ఖైరతాబాద్ భక్త జన సంద్రం

ఖైరతాబాద్ భక్త జన సంద్రం
  • ఒక్కరోజే  7 లక్షల మంది దర్శనం
  • ఆర్టీసీ, మెట్రో సర్వీసుల్లో కిక్కిరిసి ప్రయాణం

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఖైరతాబాద్ సప్తముఖ మహా గణపతి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. హాలిడే, దర్శనాలకు చివరి రోజుకావడంతో భారీగా తరలివచ్చారు. ఎటుచూసిన జనమే కనిపించారు. ఈ సందర్భంగా భక్తులకు నిర్వాహకులు గణనాధుడి లక్ష రుద్రాక్షలను పంపిణీ చేశారు. ఉదయం విగ్రహం వద్ద శ్రీనివాస కల్యాణం, హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో పంజాగుట్ట, లక్డీకాపూల్, ట్యాంక్ బండ్, ప్రసాద్స్ ఐ మ్యాక్స్, టెలిఫోన్ భవన్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లలో భక్తులు ఎక్కువగా వచ్చారు. సొంత వాహనాల్లో వచ్చేవారికి పార్కింగ్ ఇక్కట్లు తప్పలేదు. 

అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో
గణేశ్ నిమజ్జనం సందర్భంగా 17న(మంగళవారం) అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీని బట్టి మంగళవారం అదనపు మెట్రో సర్వీసులను నడపాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకు అన్ని రూట్లలో చివరి రైలు బయలుదేరి 2 గంటలకు చివరి స్టేషన్ కు చేరుకుంటుందని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన ఎల్అండ్ టీ, ఎంహెచ్ఆర్ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి, సీనియర్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. గణేశ్​నిమజ్జనాలు మొదలైనప్పటి నుంచి మెట్రో రైళ్లలో రద్దీ పెరిగిందని చెప్పారు. శనివారం ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో -స్టేషన్​నుంచి 94 వేల మంది రాకపోకలు సాగించారని తెలిపారు. వీరిలో 55 వేల మంది ఖైరతాబాద్ కు వచ్చారని, 39 వేల మంది ఖైరతాబాద్​నుంచి వెళ్లారని తెలిపారు. 


ట్యాంక్​ బండ్​పై 15 క్రేన్లు ఏర్పాటు 
ట్యాంక్​బండ్​పై గణనాథుల నిమజ్జనానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిన్నటి దాకా నిమజ్జనానికి అనుమతి లేదంటూ ఏర్పాటు చేసిన ఐరన్​ గేట్లు, నో ఎంట్రీ ఫ్లెక్సీలను ఆదివారం మధ్యాహ్నం తర్వాత తొలగించారు. ఆ వెంటనే 15 భారీ క్రేన్లను అందుబాటులో ఉంచారు. సోమవారం నుంచి బుధవారం వరకు వచ్చే విగ్రహాలను పీపుల్స్​ప్లాజా, ఎన్టీఆర్​  మార్గ్​తోపాటు ట్యాంక్​బండ్​పై నిమజ్జనం చేయనున్నారు.

బడా గణపతి కోసం విజయవాడ నుంచి టస్కర్
ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనం కోసం ఎప్పటిలాగే విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్​పోర్టుకు చెందిన భారీ టస్కర్ ను తీసుకొచ్చారు.26 టైర్లు, 75 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ టస్కర్​100 టన్నుల బరువును మోయగలదు. ఈ డీఎస్-6 ట్రాయిలర్ వెహికల్​వరుసగా రెండోసారి బడా గణపతిని నిమజ్జనానికి తరలించనున్నది. అలాగే నాగర్​కర్నూలుకు చెందిన భాస్కర్​రెడ్డి 11వ సారి మహాగణపతి వాహన డ్రైవర్​గా వ్యవహరించనున్నారు. ఈసారి ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన గణేశ్​బరువు 70 టన్నులు. వెడల్పు 28 అడుగులు. అందుకు అనుగుణంగా ఆదివారం టస్కర్​పై వెల్డింగ్ పనులు షురూ చేశారు. 

విగ్రహం కదలకుండా ఉండేలా ఐరన్​ స్తంభాలతో బేస్ ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నానికి వెల్డింగ్​పనులు పూర్తవుతాయి. సోమవారం అర్ధరాత్రి టైంలో బడా గణపతిని టస్కర్​పైకి ఎక్కిస్తారు. ఆ వెంటనే సపోర్టింగ్ వెల్డింగ్ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. అనంతరం వివిధ రకాల పూలతో టస్కర్ ను అలంకరిస్తారు. మంగళవారం ఉదయాన్నే నిమజ్జన ఊరేగింపు మొదలవుతుంది. బడా గణేశ్​పక్కన ప్రతిష్ఠించిన శివపార్వతులు, శ్రీనివాస కళ్యాణం, బాలరాముడు, రాహువు కేతువు విగ్రహాల కోసం హైదరాబాద్​కు చెందిన మరో ట్రక్​ను రెడీ చేశారు.