ఆలస్యంగా వచ్చిన అధికారులు .. గ్రామసభను బహిష్కరించిన భూ నిర్వాసితులు

ఆలస్యంగా వచ్చిన అధికారులు .. గ్రామసభను బహిష్కరించిన భూ నిర్వాసితులు

మేడ్చల్ కలెక్టరేట్,  వెలుగు : మేడ్చల్ జిల్లాలోని తూముకుంటలో గురువారం జరిగిన గ్రామసభలో ఉన్నతాధికారుల ఆలస్యంగా రావడంతో భూ నిర్వాసితులు సభను బహిష్కరించారు. రాజీవ్ రహదారిని జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్‌గా విస్తరించేందుకు 200 మీటర్ల స్థలం సేకరణ కోసం ఆర్ అండ్ బి, హెచ్ఎండిఏ, రెవెన్యూ శాఖలు చర్యలు చేపట్టాయి. ఈ  క్రమంలో  ఉదయం 10:30 గంటలకు తూముకుంట మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించాలని అధికారులు ప్రకటించారు.   

 అడిషనల్​ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శంకర్ కుమార్  అధికారులు ఆలస్యంగా రావడంతో భూ నిర్వాసితులు మధ్యాహ్నం 12:30 వరకు ఎదురుచూసి, సభను బహిష్కరించి ఆందోళన చేపట్టారు.  అధికారులు సభ గురించి సమాచారం కూడా ఇవ్వలేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.   మధ్యాహ్నం 12:39కి అధికారులు వచ్చినప్పటికీ, నిర్వాసితులు తిరిగి రాలేదు. దీంతో సభను ఈ నెల 28 ఉదయం 10:30కి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.