రియల్టర్ కోసం కాల్వ దారి మళ్లింపు! పటాన్ చెరు తిమ్మక్క చెరువు కబ్జా

  • 60 ఎకరాల్లో 25 ఎకరాలు కాజేసిన్రు
  • రూ.కోట్ల విలువైన చెరువు భూముల్లో ఫ్యాక్టరీలు, 
  • ఇండ్లకు పర్మిషన్ అక్రమ అనుమతులపై గతంలో  సస్పెన్షన్ల ఎఫెక్ట్
  • మళ్లీ కబ్జాల పర్వం షురూ.. పట్టించుకోని అధికారులు 

సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు : సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు టౌన్ శివారులోని తిమ్మక్క చెరువు 60 ఎకరాల్లో రూ. కోట్లు విలువ చేసే 25 ఎకరాల భూమి ఇప్పటికే కబ్జాకు గురైంది. ఇప్పుడు ఓ రియల్టర్​ కోసం ఏకంగా ఆ చెరువు కాల్వను దారి మళ్లిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఫ్యాక్టరీలు, శిఖం భూమిలో ఇండ్ల నిర్మాణాలు, రియల్టర్ల కోసం కాల్వల మళ్లింపు, మత్తడి ధ్వంసం ఇలా కబ్జాదారులు ఏం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జేపీ కాలనీ, గోనెమ్మ బస్తి, శిశు మందిర్ కాలనీలకు ఆనుకుని ఉన్న తిమ్మక్క చెరువు విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ వస్తోంది. రియల్టర్లు చేసే కబ్జాలను రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లు ప్రోత్సహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాల్వను అక్రమార్కులు కబ్జా చేస్తుంటే.. అధికారులు రూల్స్​కు విరుద్ధంగా నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు.  జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పర్యవేక్షణ లేకుండానే కాల్వ మళ్లించడం విమర్శలకు దారితీస్తోంది. 

అప్పట్లో అలా...

తిమ్మక్క చెరువు 60 ఎకరాలు ఉండగా ప్రస్తుతం సుమారు 35 ఎకరాలే  మిగిలింది. రూ.250 కోట్ల విలువైన చెరువు భూమి కబ్జాకు గురికాగా అందులో అనేక నిర్మాణాలు వెలిశాయి. గతంలో పరిశ్రమల శాఖ ఏకంగా చెరువు శిఖంలోనే లేఅవుట్లు వేసి విక్రయించడం వల్ల శిఖంతో పాటు ఎఫ్ టీఎల్ పరిధిలో కొన్ని ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. శిశు మందిర్ కాలనీకి ఆనుకుని చెరువు శిఖాన్ని మట్టితో పూడ్చేసి రియాల్టర్లు వందల సంఖ్యలో ఇండ్లను నిర్మించి అమ్ముకున్నారు. ఈ విషయమై గతంలో ఫిర్యాదులు అందడంతో సమగ్ర విచారణ చేసిన అధికారులు అప్పటి తహసీల్దార్, ఆర్ఐ, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. చెరువు స్థలాన్ని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. 

ALSO READ: కాల్వలు అయినయ్​...పరిహారం ఆగింది

ఇప్పుడు ఇలా...

గతంలో జరిగిన కబ్జాలపై సీరియస్ యాక్షన్ లేకపోవడంతో ఆక్రమణదారులు చెరువును మళ్లీ కాజేస్తున్నారు. ఓ రియల్టర్ కోసం అధికారులు స్వయంగా చెరువు మత్తడి ద్వారా వరద నీరు దిగువకు వెళ్లే సహజ మార్గాన్ని మరో పక్కకు మళ్లిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాల్వ కోసం అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. పర్మిషన్  రాగానే రియల్టర్ వరద నీటిని చెరువులోకి కాకుండా, పక్కనే ఉన్న వాగులోకి వెళ్లేలా పనులు వేగంగా చేయిస్తున్నాడు. ఒకవేళ ఆ పనులు పూర్తయితే తిమ్మక్క చెరువుకు కింది భాగంలోని గొలుసుకట్టు చెరువులు నీటి కొరతతో నిరుపయోగంగా మారుతాయి. వరద నీరు కూడా నేరుగా పక్కనే ఉన్న కాలనీల్లోకి వెళ్తుంది. దీంతో ఈ అక్రమాలను స్థానికులు తివ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పై ఆఫీసర్లకు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం తిమ్మక్క చెరువు కబ్జాపై స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
 

దర్యాప్తు చేస్తాం

తిమ్మక్క చెరువు కబ్జాపై మూడు శాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా దర్యాప్తు చేస్తాం. చెరువు ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖలు విచారణ చేయాల్సి ఉంటుంది. పంట కాల్వలు దారి మళ్లించాలంటే అందుకు స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. నిపుణులైన ఇంజనీర్లతో కొత్త కాల్వను ఏర్పాటు చేయాలే తప్ప ఎవరికి వారు నిర్మించకూడదు. దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం. 
- పరమేశ్వర్, పటాన్ చెరు తహసీల్దార్