- కలెక్టర్, ఆఫీసర్లతో నిర్వాసితుల వాగ్వాదం
యాదగిరిగుట్ట, వెలుగు: బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా గ్రామస్తులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు నిరసన దీక్షలు విరమించబోమని నిర్వాసితులు తేల్చి చెప్పారు. నిర్వాసితులతో చర్చలు జరిపేందుకు బస్వాపూర్ రిజర్వాయర్ కట్టపై ఉన్న దీక్షాస్థలికి వచ్చిన యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో నిర్వాసితులు వాగ్వాదానికి దిగారు. పరిహారం, పునరావాసానికి సంబంధించిన పనులను విడతలవారీగా సాధ్యమైనంత త్వరగా ఫినిష్ చేస్తామని కలెక్టర్ చెప్పగా.. నిర్వాసితులు ససేమిరా అన్నారు. దీంతో అసహనంతో కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అనంతరం అక్కడే ఉన్న ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాసులుతో నిర్వాసితులు గొడవకు దిగారు. గతంలో దీక్షలు చేసిన సమయంలో.. సరిగ్గా నెలలోపు డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చి, ఆరు నెలలు గడుస్తున్నా ఆ దిశగా చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. పునరావాసం కోసం భూమి కొనుగోలు చేసి లేఅవుట్ కు సంబంధించిన చర్యలు చేపట్టామని, ఏప్రిల్ మొదటి వారంలో పెండింగ్ లో ఉన్న పరిహారం డబ్బులు ఇస్తామని ఆఫీసర్లు హామీ ఇచ్చారు. గతంలో కూడా ఇలాగే చెప్పి మాట తప్పారని, హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని నిర్వాసితులు స్పష్టం చేశారు. దీంతో ఆఫీసర్లు అక్కడి నుంచి వెనుదిరిగారు.