ముగ్గురు ఐఏఎస్​లపై ఈడీకి ఫిర్యాదు

ముగ్గురు ఐఏఎస్​లపై ఈడీకి ఫిర్యాదు
  • అక్రమంగా 42 ఎకరాల భూబదలాయింపు చేశారు 
  • సోమేశ్ కుమార్, నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ పై చర్యలు తీస్కోవాలని కంప్లయింట్ 

బషీర్ బాగ్, వెలుగు:  ట్రస్టుకు తమ పూర్వికులు దానం చేసిన భూమిని ముగ్గురు ఐఏఎస్ అధికారులు కోట్లాది రూపాయల లంచం తీసుకుని ఓ కంపెనీకి అక్రమంగా కట్టబెట్టారని ఈడీకి బాధితులు ఫిర్యాదు చేశారు. అక్రమంగా భూమిని బదలాయించిన ఈ వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ తోపాటు మరో ఇద్దరు ఐఏఎస్ లు నవీన్ మిట్టల్, అమోయ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు కొండాపూర్ కు చెందిన బాధితులు వేదే రాఘవయ్య, సురేశ్ ఫిర్యాదులో కోరారు. ‘‘మా తాత సీతారామయ్య 1959లో  రంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మజీద్ బండిలో కొంత భూమిని కొన్నాడు. అనంతరం104, 105, 106, 107, 108  సర్వే నెంబర్లలోని 88 ఎకరాల భూమిని బాలసాయి ట్రస్టుకు దానం చేశాడు.

2004 అర్బన్ ల్యాడ్ సీలింగ్ (యూఎల్ సీ)లో ప్రభుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకున్నది. యూఎల్ సీ నిబంధనలు ప్రకారం.. యాజమాన్య కుంటుబాలకు15 ఎకరాలను అప్పటి ప్రభుత్వం కేటాయించింది. అయితే, గత ప్రభుత్వాల అండదండలతో బాలసాయి ట్రస్ట్ పేరిట ఉన్న 42 ఎకరాల భూమిని దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా భూపతి అసోసియేట్స్ కంపెనీ కొనుగోలు చేసింది. అప్పటి సీఎస్ సోమేశ్ కుమార్, అప్పటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్.. రూ. కోట్ల లంచాలు తీసుకొని, రాత్రికి రాత్రి 45 జీవో తీసుకువచ్చి ఈ భూమిని అక్రమంగా ఆ కంపెనీకి కట్టబెట్టారు” అని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘మా భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ ముగ్గురు ఐఏఎస్ లు రూ. వేల కోట్ల విలువైన భూమిని బడా కంపెనీకి కట్టబెట్టి మోసం చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, వీరిపై చర్యలు తీసుకోవాలి” అని ఈడీని బాధితులు కోరారు. కాగా, గతంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా పని చేసిన అమోయ్ కుమార్ అనేక చోట్ల ప్రభుత్వ, అటవీ భూములను అక్రమంగా పలువురికి కట్టబెట్టినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రస్తుతం ఆయనను ఈడీ విచారిస్తోంది.