దగాపడ్డ సోన్​భద్ర

సోన్​భద్ర వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అధికార బీజేపీ సహా అన్ని పార్టీలు ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టాయి. బాధితులను ఓదార్చటానికి వెళ్లిన కాంగ్రెస్​ పార్టీ జనరల్​ సెక్రెటరీ ప్రియాంకా గాంధీని, తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ నేతలను ఉత్తరప్రదేశ్​​ పోలీసులు అడ్డుకోవటం గొడవను మరింత పెద్దది చేసింది. దీంతో సమస్య పరిష్కారానికి ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్​ స్వయంగా రంగంలోకి దిగారు. ఇంతకీ సోన్​భద్ర జిల్లాలో ఏం జరిగింది?. పది మంది గిరిజన రైతుల హత్యకు దారితీసిన పరిస్థితులేంటి?.

సోన్​భద్ర ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు. ఇది ఒకప్పుడు ‘ఎనర్జీ క్యాపిటల్​ ఆఫ్​ ఇండియా’గా పేరుబడ్డ ప్రాంతం. ఉత్తర ప్రదేశ్​లోని రెండో పెద్ద జిల్లా అయిన సోన్​భద్రలో చాలా పవర్​స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రాంతం ప్రశాంతతకు పెట్టింది పేరు. పండిట్​ నెహ్రూ దీన్ని ‘స్విట్జర్లాండ్ ఆఫ్​ ఇండియా’గా అనేవారంటే.. ఇక్కడ ప్రకృతి ఎంత సహజంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సోన్​భద్ర జిల్లాలోని ఉంభా గ్రామంలో చాలా కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కానీ అవి ఇన్నాళ్లూ వెలుగు చూడలేదు. ఒక భూవివాదంలో వారం రోజుల కిందట పది మంది గిరిజనులు హత్యకు గురి కావటం, మరో 20 మంది తీవ్ర గాయాలపాలవటం సంచలనం సృష్టించింది. ఊరి పెద్దే కిరాయి మనుషులతో అమాయక రైతులను పిట్టల్లా కాల్చిచంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే.. ఆ పల్లెలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన మామూలు గొడవలాగా దీన్ని చూడటం సరికాదు. ఈ ఘోరం వెనక పెద్ద నేర చరిత్రే ఉంది.

1955 నుంచే..

ఈ ప్రాంతంలోని అక్షరమ్ముక్కరాని, నిరుపేద గిరిజనులను సర్కార్​ ఆఫీసర్లు, పోలీసులు, పొలిటికల్​ లీడర్లు అందరూ కలిసి అందినకాడికి దోచుకోవటం 1955లోనే ప్రారంభమైందనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వ, రాజకీయ అధికార అండతో రౌడీలు చదువులేని రైతులపై ఏళ్ల తరబడి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, దానికి పరాకాష్టే ఈ మర్డర్లని చెబుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ పవర్​లో ఉన్నా ల్యాండ్​ మాఫియా ఆగడాలు ఆగట్లేదని, రోజురోజుకీ రెచ్చిపోతున్నాయి తప్ప తగ్గట్లేదని అంటున్నారు.

ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఈ సంఘటన జరిగిన రెండు మూడు రోజుల తర్వాత యూపీ విధాన సభలో సీఎం ఆదిత్యనాథ్​ మాట్లాడుతూ దీనికంతటికీ కారణం గతంలో పాలించిన కాంగ్రెస్​ పార్టీయేనని విమర్శించారు. భూవివాదానికి కథ, స్క్రీన్​ ప్లే రాసిన హస్తం పార్టీయే ఈ హత్యలకు బాధ్యత వహించాలని డిమాండ్​ చేశారు. అయితే.. రాష్ట్రంలో బీజేపీ​ పవర్​లోకి వచ్చాక ఈ గొడవకి సంబంధించి గడిచిన రెండేళ్లలో జరిగిన పరిణామాలను ఆయన కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. గత రెండు సంవత్సరాల్లో ముఖ్యమైన  డెవలప్​మెంట్లు చోటుచేసుకున్నాయి. అవి..

  1. 2017 మార్చిలో ఆదిత్యనాథ్​ సీఎం కాగా అదే ఏడాది అక్టోబర్​లో.. సుమారు 630 బిగాల ఈ వివాదాస్పద సాగు, అటవీ భూమికి సంబంధించి ఒక అగ్రిమెంట్​ జరిగింది. దాని ప్రకారం ఈ భూమిని రెవెన్యూ రికార్డుల్లో ఆ గ్రామ పెద్ద పేరు మీదకి మార్చాల్సి ఉంటుంది. ఐఏఎస్​ ఆఫీసర్​ ప్రభాత్​ మిశ్రా, ఆయన భార్య, బిడ్డ, అల్లుడు ఈ మేరకు బాండ్ రాసిచ్చారు. దీన్ని ఊళ్లోని కొందరు గిరిజన రైతులు వ్యతిరేకించారు. కానీ వాళ్ల వాదనను పట్టించుకున్న నాథుడు లేడు. ఈ విషయమై ప్రభుత్వం కూడా చట్ట సభలో సరైన వివరణ ఇవ్వలేదు.
  2. ఒప్పందం కుదిరిన దాదాపు ఏడాదిన్నర తర్వాత అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఆ భూమిని ఊరి పెద్ద పేరిట అఫిషియల్​గా రిజిస్టర్​ చేశారు. నిజానికి సంబంధిత భూములపై ఎలాంటి అభ్యంతరాలూ లేనప్పుడు మాత్రమే ఇలా మ్యుటేషన్లు (రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చటం) చేస్తారు. కానీ ఇక్కడ దానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. ఆ భూములను ఏళ్ల తరబడి దున్నుతూ పంటలు పండించుకుంటున్న రైతులు.. ఈ విధంగా ఇష్టమొచ్చినట్లు మ్యుటేషన్​ చేయొద్దని మొత్తుకుంటున్నా వాళ్ల మాటను ఎవరూ లెక్కచేయలేదు.

గోండ్​లు ‘గూండా’లా!

భూమిని అఫిషియల్​గా ఊరి పెద్దకు అప్పగించటానికి ఏడాది ముందు (2018లో) దానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఐదుగురు గోండ్​ తెగ గిరిజనులపై ‘గూండా’ చట్టం​ కింద కేసులు బుక్​ చేశారు. అసలైన గూండాలను, రౌడీలను వదిలేసి ఆరుగాలం శ్రమించే రైతులను ఇల్లీగల్​గా పోలీస్​ స్టేషన్లలో పెట్టడంపై అప్పట్లోనే ఆందోళనలు చెలరేగాయి. ఆనాడే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ సమస్య రైతుల చావుకొచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవన్నీ ఆదిత్యనాథ్​ హయాంలోనే జరగటం గమనార్హం.

దున్నేవాడికి తప్ప అందరి చేతుల్లోకీ..

ఇండియాకి ఇండిపెండెన్స్​ రాకముందు నుంచి ఇప్పటి వరకు ఈ భూమి పలువురి చేతులు మారింది. దున్నేవాడికి తప్ప అందరికీ దీనిపై ప్రయోజనం దక్కింది. వాస్తవానికి ఇది 1955 వరకు ఒక రాచరిక కుటుంబానికి చెందిన ఆస్తి. దాన్ని స్థానిక పాలకుడు దేశానికి స్వాతంత్ర్యం రాకముందే ఒక అవగాహన ఒప్పందం మేరకు ‘రాజా ఆఫ్​ బాదల్​’కి గిఫ్ట్​గా ఇచ్చాడు. ఆ రాజు వద్ద నుంచి స్థానికులు ముఖ్యంగా గిరిజన రైతుల పూర్వీకులు సాగు చేసుకునే హక్కులు పొందారు.

1950ల తొలినాళ్లలో జమిందారీ వ్యవస్థ రద్దు, ల్యాండ్​ రిఫార్మ్స్​ డిమాండ్లు ఊపందుకోవటంతో ఈ భూమిని ఆదర్శ్​ కోపరేటివ్​ సొసైటీ పేరు మీదకి బదిలీ​ చేశారు. ఈ ‘టైటిల్​–షిప్​’ ప్రక్రియను 1955 డిసెంబర్​ 17న రాబర్ట్స్​గంజ్​ తహశీల్దార్​ పూర్తి చేశారు. అప్పుడే రైతులకు డౌటొచ్చింది. ఆ భూమి తమకు దక్కకుండా పోతుందేమోనని ఆందోళన చెందారు. కానీ.. సొసైటీ భూమిని ఎవరూ అమ్మటానికి గానీ కొనటానికి గానీ ఛాన్స్​ లేదని, సాగుదార్ల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని కల్లబొల్లి కబుర్లు చెప్పి మభ్యపెట్టారు.

ఈ తంతు 1989 వరకూ ఇలాగే సాగింది. ఆ ఏడాది ఈ భూమిని సొసైటీ పేరు మీద నుంచి ఇండివిడ్యువల్​ హోల్డింగ్​ పేరు మీదకి (ఐఏఎస్​ ఆఫీసర్​, ఆయన భార్య, కుటుంబ సభ్యులకు) ట్రాన్స్​ఫర్​ చేయటంతో రైతుల్లో తమ భవిష్యత్​పై ప్రశ్నలు మొదలయ్యాయి. వాళ్లు మళ్లీ ఆందోళన బాట పట్టారు. కానీ ఫలితం దక్కలేదు. కొత్త యజమాని 1990ల్లో సాగుదార్ల నుంచి బిగాకి రూ.300–400 చొప్పున కౌలు వసూలు చేయటం మొదలు పెట్టాడు. ఈ దోపిడీకి 2017 వరకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.

పెద్ద నోట్ల రద్దు తర్వాత..  

డీమోనెటైజేషన్​ తర్వాత ఆ ఐఏఎస్​ అధికారి, అతని కుటుంబ సభ్యులు ఉన్నట్టుండి ఆ భూమిని అదే గ్రామానికి చెందిన పెద్ద మనిషికి అమ్మాలనుకున్నారు. ఇన్నాళ్లూ రైతుల నుంచి కౌలు వసూలు చేసి తమకు పంపిందీ; స్థానిక అధికారులకు, రాజకీయ నాయకులకు లంచాలు ఇచ్చి మేనేజ్​ చేసిందీ అతనే కాబట్టి బ్యూరోక్రాట్ ఫ్యామిలీ ఆ నిర్ణయం తీసుకుంది. అదే చివరికి ఈ నెల 16న పది మంది రైతుల ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలవటానికి, 20 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల పాలు కావటానికి దారి తీసింది.  ​

టూరిజం వారికి శాపం…

ఉత్తరప్రదేశ్​లో సోన్​భద్ర జిల్లా (ఉంభా గ్రామం)లో జరిగిన కాల్పుల సంఘటన ఇటువంటి అనేక పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే తప్పదంటున్నారు అక్కడి జనాలు. సోన్​భద్ర వివాదం ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఈ జిల్లాలో పెద్ద పెద్ద ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లు కుమ్మక్కై… గిరిజన భూములను  కబ్జా చేయడం 60 ఏళ్ల నుంచి ఉన్నదే. సోన్​భద్ర జిల్లాలో దాదాపు లక్ష హెక్టార్ల భూమి ల్యాండ్ మాఫియా కబ్జాలో ఉందన్నది ఒక అంచనా. లక్ష హెక్టార్ల భూమి అంటే చిన్న  విషయం కాదు. యూపీలోని మొత్తం అటవీ భూమిలో ఆరో శాతం. గిరిజనుల భూమిని ఈ రేంజ్​లో ఆక్రమించుకున్న వారిలో యూపీ భూస్వాములే కాదు.. చుట్టుపక్కల రాష్ట్రాల పెద్దోళ్లు కూడా ఉన్నారు. . పోలీసుల అండ ఉన్న ఈ పెద్దోళ్ల ఆగడాలను ప్రశ్నించే ధైర్యం అక్కడి గిరిజనులకు లేదు. ల్యాండ్ మాఫియా ఏ పార్టీ అధికారంలోఉన్నా మేనేజ్ చేస్తుంటుంది.  ఈ కబ్జా బాగోతం 1987 నుంచి మరీ విచ్చలవిడిగా మారింది. సహజ వనరులకు సోన్​భద్ర జిల్లా పెట్టింది పేరు. బాక్సైట్, లైమ్ స్టోన్, బొగ్గు వంటి ఖనిజాలు ఇక్కడ ఎక్కువ. బంగారం నిక్షేపాలుకూడా ఉన్నట్లు జియాలజిస్టులు కనుగొన్నారు. జిల్లా భూభాగంలో 36 శాతానికి పైగా అడవులే ఉంటాయి. వీటిని నమ్ముకునే గిరిజనులు బతుకుబండి నడుపుకుంటూ ఉంటారు. సహజ వనరులకే కాదు, ప్రకృతి అందాలకు కూడా సోన్​భద్ర జిల్లా ఫేమస్. ఇక్కడి ప్రకృతి సోయగాలను చూడటానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాన్ని టూరిస్టు ప్లేస్​గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సోన్​భద్ర జిల్లా స్వరూపం డిఫరెంట్​గా ఉంటుంది. నాలుగు దిక్కులా మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, బీహార్, జార్ఖండ్ సరిహద్దులుంటాయి. ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కబ్జాకోరులు సోన్​భద్ర జిల్లాలోకి ప్రవేశించడానికి, అడవి బిడ్డల భూములు లాగేసుకోవడానికి చాలా ఈజీ రూట్​ ఏర్పడింది.

జిల్లాలో పోస్టింగ్​కి పోటాపోటీ

సోన్​భద్ర జిల్లాలో పోస్టింగ్​కోసం ఫారెస్ట్ అధికారులు పోటీ పడుతుంటారు. ఒక్కసారి ఇక్కడ పోస్టింగ్ వస్తే  కొన్ని తరాలపాటు బతకడానికి అవసరమైన భూములను తమ పేరుతో రిజిస్టర్ చేసుకుంటారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖల అధికారులు ఇక్కడ ఆ స్థాయిలో కుమ్మక్కవుతారు. వీరిని అడ్డుకునే నాథుడే ఉండడు. సాక్షాత్తూ  సోన్​భద్ర జిల్లా చీఫ్ ఫారెస్ట్ కన్సర్వేటర్​గా పనిచేసిన ఓ అధికారి 2014లో యూపీ ప్రభుత్వానికిచ్చిన రిపోర్ట్ లో ఈ విషయం స్పష్టం చేశారు. సోన్​భద్ర జిల్లాలో గిరిపుత్రులకు చెందాల్సిన అటవీ భూములు ఏ మేరకు కబ్జా అయ్యాయో తెలుసుకోవడానికి సీబీఐ విచారణ జరపాలనికూడా ఆ రిపోర్టులో సూచించారు. ఇలాంటి నివేదికలకు ఎలాంటి గతి పడుతుందో, అదే గతి దీనికీ పట్టింది. ఈ అయిదేళ్లలో దానిని పట్టించుకున్నవాళ్లే లేరు.

ప్రియాంకాగాంధీ చొరవతో దేశం దృష్టికి..

సోన్ భద్ర బాధితులను ఓదార్చటానికి అందరి కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ ప్రయత్నించారు. అయితే ఆమెను పోలీసులు ఉంభా గ్రామానికి వెళ్లనివ్వలేదు. ప్రియాంకా గాంధీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలూ గిరిజన కుటుంబాలను పరామర్శించటానికి విఫలయత్నం చేశారు. లోకల్ ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం చోటుచేసుకుందని యూపీలోని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆరోపించిన నేపథ్యంలో అసలు ఆ పల్లెలో ఏం జరిగిందో తెలుసుకోవటానికి నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా సిద్ధమైంది.