- ఉత్తర్వులు జారీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ
- ఎక్కడ? ఎలా? ఎంత మేర? పెంచాలనే దానిపై మార్గదర్శకాలు
- బహిరంగ రేటుకు తగ్గట్టుగా ప్రభుత్వ మార్కెట్ విలువ పెంపు.. గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర..పట్టణాల్లోనూ
- ఏరియాను బట్టి భూముల విలువ సవరణలు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో భూముల విలువలు పెరుగనున్నాయి. ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీ ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో ఏ రకంగా భూముల విలువను సవరించాలనే దానిపై మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామాల్లో హైవే రోడ్లకిరువైపులా పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నచోట సర్వే నెంబర్లను గుర్తించి, వాటికి ప్రత్యేకంగా అక్కడున్న బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా మార్కెట్ వాల్యూ సవరించాలని సూచన చేసింది. రియల్ ఎస్టేట్ డీలర్ల బ్రోచర్లు, ప్రకటనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.
గ్రామంలో పెద్దలు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు భూముల బహిరంగ మార్కెట్ విలువను నిర్ధారిస్తారు. వ్యవసాయ భూములకు సంబంధించి ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారులు నిర్ణయిస్తారు. ఇక మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో కొత్తగా చేర్చిన గ్రామాల్లోనూ బహిరంగ మార్కెట్ వాల్యూకు అనుగుణంగా భూముల విలువను పెంచనున్నారు. ఈ నెలాఖరు వరకు పెంపు ప్రతిపాదనలను ఫైనల్ చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వీటిపై జులై ఒకటో తేదీ నుంచి వెబ్ సైట్ ద్వారా అభ్యంతరాలు స్వీకరించనున్నారు.
మీటింగ్స్ షెడ్యూల్
- జూన్ 18 నుంచి–మార్కెట్ విలువ పెంపుపై ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్లతో మీటింగ్
- జూన్ 23– మార్కెట్ వాల్యూ పూర్తి చేయడం
- జూన్29 –మార్కెట్ వాల్యూ ను రివిసన్ చేసే కమిటీల అప్రూవల్
- జులై 1–సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తీసుకునేందుకువెబ్ సైట్ లో వివరాలు
- జులై 15–సలహాలు ఇచ్చేందుకు చివరి తేదీ
- జులై 24–వాల్యూ ఫైనల్ అప్రూవల్
- జులై 31 –డేటా ఎంట్రీ
- ఆగస్టు 1–మార్కెట్ వాల్యూ పెంపు అమలు