
బీజింగ్: చైనాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సెంట్రల్ చైనాలోని హువాన్ ప్రావిన్స్ లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రావిన్స్ లోని హెంగ్యాంగ్ సిటీకి దగ్గరగా ఉన్న యుయెలిన్ గ్రామంలో ఆదివారం కొండచరియలు విరిగిపడటంతో దిగువన ఉన్న పలు ఇండ్లు ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మొత్తం 11 మంది చనిపోయారని, ఒకరు గల్లంతయ్యారని తెలిపారు. గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు. కాగా, ప్రావిన్స్ లో వరదల వల్ల కొండచరియలు విరిగి ఓ గెస్ట్ హౌస్ పై పడ్డాయి. ఈ ఘటనలో 18 మంది సమాధి అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు.