- ఆనాటి సర్కార్ స్పందించి ఉంటే మేడిగడ్డ కుంగేది కాదు
- కాళేశ్వరం కమిషన్ ఎదుట ఎల్అండ్టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ రాజు వెల్లడి
- డిజైన్లలో లోపాలు ఉన్నాయని ఐఐటీ రూర్కీ స్టడీలో తేలింది: సురేశ్ కుమార్
- ఏడో బ్లాక్‌ను కొత్తగా నిర్మించాల్సిందే
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీలను 2019లోనే గుర్తించి ఆనాటి ప్రభుత్వాన్ని అలర్ట్చేశామని, కానీ అప్పటి సర్కార్ సరిగా స్పందించలేదని.. అప్పుడే చర్యలు చేపట్టి ఉంటే మేడిగడ్డ కుంగేది కాదని ఆ బ్యారేజీని నిర్మించిన ఎల్అండ్టీ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంవీ రామకృష్ణ రాజు తెలిపారు. ‘‘2019 సెప్టెంబర్‌లో భారీ వరదలు వచ్చాయి. అవి తగ్గాక గేట్లు క్లోజ్చేయగా బ్యారేజీ దిగువన సీసీ బ్లాకులు కొట్టుకుపోయినట్టు గుర్తించాం. దాంతో పాటు చాలా డ్యామేజీ జరిగింది. బ్యారేజీ వద్ద టీజీఈఆర్ఎల్తో మరోసారి మోడల్ స్టడీస్ చేయించాల్సిన అవసరం ఉందని 2019 నవంబర్11న ప్రాజెక్ట్ఎస్ఈకి ప్రాజెక్ట్ఈఈ లేఖ రాశారు.
ఆ తర్వాత 2020 జనవరిలో సీడీవో అధికారులు, పుణెకి చెందిన సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) నిపుణులు బ్యారేజీని పరిశీలించి డ్యామేజీలను అంచనా వేశారు” అని వెల్లడించారు. కాళేశ్వరం జ్యుడీషియల్కమిషన్విచారణకు శుక్రవారం ఎల్అండ్టీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామకృష్ణ రాజు, సంస్థ హైడల్ అండ్ టన్నెల్స్బిజినెస్ హెడ్ సురేశ్ కుమార్, సంస్థ మాజీ డీజీఎం రజనీశ్ చౌహాన్హాజరయ్యారు. అసలు మేడిగడ్డ బ్యారేజీ ఎందుకు కుంగింది? డిజైన్లు, డ్రాయింగ్స్, ఇన్వెస్టిగేషన్లపై తీసుకున్న చర్యలేంటి? అని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు.
‘‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సిఫార్సుల మేరకు ఏటా వానాకాలానికి ముందు బ్యారేజీని ఖాళీ చేసి డ్యామేజీలు ఏవైనా ఉంటే రిపేర్లు చేయాలి. కానీ నాటి ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సిఫార్సులను అమలు చేయలేదు. అందుకే బ్యారేజీకి డ్యామేజ్జరిగింది” అని రామకృష్ణ రాజు తెలిపారు. తమ సంస్థకు ఇచ్చింది కేవలం పీస్‌రేట్ కాంట్రాక్టేనని, డిజైన్ల బాధ్యత డిపార్ట్మెంట్దేనని చెప్పారు. వారు ఇచ్చిన డిజైన్స్, డ్రాయింగ్స్‌ను తాము కేవలం నిర్మాణానికి యోగ్యంగా ఉంటాయా? లేదా? అన్నది మాత్రమే పరిశీలిస్తామని పేర్కొన్నారు. డిజైన్లలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేయాలని డిపార్ట్మెంట్కు లేఖలు రాశామన్నారు.
నీటి వేగాన్ని నియంత్రించేందుకు చర్యలు..
బ్యారేజీల గేట్లు తెరిచాక వచ్చే వరద వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్ల లాంటి థ్రస్ట్ బ్లాకర్లను ఏర్పాటు చేయాల్సిందిగా 2020లో ఐఐటీ హైదరాబాద్ సూచించిందని రామకృష్ణ రాజు చెప్పారు. ప్రాజెక్ట్ సైట్ప్రకారం కాఫర్ డ్యామ్‌ను నిర్మించాలంటూ 2018 జులై 21న డిపార్ట్మెంట్కు లేఖ రాశారు కదా? కాంట్రాక్ట్ ప్రకారం కాఫర్ డ్యామ్ నిర్మాణం, బ్యారేజీ పూర్తయ్యాక దాన్ని తొలగించడం మీ బాధ్యత కాదా? అని కమిషన్ ప్రశ్నించింది. కాఫర్ డ్యామ్ నిర్మాణం ఏజెన్సీ బాధ్యత కాదని రామకృష్ణ రాజు చెప్పారు. తాము బ్యారేజీ ఎత్తులో సెమీ పర్మనెంట్ కాఫర్ డ్యామ్ నిర్మించామని, తద్వారా నీటి ప్రవాహాన్ని డైవర్ట్చేసి బ్యారేజీని నిర్మించామని తెలిపారు.
పది మీటర్ల లోతు వరకు కాఫర్ డ్యామ్‌కు కూడా షీట్పైల్స్వేశామన్నారు. కానీ, ఆ పనికి ప్రభుత్వం చెల్లింపులు చేయలేదన్నారు. బ్యారేజీలో సీపేజీ ఎందుకు వచ్చింది? అని కమిషన్ ప్రశ్నించగా.. సీసీ బ్లాకులు, బ్యారేజీ పైల్స్వద్ద ఉన్న ఇసుకను వరద వేగంగా తాకడం వల్లే సీపేజీలు ఏర్పడ్డాయని సమాధానమిచ్చారు. సబ్‌కాంట్రాక్ట్‌లు ఏమైనా ఇచ్చారా? అని కమిషన్ ప్రశ్నించగా.. సబ్‌కాంట్రాక్టులు ఎవరికీ ఇవ్వలేదని రామకృష్ణ రాజు సమాధానమిచ్చారు.
మేడిగడ్డ బ్యారేజీలోని మిగతా అన్ని బ్లాకులు బాగానే ఉన్నా, ఒక్క ఏడో బ్లాకే ఎందుకు కుంగిందని కమిషన్ ప్రశ్నించింది. పేరున్న సంస్థగా సమస్యేందో తెలుసుకోవాల్సిన అవసరం మీకు లేదా? అని అడిగింది. దానిపై ఐఐటీ రూర్కీ స్టడీ చేసి డిపార్ట్మెంట్కు రిపోర్ట్ ఇచ్చిందని రామకృష్ణ రాజు చెప్పారు. బ్లాక్‌లో సమస్యలను పరిష్కరించొచ్చా? దాన్ని తిరిగి వాడుకోవచ్చా? అని కమిషన్ ప్రశ్నించగా.. వెంటనే రిపేర్లు చేస్తే తిరిగి వాడుకోవచ్చన్నారు. ఐఐటీ రూర్కీ రిపోర్ట్ కూడా అదే చెప్పిందన్నారు.
డిజైన్లలోనే లోపాలు..
డిజైన్లలోనే లోపాలు ఉన్నాయని ఐఐటీ రూర్కీ రిపోర్ట్‌లో తేలిందని ఎల్అండ్ టీ సంస్థ టన్నెల్స్, హైడల్ వింగ్ హెడ్ సురేశ్ కుమార్ చెప్పారు. మేడిగడ్డ ఏడో బ్లాకులో ఏర్పడిన సమస్యను పరిష్కరించవచ్చా? బ్యారేజీ కుంగిన తర్వాత తీసుకున్న చర్యలేంటి? అని కమిషన్ ప్రశ్నించగా.. పియర్లలో క్రాక్స్ పెద్దగా ఉన్నాయని, వాటికి నిర్మాణపరమైన రిపేర్లు చేయిస్తే వాడుకోవచ్చని చెప్పారు. బ్యారేజీకి దిగువన ఉన్న ఆప్రాన్లను సరిచేయాల్సి ఉంటుందన్నారు.
దిగువన ఉన్న ప్రొటెక్షన్ అరెంజ్‌మెంట్స్‌ను కాపాడుకోవడానికి రెండో స్టిల్ బేసిన్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. తొలిసారి వచ్చిన వరదలతోనే బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయన్నారు. మేడిగడ్డ ఏడో బ్లాక్‌ను సరిచేయొచ్చా? అని సంస్థ మాజీ డీజీఎం రజనీశ్చౌహాన్ను కమిషన్ ప్రశ్నించగా.. అది సాధ్యం కాదని ఆయన సమాధానమిచ్చారు. అక్కడ కొత్త బ్లాక్‌ను నిర్మించాల్సిందేనని చెప్పారు.