ఐఐటీ రూర్కీ పరిశోధకుల పరిశోధనలో గుజరాత్‌ని కచ్ ప్రాంతంలో పనాంద్రో లిగ్నైట్ మైన్‌లో లభించిన 27 ఎముకలు ప్రపంచంలోనే అతి పెద్ద పాము వెన్నెముకకు చెందినవని గుర్తించారు. ఈ పాము దాదాపుగా 11 నుంచి 15 మీటర్ల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు.
ఇది ప్రపంచంలో ఇప్పటివరకు అతిపెద్ద పాముగా గుర్తింపు పొందిన టైటానోబోవాను పోలి ఉందని తెలిపారు. భారీ సైజులో ఉండటంతో ఈ పాము కూడా అనకొండలా మెల్లిగా కదిలేదని భావిస్తున్నారు.
ఈ పాముకు శివుడి మెడలోని పాము పేరైన వాసుకి కలిసి వచ్చేలా వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. ఈ పాము ఒకప్పుడు భారత్, ఆఫ్రికా, యూరప్‌లో జీవించి అంతరించిపోయిన 37వ కుటుంబానికి చెందినదిగా పరిశోధకులు భావిస్తున్నారు. ఈ శిలాజాలు 4.7 కోట్ల సంవత్సరాల క్రితం నాటివని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం జీవిస్తున్న అతిపెద్ద పాము ఆసియాకు చెందిన రెటికులేటెడ్ పైథాన్. దీని పొడవు 33 అడుగులు.
వాసుకి శిలాజం పొడిబారిన, చెత్తతో నిండిన ప్రాంతంలో లభించినా అది భూమిపై సంచరించినప్పుడు ఆ ప్రాంతం చిత్తడిగా ఉండేదని బాజ్‌పేయ్ వివరించారు.
శాస్త్రవేత్తలు గుర్తించిన ఈ విషయం పాముల పరిణామ క్రమాన్ని తెలియజేయడమే కాకుండా కాలానుగుణంగా భూమిపై ఖండాలు ఎలా పక్కకు జరిగాయో, జీవజాతుల ప్రపంచమంతా ఎలా విస్తరించాయో తెలుసుకోవడంలో దోహదపడుతుంది.