శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌కు వలస వచ్చిన వారు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని లష్కరే తొయిబా అనుబంధ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ హెచ్చరించింది. కశ్మీర్ లోయలో అమాయక పౌరుల హత్యలు కొనసాగుతున్న నేపథ్యంలో లిబరేషన్ ఫ్రంట్ వార్నింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల రోజుల్లో టెర్రరిస్టులు టార్గెట్ చేసి 11 మంది పౌరుల్ని చంపారు. ఇందులో ఐదుగురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారున్నారు.
కశ్మీర్‌లో నాన్‌లోకల్స్ హత్యా ఘటనలను పరిశీలిస్తే ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని అక్కడి నుంచి తరిమేయాలని ఉగ్రవాదులు భావిస్తున్నారని కొందరు అధికారులు చెప్తున్నారు. కాగా, శనివారం ఇద్దరు నాన్-కశ్మీరీలను చంపిన ఘటన మరువక ముందే ఆదివారం రాత్రి కుల్గాం వాన్ పో ఏరియాలో మరో ఇద్దరు బిహారీలను చంపేశారు టెర్రిరిస్టులు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను రాజా రేశి దేవ్, జోగిందర్ రేశిగా గుర్తించారు. గాయపడిన చున్ రేసి దాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.