హనుమకొండ/వరంగల్, వెలుగు: వరంగల్‌లో రైతు సంఘర్షణ సభ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకావడంతో పార్టీ నేతలు పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. మండే ఎండను లెక్క చేయకుండా వివిధ జిల్లాల నుంచి రైతులు, పార్టీ కార్యకర్తలు, జనం వేలాదిగా తరలిరావడంతో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కిక్కిరిసిపోయింది. సాయంత్రం 6.30 సమయంలో హెలికాఫ్టర్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలిసి రాహుల్ కాజీపేట ఫాతిమా జంక్షన్ లోని సెయింట్ గాబ్రియల్ స్కూల్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ జీపులో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు ర్యాలీగా వచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి వరంగల్ వచ్చిన రాహుల్‌కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.
రైతు కుటుంబాలకు పరామర్శ
సభా స్థలికి చేరుకున్న రాహుల్ తొలుత ఆత్మహత్య చేసుకున్న 36 మంది రైతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించారు. రైతు కుటుంబాల పరిస్థితిని రేవంత్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనకు వివరించారు. తమ బాధలు చెప్పుకుంటూ కొంతమంది బాధిత రైతు కుటుంబ సభ్యులు రాహుల్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. రాహుల్ స్టేజ్ మీదకు వస్తున్న క్రమంలో ఆయనకు వెల్ కమ్ చెప్పడానికి పార్టీ నాయకులు పోటీ పడ్డారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క రాహుల్ చేతికి కంకణం కట్టి స్టేజ్‌పైకి ఆహ్వానించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వరి గొలుసుతో చేసిన మాలను రాహుల్ మెడలో వేశారు. కొందరు నేతలు శాలువాలతో సన్మానించగా.. ఇంకొందరు ఎడ్లబండి బొమ్మలు, మెమొంటోలు గిఫ్ట్‌గా ఇచ్చారు.
కళాకారులు, బోనాల సందడి
రైతు సంఘర్షణ సభ కోసం మూడు స్టేజీలు ఏర్పాటు చేశారు. రాహుల్, ప్రముఖుల కోసం ఒక స్టేజీ, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల కోసం మరొకటి, కళాకారుల కోసం ఇంకో స్టేజీ ఏర్పాటు చేశారు. రాహుల్ సభ కోసం వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చారు. స్థానిక నేతల ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో సంప్రదాయ డ్యాన్సులు చేశారు. జనగామ జిల్లా నుంచి వచ్చిన ఒగ్గు కళాకారులు అదాలత్ జంక్షన్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. బ్యాండ్ చప్పుళ్లు, డీజే పాటలతో యూత్ హోరెత్తించారు.