డాక్యుమెంట్లు​ ఇస్తలేరు.. మీటింగ్ లకు వస్తలేరు !

డాక్యుమెంట్లు​ ఇస్తలేరు.. మీటింగ్ లకు వస్తలేరు !
  • డాక్యుమెంట్లు​ ఇస్తలేరు.. మీటింగ్ లకు వస్తలేరు !
  • ఐదురోజులుగా ట్రిపుల్ ఆర్ పై భూ బాధితుల నిరసన
  • అవార్డ్ మీటింగ్​ల బహిష్కరణ.. ఆఫీసుల ఎదుట ఆందోళన  
  • మార్కెట్ రేటుకు ‘అవార్డ్’ నిర్ణయించాలంటూ డిమాండ్  

యాదాద్రి, వెలుగు: రీజినల్​ రింగ్​ రోడ్డు (ట్రిపుల్​ఆర్​) అవార్డ్ మీటింగ్​లకు రైతులు  వస్తలేరు. వచ్చిన చోట్ల బహిష్కరిస్తున్నారు. పట్టాదారు పాస్​బుక్స్, ఖాళీ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ​పేపర్లు, వ్యక్తిగత వివరాలను కూడా ​ఇస్తలేరు. పైగా అలైన్​మెంట్ ​మార్చాలని కొన్ని చోట్ల డిమాండ్ చేస్తున్నారు.   మార్కెట్ రేట్ మేరకు భూముల రేట్లు పెంచి అవార్డ్  ఇవ్వాలని తహసీల్దార్​ ఆఫీసుల ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు.  ట్రిపుల్​ఆర్​ఉత్తర భాగం సంగారెడ్డి జిల్లాలో ప్రారంభమై మెదక్, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్​లో  ముగుస్తుంది. 164 కిలోమీటర్ల రోడ్డుకు కావాల్సిన భూ సేకరణలో భువనగిరి‘కాలా’ పరిధిలోని 490 ఎకరాలకు మినహా మిగిలిన భూమికి రిజిస్ట్రేషన్​ విలువను రెండు నుంచి మూడు రెట్లు ప్రభుత్వం పెంచింది. ఖాళీ ప్లాట్లకు 90 శాతానికి విలువ పెంచి, స్టాంప్​ అండ్​ రిజిస్ట్రేషన్, ధరణిలో ప్రభుత్వం అప్​లోడ్​ చేసింది. ఇప్పటికే ఎక్కువగా ఉన్న భూముల రేట్లను సవరించలేదు. ఈ రేట్లను నేషనల్ ​హైవే అథారిటీ ఆమోదిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిర్ణయించిన రేటుకు మూడు రెట్ల అవార్డు, మున్సిపాలిటీ ప్రాంతాల్లో రెండు రెట్లను రైతులకు అందిస్తారు. 

 మీటింగ్​లోనే వివరాలు సేకరణ

భూ సేకరణకు అడిషనల్​కలెక్టర్, ఆర్డీవోలతో ఏర్పాటు చేసిన ఆరు ‘కాలా’లకు సంబంధించి త్రీజీ నోటిఫికేషన్​ గతంలోనే రిలీజ్ అయింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే అవార్డ్  మీటింగ్​లను నిర్వహించారు. ట్రిపుల్​ఆర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్, భువనగిరి ‘కాలా’ల త్రీజీ నోటిఫికేషన్లు తాజాగా రిలీజ్​ చేసింది. ఈ ప్రక్రియ అనంతరం భూమిని కోల్పోతున్న రైతులు అవార్డ్ మీటింగ్​కు హాజరై పట్టాదారు పాసు బుక్స్​, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్ ​పేపర్లు, అట్టి భూముల్లోని ఇతర వివరాలు అందించాలి. దీంతో పాటు ఆధార్, పాన్​ కార్డు, బ్యాంక్​ అకౌంట్​నంబర్ల జిరాక్స్​లు ఇవ్వాలి. వీటిని తీసుకున్న తర్వాతే  ‘ ఏ రైతు వద్ద ఎంత భూమిని సేకరిస్తున్నాం. ఆ భూముల్లోని నిర్మాణాల విలువ, చెట్లు, తోటలు. ‘అవార్డ్’ సొమ్ము ఎంతివ్వాలి. ఎవరి ఖాతాలో వేయాలి’ అనే విషయాలపై స్పష్టత వస్తుంది. 

ఐదు రోజులుగా వస్తలేరు 

యాదాద్రి జిల్లా చౌటుప్పల్​ కాలా పరిధి వలిగొండ, చౌటుప్పల్​ మండలాల్లో భూమి సేకరణపై అవార్డు మీటింగ్​లు ఈనెల 21 నుంచి ఆర్డీవో శేఖర్​రెడ్డినిర్వహిస్తున్నారు. భూముల కోల్పోతున్న వలిగొండ మండలం పొద్దుటూరు, రెడ్ల రేపాక, గోకారం, వర్కట్​పల్లి, పహిల్వాన్​పూర్​, చౌటుప్పల్​ మండలం తాళ్ల సింగారం, చిన్నకొండూరు, తంగడపల్లి, నేలపట్ల, చౌటుప్పల్, లింగోజిగూడెం గ్రామాల అవార్డ్ మీటింగ్​ను శుక్రవారం రైతుల బహిష్కరించారు. తహసీల్దార్​ఆఫీసు ఎదుట ఆందోళన చేసిన అనంతరం హై వేపైకి చేరుకుని రాస్తారోకో చేశారు.  భువనగిరి ఆర్డీవో ఆఫీసులో అవార్డ్​మీటింగ్​ను గౌస్​నగర్​ రైతులు బహిష్కరించి ధర్నా చేపట్టారు.  తహసీల్దార్​ ఆఫీసు వద్దకు వచ్చి మీటింగ్​కు హాజరుకాకుండా ఆందోళనలు చేశారు. అయితే మీటింగ్​లకు రాకుండా భూముల పట్టాదారు పాసుబుక్స్​, ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్​ డాక్యుమెంట్లు ఇవ్వడంలేదు.  

భూముల ధర పెంచాలి.. అలైన్ మెంట్ మార్చాలి

ఇప్పటికే పలు ప్రాజెక్టుల కోసం భూములను కోల్పోయినందున అలైన్​మెంట్​మార్చాలని ప్రధానంగా డిమాండ్​ చేస్తున్నారు. అలైన్ మెంట్ లో మార్పు చేయాలని కేంద్ర మంత్రుల ను కలుస్తున్నారు. కొందరు రైతులు మాత్రం మార్కెట్​కు అనుగుణంగా ధరలు పెంచి ‘అవార్డ్’ అందించాలని డిమాండ్​ చేస్తున్నారు. బహిరంగ మార్కెట్ లో ఎకరానికి రూ. 70 లక్షల నుంచి నుంచి రూ. కోట్ల వరకూ ఉంటే.. ప్రభుత్వమిచ్చే రూ. లక్షలతో ఏం కొనుక్కో  వాలని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు రైతులు భూమికి భూమి ఇస్తేనే ట్రిపుల్​ఆర్​కు సహకరిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇంకొందరు రైతులు జాబ్ లు కూడా ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నారు. 

డబుల్​ బెంచ్​కు బాధితులు

అలైన్​మెంట్​మార్చాలని రాయగిరికి చెందిన ట్రిపుల్​ ఆర్​ బాధితులు హైకోర్టు డబుల్​ బెంచ్​ను ఆశ్రయించారు. ఇప్పటికే  గతేడాది హైకోర్టును ఆశ్రయించగా ఈనెల 3న కొట్టివేసింది. దీంతో రాయగిరికి చెందిన వారు డబుల్​బెంచ్​ను ఆశ్రయించారు. గ్రామ రైతుల నుంచి గతంలో ఐదుసార్లు భూమిని సేకరించారని, ఇప్పుడు ట్రిపుల్​ ఆర్​కోసం మళ్లీ తీసుకునేందుకు నోటీస్ ​జారీ చేశారని పిటీషన్​లో పేర్కొన్నారు. కాగా భువనగిరి ఆర్డీవో ఆఫీసులో ఈనెల 26న ఎర్రంబెల్లి, 28న తుక్కాపూర్​, 29న పెంచికల్​పహాడ్​, 30న రాయగిరి రైతులతో ఆర్డీవో అమరేందర్​అవార్డ్ మీటింగ్​లు నిర్వహించనున్నారు.