- నాలుగు గేట్లు పూర్తిగా, రెండు అడుగుల మేర
- గోదావరిలోకి 68 వేల క్యూసెక్కుల వరద
భద్రాచలం,వెలుగు: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి తాలిపేరు నదికి వరద పోటెత్తుతోంది. మూడు రోజుల వర్షాలతో బుధవారం తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. తాలిపేరు పొంగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు 4 గేట్లు పూర్తిగా, 21 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 68 వేల క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు.
తాలిపేరు పరివాహకంలో ఎగువన భారీగా వర్షపాతం నమోదవుతోంది. మరో 24 గంటల్లో రిజర్వాయర్‌లో వరద ప్రమాదస్థాయికి చేరుకుంటుందని నీటిపారుదల శాఖ ఇంజినీర్లు తెలిపారు. ప్రాజెక్ట్ దిగువన ఉన్న గ్రామాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేసి గేట్లు ఎత్తాలని ఎమ్మెల్యే వెంకట్రావ్ఇంజినీర్లను ఆదేశించారు.
కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల
చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు నుంచి కుడి, ఎడమ కాల్వలకు బుధవారం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ సాగునీటిని విడుదల చేశారు. ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఈఈ రాంప్రసాద్, డీఈ తిరుపతిల సమక్షంలో నదికి పూజలు చేశారు. తర్వాత చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో స్థిరీకరించిన 24700 ఎకరాలకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఎప్పటికప్పుడు కాల్వలను పరిశీలించాలని, గండ్లు పడే అవకాశం ఉన్నచోట ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను ఆదేశించారు.
జూరాల కుడి కాలువకు నీటి విడుదల
గద్వాల: జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జూరాల కుడి కాలువకు నీటి విడుదల చేశారు. జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులను కృష్ణా జలాలతో నింపుతామన్నారు. జూరాల ప్రాజెక్టు దగ్గర నిర్మిస్తున్న బృందావనం గార్డెన్ పనులను పరిశీలించారు. రూ.10 కోట్ల నిధులు రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.
కిన్నెరసాని గేట్లు 3 ఎత్తివేత
పాల్వంచ రూరల్ : రెండు రోజులుగా కురుస్తున్న భారీ వానలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్‌లోకి భారీగా వరద చేరుతోంది. 407 అడుగుల కెపాసిటీ ఉన్న కిన్నెరసాని రిజర్వాయర్నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 403 అడుగులకు చేరుకుంది. దీంతో కేటీపీఎస్ డ్యాం సైట్ అధికారులు రిజర్వాయర్‌కు ఉన్న 12 క్లస్ట్ గేట్లలో 3 గేట్లను 3 అడుగుల మేరకు ఎత్తి 12వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు.
గేట్లు ఎత్తేముందు పరివాహక ప్రాంత ప్రజలకు సైరన్ మోగించి సమాచారమిచ్చారు. రైతులు పొలాల్లో ఉన్న మోటార్లను తీసుకుపోవాలని, పశువులను వాగులవైపు పంపరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు. గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని కేటీపీఎస్ ఏడీ రామకృష్ణ, ఎస్ఈ సురేశ్ పర్యవేక్షించారు.