
మరికల్, వెలుగు: గంటల వ్యవధిలో ధాన్యాన్ని అన్లోడింగ్ చేసే యాజమాన్యం వారం రోజులైనా పట్టించుకోవడం లేదని, తాము పస్తులుంటున్నామని లారీ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. నూకలు, బియ్యమైతే త్వరగా దించుకుంటున్నారని జొన్నలు, మక్కల లారీలను లోపలికి వదలడం లేదని వాపోయారు.
గుంటూరు, తెనాలి, కర్నాటక తదితర ప్రాంతాల నుంచి వచ్చామని చెప్పినా వినిపించుకోవడం లేదని, తమ వద్ద ఖర్చులకు డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని, ఆరోగ్యం బాగా లేకపోతే మందుల కోసం 20 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందన్నారు. ఫ్యాక్టరీ లోపల, బయట 200 లారీలు ఆగి ఉన్నాయని చెప్పారు. అధికారులు, యాజమాన్యం స్పందించి అన్లోడింగ్ జరిగేలా చూడాలని కోరారు.