పాత స్టాంప్ పేపర్లతో భూ దందాలు

హనుమకొండ, వెలుగు: ఓరుగల్లు నగరంలో  రకరకాల పద్ధతుల్లో భూ కబ్జాలు జరుగుతున్నాయి. కొంతమంది ల్యాండ్ గ్రాబర్స్​ అమాయకుల భూములను బలవంతంగా లాక్కుని దౌర్జన్యాలకు దిగుతుండగా..  ఇంకొందరు ఖాళీ స్థలాలకు నకిలీ పేపర్లు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారు. మరికొందరు పాత నాన్​ జ్యుడిషియల్​ స్టాంప్(బాండ్​) పేపర్లతో కబ్జాలు  చేస్తున్నారు. సిటీలో కొంతమంది స్టాంప్​ వెండర్లు  ల్యాండ్ మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ల్యాండ్ వ్యాల్యూను బట్టి రూ.వేల నుంచి రూ.లక్షలు వసూలు చేసి.. పాత స్టాంప్​ పేపర్లను అక్రమార్కులకు అందిస్తుండటంతో వారు నకిలీ నోటరీలు చేయడం, ఆ తరువాత ఆఫీస్​ సిబ్బంది సహకారంతో రిజిస్ట్రేషన్లూ పూర్తి చేసేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో క్షేత్రస్థాయిలో భూవివాదాలు ఎక్కువకావడమే కాకుండా ఎంతోమంది అమాయకులు నష్టపోతున్నారు.

స్టాంప్​ వెండర్ల సహకారంతో..

వరంగల్ లో ఒకప్పుడు రూ.వేలు, రూ.లక్షలు ఉన్న భూముల రేట్లు ఇప్పుడు రూ.కోట్లకు పెరిగాయి. దీంతో రియల్ వ్యాపారం కూడా జోరందుకుంది. ఈ క్రమంలోనే కొందరు  భూ దందాలకు తెరలేపారు. ఖాళీ జాగలు,  అమాయకుల స్థలాలపై కన్నేసి, ఆ తర్వాత అదే భూమికి తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నారు. సిటీలో దాదాపు 70 మంది వరకు స్టాంప్​ వెండర్లు ఉండగా.. అందులో కొందరు డబ్బులకు ఆశపడి అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారు. తమ వద్ద ఉన్న  ఏండ్ల కిందటి రూ.50, రూ.100 బాండ్​ పేపర్లను  భూ కబ్జాకోరులకు అమ్ముతున్నారు. ఇందుకు ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు. సాధారణంగా తెలంగాణ గవర్నమెంట్ కు సంబంధించిన బాండ్​ పేపర్​ కావాలంటే ఒకరేటు..  ఉమ్మడి ఏపీకి సంబంధించిన స్టాంప్​ పేపర్లు కావాలంటే ఇంకో రేటు అమలు చేస్తున్నారు. ఓల్డ్ పేపర్లు.. ఇల్లీగల్​ డాక్యుమెంట్లు వాస్తవానికి స్టాంప్​ వెండర్ల బాండ్ల క్రయవిక్రయాల వివరాలపై సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​ స్టాఫ్ పర్యవేక్షణ ఉండాలి. కానీ అదంతా ఏమీ జరగడం లేదు. దీంతో కొంతమంది స్టాంప్​ వెండర్లు పాత బాండ్​ పేపర్లను దాచుకుని వాటితో ఇప్పుడు రూ.లక్షల్లో బిజినెస్​ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇప్పటికీ ఏండ్ల కిందటి బాండ్​ పేపర్లు అక్రమార్కుల చేతుల్లో దర్శనమిస్తుండటం, వాటితో రూ.కోట్లు విలువ చేసే భూముల విషయంలో అక్రమాలు జరుగుతుండటమే ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.  ఇటీవల పలివేల్పుల సమీపంలోని ల్యాండ్​ ను కబ్జా చేసిన బీఆర్​ఎస్​ నేత నన్నబోయిన రమేశ్.. తమది కాని భూమికి 1993 నాటి బాండ్​ పేపర్​ తో అక్రమంగా నోటరీ చేసినట్లు తేలింది. ఆ తరువాత సబ్​ రిజిస్ట్రార్​ ఆఫీస్​ సిబ్బంది సహకారంతో అదే నోటరీని రెగ్యులరైజ్​ చేయించి, అక్రమంగా సేల్​ డీడ్​ కూడా తయారు చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇటీవల  ఈ  ఘటనలో కేసు నమోదు కాగా..  ఇదివరకు సుబేదారి, కాకతీయ యూనివర్సిటీ, హసన్​పర్తి, మిల్స్​ కాలనీ స్టేషన్ల పరిధిలో ఫేక్​ డాక్యుమెంట్ల కేసులు పదుల సంఖ్యలో నమోదు అయ్యాయి. అడపాదడపా ఇలాంటివి బయటపడుతుండగా..  బయటకు రాని ఘటనలు చాలానే ఉన్నాయని కొంతమంది రియల్​ వ్యాపారులు కూడా  చెబుతుండటం గమనార్హం. కాగా సిటీలోని సుబేదారి, హసన్​ పర్తి ఏరియాల్లోని కొంతమంది స్టాంప్ వెండర్లు  ఏ సంవత్సరానికి సంబంధించిన బాండ్​ ​ పేపర్లయినా  సమకూరుస్తారనే ప్రచారం సాగుతోంది.

రిజిస్ట్రేషన్లూ చేసేస్తున్నరు..

ఇదివరకు భూముల క్రయవిక్రయాలసమయంలో స్టాంప్​ డ్యూటీ, రిజిస్ట్రేషన్​ ఛార్జీలను భారంగా భావించి చాలామంది నోటరీలకే పరిమితం అయ్యారు. దీంతో కొంతమంది భూ అక్రమార్కులు పాత పేపర్లతో దందా జోరుగా సాగిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇలాంటి ఓల్డ్​ నాన్​ జ్యుడిషియల్​ స్టాంప్​ పేపర్లతో దుండగులు నకిలీ నోటరీలు సృష్టిస్తుండగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆఫీస్​ సిబ్బంది సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  పర్యవేక్షణ చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడం, ఆఫీస్​ సిబ్బంది అక్రమార్కులకు సహకరిస్తున్నా దృష్టి పెట్టకపోవడంతో రిజిస్ట్రేషన్​ ఆఫీసుల్లో అక్రమాలు జరుగుతున్నాయి.ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు  పాత స్టాంప్​ పేపర్ల దందాతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.