హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో ప్రజలకు ఆహ్లాదాన్ని అందించాల్సిన పార్కులు అన్యాక్రాంతమవుతున్నాయి. రక్షణ కల్పించకపోవడం, ఆక్రమణలు జరుగుతున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో పార్కులు కనిపించకుండా పోతున్నాయి. హనుమకొండ బాలసముద్రంలో రూ.కోట్లు విలువ చేసే పార్కు స్థలంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నిర్మించారని తాజాగా వివాదం రాజుకోగా, నగరంలో ఆక్రమణకు గురవుతున్న పార్కు స్థలాలపై చర్చ జరుగుతోంది.
ఆక్రమణల లో పార్కులు
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 371 పార్కులు ఉండగా, అందులో దాదాపు 159 పార్కులకు సరైన రక్షణ లేదు. వాటి చుట్టుపక్కల ఇండ్లు నిర్మించుకున్నవారితో పాటు కొంతమంది బయటి వ్యక్తులు కూడా పార్కు స్థలాలను కబ్జా పెట్టారు. ఇలా సిటీ అంతటా 67 పార్కుల్లో ఆక్రమణలు జరిగినట్లు తెలుస్తోంది. అందులో 45 పార్కు స్థలాలపై కేసులు వేయడంతో కోర్టు వివాదాలు నడుస్తున్నాయి. సరైన కాంపౌండ్లు , కనీసం ఫెన్సింగ్ కూడా లేకపోవడం తో పార్కులు కబ్జా అవుతున్నాయి.
రక్షణ లేని ఓపెన్ ల్యాండ్స్
జీడబ్ల్యూఎంసీ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం 401 వరకు లేఅవుట్ కాలనీలుండగా, వాటి ఏర్పాటు సమయంలోనే 10 శాతం ల్యాండ్ ను గుడి, బడి, పార్కులకు కేటాయించారు. చాలాచోట్లా రీక్రియేషన్ కోసం పార్కుల అవసరం ఉన్నప్పటికీ గ్రేటర్ అధికారులు వాటిపై శ్రద్ధ పెట్టడం లేదు. దీంతో ఓపెన్ ల్యాండ్స్ అన్నీ అక్రమార్కుల పాలవుతున్నాయి. హనుమకొండ వేంకటేశ్వర కాలనీ ఏరియాలో పార్కు కోసం కేటాయించిన ఓపెన్ ల్యాండ్ ను గతంలో ఓ పొలిటికల్ లీడర్ అండతో ఓ రియల్టర్ కబ్జా చేసి ఇండ్లు నిర్మించారనే ఆరోపణలున్నాయి.
రూ.కోట్లు విలువైన ల్యాండ్ ఖతం
వరంగల్ నగరంలోని బాలసముద్రం ఏరియాలో 1968లోనే సర్వే నెంబర్ 1066లో దాదాపు 200 ఎకరాల్లో లేఅవుట్ వెంచర్ ఏర్పాటు చేశారు. అందులో అప్పట్లోనే నిబంధనల ప్రకారం దాదాపు 20 పార్కుల ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించారు. కొన్నిచోట్లా అక్కడి పరిస్థితిని బట్టి ఎకరం వరకు స్థలాన్ని వదిలారు. కానీ ఇప్పుడు అందులో చాలా భూములు కానరాకుండా పోయాయి.
రెండేండ్ల కిందట బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు కోసం ఎకరం స్థలాన్ని అగ్గువకే కొనుగోలు చేసి, పార్కు స్థలాన్ని కనుమరుగు చేశారు. దీనికి కొద్దిదూరంలో దాదాపు రూ.10 కోట్లు విలువ చేసే ఓపెన్ ల్యాండ్ ను కొంతమంది కబ్జా చేసి, రికార్డులు మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నారు. అందులో వివిధ పార్టీలకు చెందిన లీడర్లు కూడా ఉండగా, కార్పొరేషన్ అధికారులు రెండేండ్ల కిందట దానికి కాంపౌండ్ నిర్మించి రక్షణ చర్యలు చేపట్టారు.
వాస్తవానికి వరంగల్ నగరంలో అత్యధిక పార్కులున్న ప్రాంతం బాలసముద్రమే కాగా, వాటి రక్షణకు అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. ఇకనైనా గ్రేటర్ లీడర్లు, మున్సిపల్ అధికారులు నగరంలో పార్కుల స్థలాల రక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.