పుస్తకాల్లో భాష మారాలె

మనిషి నుంచి మనిషికి భావాలను బదిలీ చేసేదే భాష. కాలంతోపాటు మనిషి మారుతున్నట్లే భాష కూడా మారాలె. పరిస్థితులకు తగ్గట్టు మారితేనే మనిషైనా, భాషైనా బతుకుతయి. లేదంటే కాలం కడుపులనే కలిసిపోతయి. మన తెలుగుకు కూడా ఇదే సూత్రం వర్తిస్తది.

తెలుగు రాత(స్క్రిప్టు) చాలా ఏండ్లు కొన్ని వర్గాల చేతుల్లనే నలిగింది. అందుకే తొలినాళ్ల సాహిత్యమంతా సంస్కృత పదాలతో నిండింది. దశాబ్దాలపాటు పుస్తకాల్లో రాజ్యమేలిన ఈ గ్రాంథిక భాష సామాన్య జనాన్ని చేరలేకపోయింది. తర్వాతి కాలంలో ఈ గండాన్ని గుర్తించిన కొందరు కవులు, రచయితలు వాడుకభాషను, యాసను రాయడం మొదలుపెట్టి.. జనం మాట్లాడే భాషకు పుస్తకాలు, పత్రికల్లోని భాషకు మధ్య  గ్యాప్‌‌ను పూడ్చే పని కొంతవరకు చేసిన్రు. కానీ ఇది ఇంకా పూర్తిస్థాయిలో సక్సెస్ ​కాలే. అందుకే ఏ బుక్​తిప్పినా, ఏ న్యూస్ పేపర్​ తిరిగేసినా వందలాది పడికట్టు పదాలు పంటి కింద రాళ్లలా తగులుతుంటయి. అదే టైంలో అచ్చులో కనిపించని అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలు ఇంకా జనం నాలుకలపై బతికే ఉన్నయి. పల్లెల్లోని పాత తరం దగ్గర దొరికే అసొంటి సహజమైన పదాలను న్యూస్​పేపర్లలో, పుస్తకాల్లో రాసుడు, టెక్నాలజీకి తగ్గట్టు అవసరమైన చోట్ల ఇంగ్లీష్, ఇతర భాషా పదాలు వాడుడు మరింత స్పీడప్​ చేయాలె. తెలంగాణకు చెందిన అనేక మంది కవులు, రచయితలు ఇలాంటి ప్రాక్టీస్​ ఇటీవల మస్తుగనే చేస్తున్నా ఇంకా టెక్స్ట్‌‌బుక్ ​రైటర్స్ ​మాత్రం మారుతలేరు. ఇంగ్లీష్​ బుక్స్‌‌ను తెలుగులోకి మక్కీకి మక్కీ ట్రాన్స్‌‌లేట్ చేస్తున్నరు. బయటి కవులు, జర్నలిస్టులు ఎప్పుడో పక్కన పడేసిన పడికట్టు పదాలను అట్లనే వాడుతున్నరు.

పుస్తకాల్లో ఏం రాస్తున్నరంటే..

మాట్లాడితే ‘తెలుగు  ముద్దు.. ఇంగ్లీష్​ మీడియం వద్దు’ అనే మన బుక్​ రైటర్స్ తెలుగు మీడియం పుస్తకాల్లో ​రాస్తున్న పదాలను చూస్తే తల్కాయ గిర్రున తిర్గుతది. తెలుగు పేరు చెప్పి రాసే ఆ సంస్కృత పదాలను  స్టూడెంట్స్​ బట్టీపట్టి గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాసి పాసైతే కావచ్చుగానీ, రియల్ ​లైఫ్‌‌లో ఏమాత్రం ఉపయోగపడవని గ్యారెంటీగా చెప్పొచ్చు. బయాలజీ తీసుకుంటే.. Spleenను  ప్లీహం, Liverను  కాలేయం, gall bladderను  పిత్తాశయం.. ఇలా వందల వేల పదాలు కనిపిస్తయి. బయట ఈ పదాలను ఏ డాక్టరూ వాడరు. కేస్​షీట్‌‌లో రాయరు. పేషెంట్లకు చెప్పరు. మాథ్స్‌‌లోనూ ఇంతే. Subtractionను వ్యవకలనం అని, Algebraను బీజగణితం అని, Algorithmను కలనగణితం అని, Geometry జ్యామితి అని అనువదించిన్రు. చాలా మంది స్టూడెంట్లకు ఆ లెక్కల్లాగే ఈ పదాలూ అర్థం కావు. ఎకనమిక్స్​మరీ ఘోరం. Hire అంటే భాటకమట! Complementary goods అంటే పూరక వస్తువులట. ‘Cross Elastity’ అంటే ‘జాత్యంతర వ్యాకోచత్వం’ అట. ఇట్లనే ‘క్షీణోపాంత ప్రయోజన సూత్రం’, ‘సమోపాంత ప్రయోజన సూత్రం’, ‘పరిశిష్ట ఫల యోగ్యతా సిద్ధాంతం’.. ఇలా చెప్తూ పోతే అర్థంకాని పదాలెన్నో. ఇంకా స్టూడెంట్స్‌‌ని తీర్చిదిద్దాల్సిన టీచర్లు తమ బీఈడీ, డీఈడీ కోర్సులో భాగంగా నేర్చుకునే ఎడ్యుకేషన్​సైకాలజీలోని ఇంగ్లిష్​ పదాలకు మన టెక్స్ట్‌‌బుక్​ రైటర్స్ ​రాసిన తెలుగు పదాలను చూస్తే భయమేస్తది. Self un folding( స్వయం వివర్తనం), Structuralism ( సంరచనాత్మకవాదం), Applied psychology (అనువూపయుక్త మనోవిజ్ఞాన శాస్త్రం), Strucutured interview(సంరచిత పరిపృచ్ఛ), Operational (ప్రచాలకం), Structure (ప్రకార్యం), Spontaneous recovery(అయత్న సిద్ధస్వాస్థ్యం). తెలుగు అకాడమీ ముద్రించిన ఈ బుక్స్‌‌లో ఇలాంటి  భయంకర పదాలకు లెక్కలేదు. వీళ్ల మక్కీకి మక్కీ ట్రాన్స్‌‌లేషన్​ఎలా ఉంటదంటే పిల్లల్లో భాషా వికాసం గురించి చెప్తూ.. ఐదేళ్ల లోపు పిల్లలు ‘ధన్యవాదాలు’, ‘దయచేసి’, శుభోదయం (thank you, please, good morning) అనే పదాలు నేర్చుకుంటరట! వెస్ట్రన్ రైటర్స్​వాళ్ల పిల్లలు మొదట నేర్చుకునే పదాలు రాస్తే, వాటిని కూడా మనవాళ్లు అలాగే  అనువ‘దించేసిన్రు’. ఇదీ మనోళ్ల పరిస్థితి!

పత్రికల్లోనూ వాడుక భాష ఉండట్లే..

వాడుక భాష అంటే ‘వాడుకలో ఉన్న భాష’ అని అర్థం. అంటే అది తెలుగా, ఇంగ్లిషా, ఇంకోటా అనే దానితో సంబంధం లేకుండా జనం రొటీన్​​లైఫ్​లో మాట్లాడే భాష. కానీ చాలామంది జర్నలిస్టులకు ఇది అర్థం కావట్లే. వాడుకలో లేని పదాలనే గొప్ప తెలుగు అన్నట్లు రాస్తున్నరు.  ‘ప్రమాదం జరిగింది’ అనాల్సిన కాడ ‘ప్రమాదం చోటుచేసుకుంది’, ‘చికిత్స కోసం’ అనాల్సిన కాడ ‘చికిత్స నిమిత్తం‌‌‌‌’ అంటున్నరు.  ‘రిపేర్లు’ అని రాస్తే సామాన్యులకు సైతం సమజ్​ అయినప్పుడు ‘మరమ్మతులు’ అని వాడుకలో లేని పదాన్ని రాయడం ఎందుకో ఆలోచించాలె. ఇంకా ‘డ్యామ్​’​ను పనిగట్టుకొని ‘జలాశయం’ అనుడు, సొంతూరును స్వగ్రామం అని, డాక్టర్​ను వైద్యుడు అని, ఆఫీస్​ను కార్యాలయం అని, సబ్సిడీని రాయితీ అని, లోన్​ను రుణం అని, హాస్టల్​ను వసతి గృహం అని రాయడం అర్థంలేని పని. గాయపడ్డ వాళ్లను ‘క్షతగాత్రులు’ అనడం నిజంగా అన్యాయం. ‘ లేనిపక్షంలో, లేని యెడల, ఆత్మహత్యకు ఒడిగట్టిన, ఆందోళనకు గురై, చర్యలు గైకొని’.. ఇలాంటి పదాలను ‘లేకపోతే, ఆత్మహత్య చేసుకున్న, చికిత్స కోసం, ఆందోళనచెంది, చర్యలు తీసుకొని’ అని సింపుల్​గా రాయచ్చు. కానీ తెలిసి కొందరు, తెలియక కొందరు వాడుక పదాలు రాయట్లేదు. ఈ జనరేషన్​ పిల్లల్లో చాలామంది ఇంగ్లిష్​ మీడియంలో చదువుకుంటున్నరు. వాళ్లు ఎప్పుడన్నా బుద్ధిపుట్టి తెలుగు పేపర్లు చూసినప్పుడు అందులోని భాషతో కనెక్ట్​ కావాలె.  వాడుక పదాలు రాసినప్పుడే అది సాధ్యమైతది. అట్ల గాక వాళ్లు ఎప్పుడూ చూడని, వినని పదాలు రాస్తే రేపటి తరం తెలుగు ముఖం చూడని  పరిస్థితి వస్తది.

పదాలు పుట్టించడంలో సామాన్యులే సైంటిస్టులు

ప్రతి భాషలోనూ మెయిన్‌‌గా గ్రాంథికం(పుస్తక భాష), వ్యవహారికం(వాడుక భాష) అనే రెండు రకాలుంటయి. గ్రాంథికం శాసనాలు, పుస్తకాల్లో తప్ప నాడూ వాడుకలో లేదు. ఇప్పుడూ  లేదు. కానీ జనాల నాలుకల మీద మాత్రం ఇంకా మంచి పదాలే తిరుగుతున్నయి. ముఖ్యంగా పల్లెల్లో సహజంగా పుట్టిన పదాలు మన మట్టి వాసనను యాదికి తెస్తయి. వాటిని మనం వెలికితీసి వాడాలె.  ఏరోప్లేన్‌‌కు ‘గాలిమోటర్​’ అనే తెలుగు పదం కనిపెట్టింది ఈ పల్లె జనమే కదా! వాడుక భాషకు సంబంధించి సామాన్యుల కంటే పెద్ద సైంటిస్టులు ఇంకెవరూ ఉండరు. వాటిని టెక్స్ట్‌‌బుక్స్, న్యూస్ పేపర్లల రాస్తే మన భాష బతుకుతది. చాలామందికి తెలంగాణ భాష అనంగనే వాక్యాల చివర ‘వచ్చిండు’, ‘వచ్చిన్రు’ అనే క్రియా పదాలు(Verbs) రాస్తే సరిపోతదని అనుకుంటరు.  అది మంచిదే. ఇట్లనే ‘చేసిండు, చూసిండు, తిన్నరు, పోయిన్రు..’ అనాలె. కానీ ఇదే చాలదు. పుస్తకాల్లోని ఇంగ్లిష్​, సంస్కృత పదాలకు దగ్గరగా ఉన్న మన తెలుగు పదాలను వెతకాలె. ఉంటే వాడాలె. లేదంటే ఇంగ్లిష్​ పదాలను ఎట్లున్నయో గట్లనే తెలుగుల రాయాలె. సంస్కృత పదాలు కూడా జనం వాడుకలో ఉంటే వాడొచ్చు. తప్పులేదు.

ఇట్లజేస్తే మన తెలుగును కాపాడుకున్నట్టే కదా?!

కోల్డ్‌‌ను సర్ది, స్విచ్‌‌ను కట్క, ప్లేట్‌‌ను కంచం అని, మూతను తపుకు అని, జ్ఞాపకాన్ని యాది అని, అధిక ధరను పిరం అని, తక్కువ ధరను అగ్గువ అని, గందరగోళాన్ని పరేషాన్​ అని, ఐడియాను ఇగురం అని, లాంఛనాలను పెట్టుపోతలు అని వాడితే మన తెలుగును కాపాడుకున్నట్టే కదా? ఇలాంటి పదాలను చక్కగ ఏరుకోవాలె. ఉదాహరణకు తెలంగాణలో మిట్టప్రాంతాన్ని ‘పర్రు’ అని, లోతట్టు ప్రాంతాన్ని ‘కుర్రు’ అని, గడ్డి నేలను ‘తుర్రు’ అంటరు. వీటి నుంచే హసన్​పర్తి, రేకుర్తి, ఎల్కతుర్తి లాంటి ఊళ్ల పేర్లు వచ్చినయి. ‘పర్తి’ అంటే ‘పర్రుది’ అంటే మిట్ట అని అర్థం. ‘తుర్రు పార పట్టడం’ నుంచే ‘తూర్పారపట్టడం’ వచ్చింది.  కానీ ఇలాంటి పదాలు బుక్స్‌‌లో కనిపించయి. ఎనుకట ‘వలి’ అంటే ఇప్పటి ‘పనిముట్టు’ అట. ఈ పదం చాలామందికి తెల్వది. గొడ్డలి, కొడలి, తిరుగలి, నాగలి.. ఇలా అన్నిట్ల ఈ ‘వలి’ ఉంటది. ఇట్ల సహజంగా పుట్టిన పదాలు తెలంగాణలో ఎన్నో ఉన్నయి. వెలుగువారంగ – ఎగలివారంగ,  గిర్రున తిరిగేది – గిర్క, గీరె’, చేదే తాడు – సాంతాడు, నీళ్లు జాలువారే చోటు– జాలారు, ఇంటిలో ఓ భాగం– అర్ర, పుల్లంటి కూర– పుంటికూర లాంటివి. అగులుబుగులు (ఆందోళన), అండ్లదండ్ల బువ్వ(ఫ్రైడ్​ రైస్​), అత్తరబుత్తర(మీద మీద), జెప్పజెప్ప(తొందర) లాంటి జంట పదాలు కూడా తెలంగాణ భాష స్పెషల్.  ఇలాంటి చాలా పదాలను పుస్తకాల్లో రాయక అవి కనుమరుగయ్యే పరిస్థితి తెచ్చిన కొందరు​రైటర్స్..​ వాడుకలో ఉన్న ఇంగ్లిష్​ పదాలను రాస్తే మాత్రం తెలుగుకు అన్యాయం జరుగుతున్నట్లు మాట్లాడుతున్నరు.

– చిల్ల మల్లేశం

For More News..

ఇండియా ఓ స్వర్గం.. పాక్​కు వెళ్లని అదృష్టవంతుల్లో నేనొకడిని

ఐపీఎల్‌కు ‘వివో’ గుడ్‌ బై!

దేశంలో పాగా వేయనున్న బిట్‌కాయిన్‌?