శ్రీశైలం ఘాట్‌‎‌లో విరిగిపడ్డ కొండచరియలు.. మన్ననూర్‌‌ చెక్‌‌పోస్ట్‌ క్లోజ్

అమ్రాబాద్, వెలుగు: భారీ వర్షాల కారణంగా నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలం ఘాట్‌‌రోడ్డుపై కొండ చరియలు విరిగి పడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున దోమలపెంట సమీపంలో కొండ చరియలు విరిగి రోడ్డుపై పడడంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే ఎగువన కురిసిన వర్షాలకు శ్రీశైలం పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాం సమీపంలో ఘాట్‌‌ రోడ్డు పూర్తిగా జలమయం అయింది. 

వర్షం కారణంగా ఘాట్‌‌ రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున శ్రీశైలం రోడ్డు మూసివేశారు. శ్రీశైలం వెళ్లే వాహనాలను మన్ననూర్‌‌ చెక్‌‌పోస్ట్‌‌ వద్దే ఆపేస్తున్నారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌‌ జామ్‌‌ అయింది. ట్రాఫిక్‌‌ను కంట్రోల్‌‌ చేసేందుకు ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది కృషి చేస్తున్నారు. వర్షాలు తగ్గే వరకు భక్తులు ఎవరూ శ్రీశైలం రావద్దని ఆఫీసర్లు సూచిస్తున్నారు.