
- వానకాలంలో ప్రమాద ఘంటికలుగా మారుతున్న గుంతలు
- ఇటీవల 11 ఏండ్లలోపు చిన్నారులు కుంటలో పడి మృతి
- ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండానే కొనసాగుతున్న మొరం దందా
- టిప్పర్‌కు రూ. 3వేల నుంచి రూ.4,500 వసూలు
కామారెడ్డి, వెలుగు : మొరం వ్యాపారులది ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా దందా సాగుతున్నది. చెరువులు, కుంటలను ఇష్టారాజ్యంగా తవ్వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గాంధారి మండలం గుర్జాల్ తండా సమీపంలోని కుంటను మొరం కోసం తవ్వగా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వానకాలంలో ఆ గుంతలు నిండి ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నది. పశువులను తోలుకుని వెళ్లే కాపరులు, చేపల వేటకు వెళ్లే వారు ప్రమాదం బారినపడే అవకాశం ఉన్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి శివారులోని కుంట.. పట్టణానికి సమీపంలో ఉన్నది. కొందరు వ్యాపారులు ఈ కుంటలో తవ్వకాలు చేపట్టి మొరం అమ్ముతున్నారు.
చెరువులు, కుంటల కింద ఆయా పంటలకు సాగునీరు అందుతున్నది. వేసవి ఆరంభంలో ఎండిపోతుండడంతో వ్యాపారులు మొరం కోసం తవ్వి కాసుల పంట పండించుకుంటున్నారు. చెరువులు, కుంటల్లోని పెద్దపెద్ద గుంతలు వానకాలంలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈత రానివారు అందులోపడితే మృత్యువు బారిన పడాల్సిందే. ఇటీవల కామారెడ్డి పట్టణానికి చెందిన 11 ఏండ్ల లోపు ఇద్దరు చిన్నారులు కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లి నీటమునిగి మృత్యువాత పడ్డారు. గతంలో జిల్లాలోని ఆయా చోట్ల పలువురు మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి.
పర్మిషన్ లేకుండానే తవ్వకాలు..
చెరువులు, కుంటల్లో మొరం తవ్వకానికి ఇరిగేషన్ శాఖ ఎన్ఓసీ ఇవ్వాలి. సాధారణ భూముల్లో తవ్వకాలకు తహసీల్దార్ ఎన్ఓసీ ఇస్తారు. ప్రభుత్వానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మొరం వ్యాపారులు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండానే చెరువులు, కుంటలను తవ్వేస్తున్నారు. టిప్పర్‌కు రూ. 3వేల నుంచి రూ.4,500 వరకు అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు.
ఎన్ఓసీ ఇస్తేనే పర్మిషన్..
చెరువులు, కుంటల్లో తవ్వకాలకు ఇరిగేషన్ శాఖ, తహసీల్దార్ ఎన్ఓసీ ఇస్తేనే తమ శాఖ పర్మిషన్ ఇస్తుంది. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే తవ్వకాలకు అనుమతి ఇస్తాం. ప్రభుత్వానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
నగేష్, మైనింగ్ ఏడీ, కామారెడ్డి