కోటి విలువైన భూమి రూ. 5 లక్షలకే!
టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు కేటాయించేందుకు సన్నాహాలు
పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా కేంద్రానికి కేవలం కిలో మీటర్ దూరంలో రూ. కోటికి పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు కట్టబెట్టడానికి పెద్దపల్లి జిల్లా రెవెన్యూ ఆఫీసర్లు రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌లు నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గతంలో ప్రభుత్వం జీవో సైతం విడుదల చేసింది. అధికార పార్టీ కావడంతో పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ భూమిని గజానికి రూ. 100కే ఇవ్వాలని గతంలోనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు వచ్చాయి. పెద్దపల్లిలో పార్టీ ఆఫీస్‌కోసం మొదట రాఘవాపూర్ సర్వే నం. 1072లో ఎకరం భూమిని పరిశీలించారు. ఆ స్థలాన్ని కేటాయిస్తూ 2016లో అప్పటి కలెక్టర్ ఉత్తర్వులు సైతం జారీ చేశారు. అయితే ఊరికి దూరంగా ఉందంటూ పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో స్థలం కోసం టీఆర్ఎస్ నాయకులు ప్రతిపాదించారు. దాంతో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌యార్డులో 33 గుంటల స్థలాన్ని కేటాయించారు. ప్రజలు, ప్రతిపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో టీఆర్‌ఎస్‌నాయకులు వెనక్కి తగ్గారు.
మెయిన్ రోడ్డు పక్కనే..
పెద్దపల్లి నుంచి మంథని వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన గౌరెడ్డిపేట శివారులోని సర్వే నం. 303లో ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఇక్కడ పార్టీ ఆఫీస్కట్టాలని అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి రూ. 4.80 లక్షలు చెల్లించాలని సూచించారు. పార్టీ తరఫున ఆ డబ్బు కడితే భూమి అప్పగించనున్నారు. పెద్దపల్లి రైల్వే ఫ్లైఓవర్ బిడ్జ్రికి సమీపంలో ఈ భూమి ఉండటంతో ఇక్కడ ఎకరాకు రూ. కోటికి పైగా ధర పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఆఫీసర్లు ప్రజావసరాల కోసం ఉపయోగించకుండా పార్టీ ఆఫీసుకు కేటాయించడంపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
For More News..