- రూ.18 లక్షలతో ఏర్పాటుకు ప్రయత్నాలు
- ముక్కోటి ఏకాదశి నాటికి పూర్తి చేసేలా ప్లాన్
- కొత్తగా రత్నాంగి అలంకారం ప్రారంభించేందుకు చర్యలు
భద్రాచలం, వెలుగు : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ గోపురంపై లేజర్ షో ద్వారా రాముని రూపం ఆవిష్కరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలోని విజయనగరం రామాలయంలో హనుమంతుని రూపంలో త్రీడీ లేజర్ షో ఏర్పాటు చేసిన మాదిరిగా.. భద్రాచలంలో సైతం రాముని రూపం ఆవిష్కరణకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఈవో రమాదేవి ఇప్పటికే కలెక్టర్ జితేశ్ వి.పాటిల్‌కు ప్రపోజల్స్ పంపడంతో ఆయన సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. లేజర్ షో ఏర్పాటుకు మొత్తం రూ. 18 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేయగా.. నిధుల సేకరణకు కసరత్తు ప్రారంభించారు. వివిధ పరిశ్రమల నుంచి విరాళాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లేజర్ షో ఏర్పాటు పనులను ముక్కోటి ఏకాదశి నాటికి పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
రామయ్యకు రత్నాలతో రత్నాంగి అలంకారం
భద్రాచలంలో సీతారాములకు కొత్తగా రత్నాంగి అలంకారం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ప్రతి సోమవారం ముత్యాలు పొదిగిన వస్త్రాలతో ముత్తంగి సేవ, ప్రతి శుక్రవారం స్వర్ణ కవచాలతో స్వర్ణ కవచాలంకారం చేస్తున్నారు. శనివారం బంగారు తులసీ దళాలతో, ఆదివారం బంగారు పుష్పాలతో అర్చనలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొత్తగా రత్నాంగి అలంకారం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖ స్తపతి దండపాణి దీనికి రూపకల్పన చేస్తున్నారు. రత్నాలు పొదిగిన వస్త్రం వారం రోజుల్లో ఆలయానికి చేరుకోనుంది. ఇందుకు రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ఈ అలంకారాన్ని కూడా ము క్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.