హైదరాబాద్, వెలుగు: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ స్కీం ‘మహాలక్ష్మి’తో మెట్రోకు నష్టాలు వస్తున్నాయని ఎల్ అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ఆఫీసర్ శంకర్ రామన్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఎల్ అండ్ టీ సంస్థ ఆర్ఠికంగా నష్టపోతున్నదని చెప్పారు. ఆదివారం ఆయన ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఇచ్చిన ఇలాంటి హామీలు ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా మారుతాయని, 2026లో మెట్రో రైలు నిర్వహణను వేరే సంస్థకు బదిలీ చేసే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోందని తెలిపారు.
రాష్ట్రంలోని మహిళలందరూ మహాలక్ష్మి స్కీంను వినియోగించుకుంటున్నారని, పురుషులు మాత్రమే రూ. 35 కనీస చార్జీలతో మెట్రోలో ప్రయాణిస్తున్నారని, దీంతో సంస్థ ఆదాయానికి గండి పండుతున్నదని చెప్పారు. ప్రస్తుతం మెట్రోలో రోజుకు 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఈ సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహాలక్ష్మి స్కీం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని చెప్పారు. బస్సులు ఎక్కువగా నడుస్తుంటే వాటి లైఫ్‌టైం తగ్గిపోతుందని, దీని వల్ల ఆ సంస్థకు నష్టం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాలో రాజకీయ హామీలు రాబోయే రోజుల్లో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని శంకర్ రామన్ అభిప్రాయపడ్డారు.