కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జా చెర వీడటం లేదు. వర్సిటీ భూములు ఎప్పటినుంచో అన్యాక్రాంతమవుతున్నా కబ్జాదారులపై ఆఫీసర్లు యాక్షన్ తీసుకోవడం లేదు. వర్సిటీ స్టూడెంట్యూనియన్ల ఆందోళనలతో గతేడాది డిజిటల్ సర్వే చేపట్టిన ఆఫీసర్లు ఆక్రమణలు నిజమేనని తేల్చారు. వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్ల ఆఫీసర్లే ఈ కబ్జాలకు పాల్పడినట్లు గుర్తించి.. 13 మందికి నోటీసులు కూడా జారీ చేశారు. కానీ ఆ తరువాత వర్సిటీ భూముల పరిరక్షణ గాలికొదిలేశారు. కేయూలో కబ్జాల బాగోతాన్ని తేల్చేందుకు ప్రత్యేకంగా ల్యాండ్ కమిటీ ఏర్పాటు చేసినా డీటైల్డ్ రిపోర్ట్ ఉన్నతాధికారులకు సమర్పించడంలో ఆ కమిటీ జాప్యం చేస్తోంది. ఫలితంగా ఆక్రమణలు బయటపడి నెలలు గడుస్తున్నా అక్రమార్కులపై చర్యలు కరువయ్యాయి.
హనుమకొండ, వెలుగు: కాకతీయ యూనివర్సిటీని 1968లో ఉస్మానియా యూనివర్సిటీకి పీజీ సెంటర్‌గా ఏర్పాటు చేశారు. దీనికోసం అప్పట్లో 1,018 ఎకరాల భూమిని కేటాయించారు. తర్వాత అదే స్థలంలో 1976లో కాకతీయ వర్సిటీని ఏర్పాటు చేశారు. 1980లో ఎస్సార్ఎస్పీ కెనాల్ కోసం దాదాపు 43 ఎకరాల భూమిని ఇచ్చారు. అనంతరం కేయూ పోలీస్‌స్టేషన్, రేడియో కేంద్రం, జీడబ్ల్యూఎంసీ వాటర్‌ఫిల్టర్ బెడ్ తదితర ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ ఇవ్వగా.. చివరకు కేయూకు 620 ఎకరాల భూమి మిగిలింది. రోజురోజుకు భూముల రేట్లు పెరిగిపోతుండటం, వర్సిటీ భూములకు రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో కొన్నేండ్లలో పెద్ద ఎత్తున ఆక్రమణలు మొదలయ్యాయి. 412, 413, 414 తదితర సర్వే నంబర్లలో రూ. కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. దీంతో స్టూడెంట్యూనియన్లు ఆందోళనకు దిగాయి. తరచూ వర్సిటీ భూముల్లో ఆక్రమణలు జరుతుండటంతో గత ఏడాది హనుమకొండ జిల్లా కలెక్టర్రాజీవ్గాంధీ హనుమంతు, వీసీ తాటికొండ రమేశ్ఇతర ఆఫీసర్లతో సమావేశమయ్యారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్లతో డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం(డీజీపీఎస్) తో సర్వే చేయించగా.. కేయూ భూముల్లో ఆక్రమణలు నిజమేనని తేలింది. సర్వే నంబర్229తో పాటు 412, 413, 414 సర్వే నంబర్లలో ఇండ్లు వెలిసినట్లు అధికారులు గుర్తించారు. అనంతరం జీడబ్ల్యూఎంసీ నుంచి 13 మందికి నోటీసులు అందజేయగా.. అందులో ముగ్గురు వర్సిటీకి చెందిన ఉద్యోగులే ఉన్నారు. మిగతా పది మందిలో పొలిటికల్ లీడర్లు, పోలీస్ఆఫీసర్లు, వర్సిటీ ఆఫీసర్ల సహకారం ఉన్న వ్యక్తులుండటం గమనార్హం. కాగా 229 సర్వే నంబర్ లో వర్సిటీ అసిస్టెంట్‌రిజిస్ట్రార్ ఇల్లు కూడా ఉందని తేలింది. వారందరిపై మున్సిపల్ యాక్ట్- 2019 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. కానీ ఆ తరువాత వివిధ కారణాలతో ఆ ప్రక్రియ కాస్త మరుగున పడిపోయింది.
రిపోర్ట్ ఇవ్వని ల్యాండ్ కమిటీ
డిజిటల్ సర్వే అనంతరం మ్యాప్ రెడీ చేసి ఆఫీసర్లు కలెక్టర్‌కు అందజేశారు. ఆ తరువాత ల్యాండ్ కమిటీ డీటైల్డ్రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. అయితే భూకబ్జాల్లో వర్సిటీ అధికారులే ఉండటం, ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో ల్యాండ్ కమిటీకి చైర్మన్ గా ఉన్న ప్రొఫెసర్మనోహర్ఆ పదవి నుంచి తప్పుకున్నారు. తర్వాత ప్రొఫెసర్నాగేందర్కు బాధ్యతలు అప్పగించారు. ఇదే కమిటీలో కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్ కూడా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే కొద్దిరోజుల కిందట హైదరాబాద్ లో జరిగిన వర్సిటీ పాలక మండలి మీటింగ్‌లో కమిషనర్ నవీన్ మిట్టల్ భూకబ్జాదారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పండని వీసీ తాటికొండ రమేశ్‌ను నిలదీసినట్లు తెలిసింది. దాంతో కొద్దిరోజుల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ ను ల్యాండ్ కమిటీ నుంచి తొలగించి ప్రొఫెసర్ డా.చంద్రమౌళిని నియమించారు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా ల్యాండ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ల్యాండ్ కమిటీ నిక్కచ్చిగా రిపోర్ట్ సమర్పిస్తే భూకబ్జాల బాగోతం బయటపడుతుందనే చర్చ వర్సిటీలో జోరుగా సాగుతోంది.
బోర్డులు పీకేస్తున్నరు
కాకతీయ యూనివర్సిటీ భూములు ఆక్రమణకు గురవుతున్నప్పుడల్లా ఆఫీసర్లు బోర్డులు పెట్టి హడావుడి చేస్తున్నారు. ఇలానే గుండ్ల సింగారం, పలివేల్పుల వైపు గతంలో ‘ఈ భూమి కాకతీయ యూనివర్సిటీకి చెందినది. ఆక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు’ అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. కానీ కొందరు అక్రమార్కులు ఆ బోర్డులను పీకేసి ఆక్రమణకు పాల్పడుతున్నారు. గతంలో ఆఫీసర్లు ఏర్పాటు చేసిన వాటిల్లో ఇప్పుడు సగం బోర్డులు లేవు. వర్సిటీ భూముల రక్షణకు చుట్టూ 8 కిలోమీటర్ల మేర కాంపౌండ్ నిర్మించాల్సి ఉంది. ఇందుకు దాదాపు ఐదారు కోట్లు అవసరం. కానీ వర్సిటీలో డెవలప్మెంట్ ఫండ్లేకపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతోనే కేయూ భూముల పరిరక్షణ ప్రశ్నార్థకమవుతోంది. ఇకనైనా ల్యాండ్ కమిటీ రిపోర్ట్ తొందరగా అందజేసి అక్రమార్కులపై యాక్షన్ తీసుకోవాలని, వర్సిటీ భూముల రక్షణకు చర్యలు చేపట్టాలని విద్యావేత్తలు, స్టూడెంట్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు.