- 151 షటర్లకు 1092 అప్లికేషన్లు
- నేడు లాటరీ ద్వారా షాపుల కేటాయింపు
- లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్ వర్తింపు
- తమకే కేటాయించాలంటున్న చిరువ్యాపారులు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దుకాణాల నిర్వహణకు ఏడాది కింద నిర్మించిన షటర్లకు ఫుల్‌డిమాండ్ ఉంది. వీటిని దక్కించుకునేందుకు స్ట్రీట్ వెండర్లు పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ సిటీలో ఫుట్ పాత్ వ్యాపారాన్ని స్ట్రీమ్ లైన్ చేసేందుకు బల్దియా ఆధ్వర్యంలో కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ప్రహరీకి ఆనుకుని రేకుల కప్పుతో 126 షటర్లు, శాతవాహన యూనివర్సిటీ ఏరియాలోనూ మరో 25 షటర్లు నిర్మించారు. ఈ షాపుల కోసం సోమవారం సాయంత్రం వరకు చిరువ్యాపారుల నుంచి 1092 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో సివిల్ హాస్పిటల్ పరిధిలోని షాపుల కోసం 797 అప్లికేషన్లు రాగా, ఎస్‌యూ పరిధిలోని షాపుల కోసం 295 అప్లికేషన్లు అందాయి. వీటిని స్క్రూట్నీ చేసి కలెక్టరేట్‌లో మంగళవారం లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు
తొలుత ఫిబ్రవరి 28 వరకే అప్లికేషన్లు స్వీకరించి మార్చి 1న లబ్ధిదారులను ఎంపిక చేస్తామని మున్సిపల్ కమిషనర్ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే స్ట్రీట్ వెండర్లకు ఈ విషయంలో సమాచారం లేకపోవడం, చాలా మంది దగ్గర అవసరమైన సర్టిఫికెట్లు అందుబాటులో లేకపోవడంతో గడువు పొడిగించారు. ఈనెల 4 వరకు అప్లికేషన్ల స్వీకరించారు.
లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేసినప్పటికీ షాపుల కేటాయింపులో రిజర్వేషన్ పాటించనున్నారు. జనరల్ కోటాతోపాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, నాయీబ్రాహ్మణులు, వాషర్ మన్ కోఆపరేటివ్ సొసైటీలు, స్వయం సహాయక సంఘాల వారికి రిజర్వేషన్ ప్రకారం షాపులు కేటాయించనున్నారు. అందుకే అప్లికేషన్ తోపాటు స్ట్రీట్ వెండర్ ఐడెంటిటీ కార్డుతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీ తీసుకున్నారు. దీంతోపాటు రూ.1000 డీడీని స్వీకరించారు. ఒకవేళ డ్రాలో షాపు దక్కకపోతే డీడీని వాపస్ చేయనున్నారు.
అర్హులకు దక్కేనా.. ?
కరీంనగర్ బల్దియా పరిధిలో నిర్మించిన 151 షటర్లను ఎవరికీ కేటాయించకపోవడంతో ఏడాదిగా ఖాళీగా ఉంటున్నాయి. వీటికి కరెంట్ మీటర్, నీటి సదుపాయం కల్పించాల్సి ఉంది. కాగా ఇటీవల కొందరు లీడర్లు సీక్రెట్‌గా లిస్టు ప్రిపేర్ చేసి గుట్టుచప్పుడు కాకుండా కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరగడంతో అర్హులైన స్ట్రీట్ వెండర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు దగ్గరగా ఉండేవారికి అనర్హులకు షట్టర్లు కేటాయించేందుకు కుట్ర చేస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. షట్టర్ల వివాదానికి లాటరీతో తెరపడనుంది.