
గ్యాంగ్‌టక్: సిక్కింలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రధానంగా నార్త్ సిక్కిం మంగన్ జిల్లాలోని చుంగ్‌థాంగ్, లాచెన్, లాచుంగ్ ప్రాంతాల్లో సుమారు 200 టూరిస్ట్ వెహికల్స్ రోడ్లపైనే నిలిచిపోయాయి. వాటిలో వెయ్యి మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. పర్యాటకులంతా స్థానిక గురుద్వారాలో రాత్రి ఆశ్రయం పొందారు. లాచెన్,- చుంగ్‌థాంగ్ రహదారిపై.. అలాగే, మున్షిథాంగ్, లాచుంగ్, -చుంగ్‌థాంగ్ రహదారిపై కొండచరియలు ఎక్కువగా విరిగిపడ్డాయని అధికారులు వెల్లడించారు.
శుక్రవారం తెల్లవారుజాము నుంచి టూరిస్టులందరిని సంగ్కలాంగ్‌లోని బెయిలీ బ్రిడ్జి ద్వారా మంగన్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. మంగన్ నుంచి వారంతా గ్యాంగ్‌టక్‌కు చేరుకుంటారని వివరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ఘటనపై సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్ స్పందించారు. టూరిస్టులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం రాత్రికల్లా అందరినీ గ్యాంగ్‌టక్‌కు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
పర్యాటక అనుమతులు రద్దు
భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు కొండచరియలు విరిగిపడుతుండటంతో మంగన్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర సిక్కిం కోసం అన్ని పర్యాటక అనుమతులను రద్దు చేసింది. ఇప్పటికే జారీ చేసిన అనుమతులు కూడా
చెల్లవని స్పష్టం చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు టూరిస్టులను నార్త్ సిక్కిం వైపు పంపవద్దని టూర్ ఆపరేటర్లకు సూచించింది