
- వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్కార్యకర్తలు
- జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శనివారం గులాబీమయమైంది. డైట్మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీగా తరలివచ్చారు. మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు ఆయా గ్రామాల నుంచి పార్టీ కార్యకర్తలు వేలాదిగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుంచి మంత్రికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన పలువురు నాయకులు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై మండిపడ్డారు. తెలంగాణ ఉండాల్సింది దొంగల చేతుల్లో కాదని, స్వరాష్ట్రం కోసం త్యాగాలు చేసిన వారి చేతిలో ఉండాలన్నారు. సీఎం కేసీఆర్హ్యాట్రిక్ కొట్టడం కాయమని.. బీజేపీ డకౌట్అవుతుందని, కాంగ్రెస్రనౌట్ అవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఢిల్లీ అహంకారం గెలవాల్నా?, తెలంగాణ ఆత్మ గౌరవం నిలవాల్నో తేల్చుకోవాలని ఓటర్లను కోరారు. బీఆర్‌ఎస్‌పాలనలో ఆదిలాబాద్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. పార్టీ మానిఫెస్టోను ప్రతి ఇంటింటికి చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో వస్తున్న ప్రతి పక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
రామన్నను గెలిపించుకోవాలి: స్వామి గౌడ్
పదవులను లెక్కచేయకుండా, రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా నిఖార్సైన ఉద్యమ నాయకుడు జోగు రామన్నను ప్రజలు గెలిపించుకోవాలని కౌన్సిల్మాజీ చైర్మన్ స్వామి గౌడ్ఓటర్లకు కోరారు. అన్నం పెట్టే రైతుల రుణాన్ని తీర్చుకున్న నాయకుడు కేసీఆర్ అని, ఆయనపై రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. ప్రజలు పదేండ్ల కింద ఉన్న పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులను బేరీజు చేసుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణ బీఆర్ఎస్తోనే సాధ్యమన్నారు.
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం: గోడం నగేశ్
రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్పార్టీనే అని మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. కేసీఆర్తమ పెద్ద కొడుకుగా మారి అండగా ఉంటున్నాడనే అభిప్రాయం వృద్ధుల్లో వ్యక్తమవుతోందన్నారు. ప్రజలు మోసగాళ్ల మాటలు నమ్మొద్దని, అత్యధిక మెజారిటీతో బీఆర్ఎస్ను గెలిపించాలని, ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, బోథ్ బీఆర్ఎస్ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, డీసీసీబీ, గ్రంథాలయ చైర్మన్లు అడ్డి భోజారెడ్డి, రౌత్ మనోహర్, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాని, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.