మెదక్ జిల్లాలో ప్రజావాణికి దండిగా దరఖాస్తులు

మెదక్  జిల్లాలో ప్రజావాణికి దండిగా దరఖాస్తులు

‌పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు 

మెదక్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని ఆయా కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మెదక్​లో కలెక్టర్​రాహుల్​రాజ్​ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి వందలాది మంది రావడంతో కలెక్టరేట్ కిటకిటలాడింది. మొత్తం 192 అర్జీలు రాగా, అందులో 53 భూ సంబంధిత, 17 డబుల్​బెడ్ రూమ్ ఇండ్లు, 36 పింఛన్, 5 ఉద్యోగ అవకాశాల కోసం, 96 ఇతర సమస్యలవి ఉన్నాయి. అర్జీలను ప్రాధాన్యత క్రమంలో  పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వెల్దుర్తికి చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా కలెక్టరేట్​కు తరలివచ్చి చెరువును కాపాడాలని వినతిప్రతం ఇచ్చారు. వందెకరాల ఆయకట్టున్న దేవతల చెరువు పానాది, కాలువ కబ్జాకు గురైందన్నారు.

సంగారెడ్డి టౌన్ : ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా 68 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 46 రెవెన్యూ,  11 డీఆర్డీవో, 11 ఇతర శాఖలకు సంబంధించిన అర్జీలు ఉన్నాయి. గ్రామాల్లో విద్యుత్ వైర్లను సరిచేయాలని, సింగూరు జలాలను రెండు పంటలకు విడుదల చేయాలని, రైతు రుణ మాఫీ చేయాలని భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్​కు విజ్ఞప్తి చేశారు.

సిద్దిపేట టౌన్: సిద్దిపేటలో అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టర్ మను చౌదరి అర్జీలు స్వీకరించారు. వచ్చిన మొత్తం 58 ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. దుబ్బాక మున్సిపాలిటీలో విలీనం చేసిన లచ్చపేటను తిరిగి గ్రామ పంచాయతీగా పునరుద్ధరించాలని గ్రామస్తులు కలెక్టర్​కు అర్జీని అందజేశారు.

మీ సేవా కేంద్రాల నిర్వహణ సీఎస్సీలకే ఇవ్వాలి

ప్రభుత్వం కొత్తగా గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే మీసేవా కేంద్రాల నిర్వహణ బాధ్యతను తమకే అప్పగించాలని కామన్​సర్వీస్​ సెంటర్​ నిర్వాహకులు కోరారు. ఆయా మండలాల్లో కామన్​ సర్వీస్​ సెంటర్స్​ నిర్వహిస్తున్న మహిళలు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్​కు తరలివచ్చి ప్రజావాణిలో కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆయుష్మాన్​ భారత్, పీఎం కిసాన్​, ఈకేవైసీ, ఆరోగ్య శ్రీ, ఆర్థిక సర్వే వంటి సేవలతోపాటు బ్యాంక్​ సంబంధిత సేవలను సీఎస్​సీల ద్వారా అందిస్తున్నామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మీసేవా కేంద్రాల నిర్వహణ బాధ్యతను కూడా తమకే అప్పగించాలని కోరారు.