కబ్జా చెరలోనే వర్సిటీల భూములు.. కేయూ ఆక్రమణలపై ఆఫీసర్ల నిర్లక్ష్యం

హనుమకొండ, వెలుగు: ప్రభుత్వ యూనివర్సిటీల భూములను అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. సరైన రక్షణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం, అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడంవల్లవర్సిటీ ల్యాండ్స్ అక్రమార్కుల పాలవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికే రూ.వందల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం కాగా.. ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో దాదాపు రూ.10 కోట్ల విలువైన భూమిని అక్రమార్కులు కబ్జా చేసినట్టు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని మిగతా వర్సిటీల్లోనూ భూముల కబ్జా జరిగినట్టు తెలుస్తోంది. 

తతవందల కోట్ల విలువైన భూములు కబ్జా

వరంగల్​లో 1967లో ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్ ఏర్పాటు చేయగా.. అది 1976లో కాకతీయ యూనివర్సిటీగా అవతరించింది. 1967లోనే హనుమకొండలోని కుమార్​ పల్లి, లష్కర్​ సింగారం, పలివేల్పుల గ్రామాల పరిధిలో దాదాపు 1,018 ఎకరాల భూమిని సేకరించారు. సిటీకి మధ్యలో ఉండటం, సరైన రక్షణ లేకపోవడం, పొలిటికల్​ లీడర్లు, ఆఫీసర్ల ప్రోద్బలంతో పలివేల్పుల, గుండ్లసింగారం వైపు ఆక్రమణలు జరిగాయి. గతంలో కేయూ అధికారులు కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. కొందరు కోర్టుకు వెళ్లి భూములు చేజిక్కించుకున్నారు.

కేయూ పక్క నుంచి ఎస్సారెస్పీ కెనాల్ నిర్మించారు. అక్కడే కేయూ పోలీస్​స్టేషన్, రేడియోస్టేషన్, ఫిల్టర్​బెడ్, విద్యుత్తు సబ్ స్టేషన్​ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా ఆక్రమణలు కొనసాగాయి. 2021 మేలో కేయూ వీసీగా వచ్చిన ప్రొఫెసర్ తాటికొండ రమేశ్​ ఫిర్యాదు చేయడంతో అప్పటి కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు డిఫరెన్షియల్​ గ్లోబల్​ పొజిషనింగ్​ సిస్టం(డీజీపీఎస్​) ద్వారా వర్సిటీ భూముల సర్వే చేయించారు. అందులో వర్సిటీ పరిధిలో 673. 12 ఎకరాలభూమి ఉన్నట్టు తేలగా, ఇందులోనూ ఆక్రమణలున్నట్లు గుర్తించారు. పలివేల్పుల శివారు 229, 412, 413, 414 సర్వే నెంబర్లలో కొందరు భూమి ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నట్టు గుర్తించారు. 

రెండేండ్లయినా రిపోర్ట్​ ఊసేలేదు

అప్పటి సర్వే ప్రకారం 229 సర్వే నెంబర్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబుతో పాటు మొత్తం 13 మంది పోలీస్ అధికారులు కబ్జా చేసినట్టు నిర్ధారించారు. భూమి ఆక్రమించి ఇండ్లు కట్టుకున్న 13 మందికి 2022 మార్చిలో జీడబ్ల్యూఎంసీ ఆఫీసర్లు నోటీసులు జారీ చేశారు. మున్సిపల్ బిల్డింగ్ పర్మిషన్​, రిజిస్ట్రేషన్​ పేపర్లు, లింక్​ డాక్యుమెంట్లతో సహా పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే అక్రమార్కులు ఆఫీసర్లను మేనేజ్​ చేసినట్టు ప్రచారం జరిగింది. అసిస్టెంట్​ రిజిస్ట్రార్​ అశోక్​ బాబు ల్యాండ్​ కమిటీ కన్వీనర్​కాగా ఆయనే కబ్జాకు పాల్పడినట్టు తేలడం విశేషం.

సర్వే నంబర్​229లో ఇల్లు కట్టుకున్న ఆయన 235 సర్వే నెంబర్​లో ఉన్నట్టు తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆయనను 2022 సెప్టెంబర్​​ లో జరిగిన ఈసీ మీటింగ్​ లో ల్యాండ్​ కమిటీ నుంచి తొలగించారు. లాండ్​ కమిటీ రిపోర్ట్​పై కమిటీ చైర్మన్​అయిన వీసీ ఈసీ మీటింగ్​లో చర్చించి ఆమోదించాలి. కానీ రిపోర్ట్​ఇచ్చి చేసి రెండేండ్లయినా చర్చ జరగలేదు. కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని మహబూబాబాద్ పీజీ సెంటర్ లోనూ స్థలం కబ్జాకు గురైంది. 

ఓయూలో సగం భూములు ఔట్ 

ఉస్మానియా యూనివర్సిటీ కోసం 1917లో హబ్సిగూడ, లాలాగూడ, రామాంతాపూర్, అంబర్‌పేట, జమిస్తాన్‌పూర్ రెవెన్యూ గ్రామాల పరిధిలోని దాదాపు 2,200 ఎకరాల భూమిని సేకరించారు. ఆ తరువాత వర్సిటీ భూములు ఆక్రమణలకు గురి కాగా.. చివరకు ఓయూకు 1,627 ఎకరాలు మిగిలినట్లు అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్‌జీఆర్‌ఐ, దూరదర్శన్‌, హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ హాస్పిటల్, క్రికెట్‌స్టేడియం తదితర అవసరాలకు ప్రభుత్వం 573 ఎకరాలు కేటాయించింది.

యూనివర్సిటీ భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయించరాదన్న నిబంధనలను కాదని 183 ఎకరాలను అధికారులు వివిధ సంస్థలకు లీజ్​ కు ఇచ్చారు. ఓ పెట్రోల్​ బంక్​ కు స్థలం లీజ్​ కు ఇవ్వడం గతంలో వివాదానికి దారి తీసింది. మరో 175 ఎకరాలు ఇప్పటికే ఆక్రమణకు గురికాగా.. మరో 200 ఎకరాల్లో బస్తీలున్నాయి.మరో57 ఎకరాలకు సంబంధించి కొందరు ఆ భూములు తమవేనని కోర్టుకెళ్లగా.. దానిపై కోర్టులో వివాదం నడుస్తోంది.

విద్యార్థులు కొట్లాడుతున్నా చర్యలు శూన్యం

వర్సిటీ భూములను కాపాడుకునేందుకు స్టూడెంట్స్​ కొట్లాడుతున్నా ఫలితం ఉండడంలేదు. కాకతీయ భూముల రక్షణ కోసం వివిధ విద్యార్థి సంఘాలు చాలాసార్లు ఆందోళన చేపట్టాయి. సోమవారం హనుమకొండ గ్రీవెన్స్​లో కలెక్టర్ కు వినతిపత్రం కూడా ఇచ్చారు. వర్సిటీ భూముల రక్షించేందుకు క్యాంపస్​ చుట్టూ 8 కిలోమీటర్ల మేర గోడ కడతామని గతంలో హామీ ఇచ్చిన వీసీ రమేశ్​ ఏండ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వం హామీలిచ్చినా భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోలేదు.

శాతవాహనలో రూ.10 కోట్ల భూమికి ఎసరు

కరీంనగర్​ లోని శాతవాహన యూనివర్సిటీలోనూ కబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. వర్సిటీ ఫార్మసీ కాలేజీ 42.14 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. అందులో దాదాపు 12 ఎకరాలను వివిధ అవసరాలకు కేటాయించారు. ఇంకా 30.04 ఎకరాలు మిగిలింది, కాలేజీ పక్కన ఉన్న ఓ వ్యక్తి తన స్థలాన్ని చదును చేస్తూ కాలేజీ ల్యాండ్​ లోకి ఎంటరయ్యాడు. అక్కడున్న షెడ్డు కూల్చేసి పోల్స్​ పాతాడు. అది గుర్తించి ప్రిన్సిపల్​ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఫార్మసీ కాలేజీకి చెందిన దాదాపు రూ.10 కోట్ల భూమి ఆక్రమణకు గురైందని, వర్సిటీ భూములను రక్షించాలని స్టూడెంట్స్​కోరుతున్నారు.