నది. పొదలు, చెట్లు మాత్రమే ఉన్న భూములు ఈ పదేండ్లలో 2,81,580 ఎకరాల నుంచి 2,07,480 ఎకరాలకు , తాజా(కరెంట్) బీడు భూములు 30,52,920 ఎకరాల నుంచి 5,18,700 ఎకరాలకు తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఇతర బీడు భూములు కూడా ఈ పదేండ్లలో 20,40,220 ఎకరాల నుంచి 9,38,600 ఎకరాలకు, వృథా భూములు కూడా 4,07,550 ఎకరాల నుంచి 2,86,520 ఎకరాలకు తగ్గినట్లు ప్రభుత్వం చెబుతున్నది. ఈ భూములన్నీ సాగు భూములుగా మారిపోయినట్లు ప్రభుత్వం మనల్ని నమ్మమంటున్నది. ప్రభుత్వ నివేదికల ప్రకారం రాష్ట్ర భూమి వినియోగంలో 2011–12లో 1,13,59,530 ఎకరాలు ఉన్న నికర సాగు భూమి గత పదేళ్లలో 2020–-21 నాటికి 1,46,39,690 ఎకరాలకు పెరిగింది. అంటే మొత్తం 32,80,160 ఎకరాల పెరుగుదల అన్నమాట. ఇది ఒక రాష్ట్రంలో అనుమానాలకు తావు ఇచ్చే  గణనీయమైన పెరుగుదల. 

ఇది నిధుల దుర్వినియోగమే..

రైతు బంధు పెట్టుబడి సహాయం గణాంకాలను పరిశీలిస్తే,  రైతు బంధు ప్రారంభమయిన 2018 ఖరీఫ్ లో 1,30,95,000 ఎకరాలకు ఎకరానికి నాలుగు  వేల చొప్పున రూ. 5238 కోట్లు పంచారు. 2022 వానాకాలం సీజన్ లో 1,48,00,700 ఎకరాలకు, ఎకరానికి 5,000 రూపాయల చొప్పున రూ.7,435 కోట్లు పంచారు. నిజంగా ఈ భూములన్నీ సాగు భూములుగా మారాయో లేదో, అక్కడ పంటలు పండుతున్నాయో లేదో ప్రభుత్వం ఏ సీజన్ లోనూ పరిశీలించడం లేదు. వాస్తవాలను ఏ మాత్రం పట్టించుకోకుండా, ఈ 2023 ఖరీఫ్ లో 70 లక్షల మంది రైతులకు 1,54,00,000 ఎకరాలకు రైతు బంధు సాయం పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. అంటే మళ్లీ వేల కోట్ల నిధులను దుర్వినియోగం చేయడమే. పైగా గత 20 ఏండ్ల అనుభవాలకు భిన్నంగా 2018 నుంచీ ఈ పెరుగుదల విపరీతంగా ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టును, రైతు బంధు పథకాన్నీ గొప్పగా చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వం ప్రజల నుంచీ నిజాలను దాస్తున్నది. “కాగ్” లాంటి సంస్థ ఈ వివరాలను నిష్పక్షపాతంగా లోతుగా పరిశీలించి, నివేదిక బయట పెడితే మాత్రమే ప్రజలకు నిజాలు తెలుస్తాయి. నిధుల దుర్వినియోగం ఆగుతుంది.

కన్నెగంటి రవి, రైతు స్వరాజ్య వేదిక