చంద్రుడిపై ల్యాండింగ్ మరింత ఈజీ.. గుట్టు తేల్చిన ఇస్రో సైంటిస్టులు..!

చంద్రుడిపై ల్యాండింగ్ మరింత ఈజీ.. గుట్టు తేల్చిన ఇస్రో సైంటిస్టులు..!

హైదరాబాద్, వెలుగు: భవిష్యత్తులో చంద్రుడి మీద ల్యాండింగ్‎ను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించేందుకు ఉపయోగపడే ఓ కీలక అంశాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సైంటిస్టులు గుర్తించారు. రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఉపరితల చార్జింగ్ ప్రభావాలు, చంద్రుడి ధూళితో ఇంటరాక్షన్‎ను ప్రభావితం చేసే చంద్రుడి ప్లాస్మా సాంద్రత సీక్రెట్‎ను వారు ఛేదించారు. చంద్రయాన్ 2 ఆర్బిటర్ పంపిన సమాచారాన్ని స్టడీ చేసిన బెంగళూరులోని ఇస్రో అనుబంధ సంస్థ ఇండియన్ డీప్ స్పేస్ నెట్​వర్క్ (ఐడీఎస్ఎన్) సైంటిస్టులు..  చంద్రుడిపై ప్లాస్మాను నియంత్రించే రెమ్నెంట్ అయస్కాంత క్షేత్రాలు బలంగా ఉన్నట్టు తేల్చారు. 

చంద్రుడిపై చీకటి ప్రాంతంవైపు వాతావరణంలో ఒక క్యూబిక్ సెంటీమీటర్ ప్రదేశంలో 23 వేల వరకు ఎలక్ట్రాన్లు ఉన్నాయని గుర్తించారు. చంద్రుడిపై వెలుతురు ప్రసరించే భాగంవైపుతో పోలిస్తే ఆవతలివైపు వంద రెట్లు ఎక్కువగా ఎలక్ట్రాన్ల సాంద్రత ఉన్నట్టు కనుగొన్నారు.  చంద్రుడు ఒక్కసారి భూమిని చుట్టేసే క్రమంలో నాలుగు రోజులు భూమి జియోటెయిల్(అయస్కాంత క్షేత్రం తోక భాగం) పరిధిలోకి   వస్తుందని, దీంతో సూర్యుడి ఉష్ణ పవనాలు నేరుగా చంద్రుడిని తాకవని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చారు. అయితే, అదంతా తప్పని ఇస్రో సైంటిస్టులు తేల్చారు. 

చంద్రుడి ఉపరితలంలో ఉన్న అయస్కాంత క్షేత్రాల ప్రభావంతో ప్లాస్మా అక్కడే ట్రాప్ అయి ఉంటోందని, దీంతో చంద్రుడికి ఆవతలివైపు వాతావరణంలో ఎలక్ట్రాన్లు ఎక్కువగా ఉండేందుకు ఆస్కారం ఏర్పడుతున్నదని కనుగొన్నారు. దీనిని బాగా అర్థం చేసుకుంటే భవిష్యత్తులో చంద్రుడిపై ల్యాండింగ్, చంద్రుడి ఉపరితలంపై చేపట్టే రోబోటిక్ పరిశోధనలు, మానవ సహిత ప్రయోగాలను మరింత సమర్థంగా చేపట్టే అవకాశం ఉంటుందని ఇస్రో సైంటిస్టులు భావిస్తున్నారు. అయస్కాంత క్షేత్రాల ప్రభావం ఉన్న చోట మనుషుల నివాసానికి అనువైన వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు కూడా ఈ డేటా ఉపయోగపడుతుందని పేర్కొంటున్నారు.