
- లోకల్‌గా పెరుగుతున్న ల్యాప్‌టాప్‌ల తయారీ
- ఇండియన్ కంపెనీలతో భాగస్వామ్యం
- యూఎస్, చైనా టారిఫ్ వార్‌తో లాభపడుతున్న ఇండియా
- ఆకర్షిస్తున్న పీఎల్‌ఐ 2.0 రాయితీలు
- లేబర్ ఖర్చులు, టారిఫ్‌లు తక్కువగా ఉండడంతో మేలు
న్యూఢిల్లీ: అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్‌తో ఇండియా లాభపడుతోంది. చైనాలో ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్న చాలా కంపెనీలు ఇండియాకు మారాలని కోరుకుంటున్నాయి. అమెరికా డ్రాగన్ కంట్రీపై 245 శాతం టారిఫ్ వేసిన విషయం తెలిసిందే. కొన్ని ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌కు మినహాయింపు ఇచ్చినా, ఈ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఇప్పటిలో తగ్గేటట్టు కనిపించడం లేదు. యూఎస్ కూడా వచ్చే నెల నుంచి సెక్టార్ పరంగా టారిఫ్‌లను వేసే అవకాశం ఉంది. మరోవైపు ఇండియా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) కింద ఐటీ హార్డ్‌వేర్ తయారీ కంపెనీలకు రూ.17 వేల కోట్ల రాయితీలను ఇస్తోంది.
ఇండియాలో లేబర్ చౌకగా అందుబాటులో ఉండడం కలిసి వస్తోంది. ఈ బెనిఫిట్స్ పొందడానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి. గతంలో చైనాపై ఆధారపడిన హెచ్‌పీ, అసూస్, లెనోవో వంటి బ్రాండ్‌లు ఇప్పుడు భారతదేశంలో ల్యాప్‌టాప్‌ల తయారీ కోసం లోకల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇండియన్ కంపెనీలూ తమ ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుతున్నాయి. ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతులు చేసే కంపెనీలపై తక్కువ టారిఫ్‌లు పడుతున్నాయి. మరోవైపు లోకల్ కంపెనీలతో కలిసి పనిచేస్తుండడంతో గవర్నమెంట్ కాంట్రాక్ట్‌లను కూడా పొందే అవకాశం వీటికి ఉంటోంది.
ఈ కంపెనీలు..
అసూస్ఇటీవల వీవీడీఎన్ టెక్నాలజీస్‌కు చెందిన మనేసర్ (హర్యానా) ప్లాంట్‌లో అసెంబ్లీంగ్ లైన్‌ను ప్రారంభించింది. ప్రతి 240 సెకన్లకు ఒక ల్యాప్‌టాప్‌ను తయారు చేస్తామని కంపెనీ చెబుతోంది. ఇండియా మార్కెట్‌పై పాజిటివ్‌గా ఉన్నామని అసూస్ వైస్ ప్రెసిడెంట్ (కమర్షియల్ పీసీ) దినేష్ శర్మ అన్నారు. సప్లయ్ చెయిన్‌ను మార్చడంలో ఖర్చులకు సంబంధించిన సమస్యలు లేకపోలేదని చెప్పారు. గురుగ్రామ్‌కు చెందిన సిర్మా ఎస్‌జీఎస్ , తైవాన్ కంపెనీ ఎంఎస్‌ఐతో కలిసి ఇండియాలో ల్యాప్‌టాప్‌లు తయారు చేయనుంది.
ఇందుకు సంబంధించి ఇరు కంపెనీల మధ్య అగ్రిమెంట్ కుదిరింది. గ్లోబల్‌గా ఉన్న ప్రస్తుత పరిస్థితులను మనం వాడుకోవాలని సిర్మా ఎస్‌జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ సింగ్ గుజ్రాల్ పేర్కొన్నారు. ఎగుమతుల కోసం ఫారిన్ బ్రాండ్‌లను ఆకర్షించేందుకు తయారీ సామర్థ్యాన్ని పెంచాలని చూస్తున్నామని చెప్పారు.
హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లను తయారు చేసేందుకు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో తమిళనాడులో డిక్సన్ టెక్నాలజీస్ తయారీ ప్లాంట్‌ను పెడుతోంది. వచ్చే నెలలో ప్లాంట్ ప్రారంభం కావొచ్చు. ఇక్కడ ఏడాదికి 20 లక్షల ల్యాప్‌టాప్‌లు తయారవుతాయని అంచనా. హెచ్‌పీ ల్యాప్‌టాప్‌లే కాకుండా లెనోవో, అసూస్ ల్యాప్‌టాప్‌లను కూడా డిక్సన్ తయారు చేయనుంది. తమ నోయిడా ప్లాంట్ ద్వారా ఏసర్ ల్యాప్‌టాప్‌లను కూడా తయారు చేస్తోంది.
రూ.17 వేల కోట్ల రాయితీలు..
2023–24 లో 11 బిలియన్ డాలర్ల (రూ.94 వేల కోట్ల) విలువైన ల్యాప్‌టాప్‌లను దిగుమతి చేసుకోగా, ఇండియాలో వీటి తయారీ సామర్థ్యం బిలియన్ డాలర్లు (రూ.8,600 కోట్లు)గా ఉంది. కేంద్రం ఐటీ హార్డ్‌వేర్ కోసం పీఎల్‌ఐ 2.0 ని మే 29, 2023న తీసుకొచ్చింది. ఆరేండ్ల కోసం రూ. 17 వేల కోట్లను రాయితీలుగా ఇవ్వనుంది. ఈ పథకం కింద లోకల్‌గా తయారయ్యే ఉత్పత్తుల అమ్మకాల (పెరిగిన) పై సుమారు 5 శాతం రాయితీ పొందడానికి కంపెనీలకు వీలుంటుంది. దీంతో పాటు లోకల్‌గా ముడిసరుకులను సేకరిస్తే అదనపు ప్రయోజనాలనూ పొందొచ్చు.
ప్రభుత్వం పీఎల్‌ఐ 2.0 కింద రూ. 3,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, రూ. 3.5 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులను తయారు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దేశవ్యాప్తంగా 47,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ప్రభుత్వ డేటా ప్రకారం, డిసెంబర్ 2024 నాటికి, పీఎల్‌ఐ కింద ఐటీ హార్డ్‌వేర్ సెక్టార్‌లోకి రూ. 520 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ. 10,000 కోట్ల ఉత్పత్తి విలువ సాధించాం. 3,900 మందికి ఉద్యోగాలు వచ్చాయి.