శ్రీశైలంలో భారీ వర్షం.. విరిగిపడ్డ కొండచరియలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తెలంగాణాలో కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ లో జనజీవనం అస్తవ్యస్తం కాగా... ఏపీలో నంద్యాల జిల్లా శ్రీశైలంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. 4గంటల పాటు ఏకధాటిగా వర్షానికి శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర కొండచరియలు విరిగిపడ్డాయి. బుధవారం ( ఆగస్టు 20, 2024 ) రాత్రి భారీ వర్షానికి కొండ చరియలు పడినట్లు తెలుస్తోంది.

కొండచరియలు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎగువన అటవీప్రాంతం నుంచి ఉధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద ప్రవాహంలో బైకులు కొట్టుకుపోయాయి. స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొత్తపేట, శ్రీగిరి కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండచరియలు విరిగిపడ్డ ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.