న్యూఢిల్లీ: పాకిస్తాన్ మెగా టెర్రర్ క్యాంప్ ను నడుపుతున్నది. లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలతో అబోటాబాద్ లో జాయింట్ ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. తమ దేశ ఆర్మీ స్థావరంలోనే టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తున్నది. పాక్ ఇంటెలిజెన్స్ వింగ్ ఐఎస్ఐనే దగ్గరుండి ఈ టెర్రర్ క్యాంప్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నది. ఇదంతా మన దేశ ఇంటెలిజెన్స్ వింగ్ పసిగట్టింది. పాక్ టెర్రర్ కార్యకలాపాలపై వివరాలు సేకరించింది. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం మేరకు.. అబోటాబాద్ లోని పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్ పక్కనే టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
పాక్ మిలటరీ పర్మిషన్ లేకుండా అక్కడికి వెళ్లే అవకాశమే లేదు. ఐఎస్ఐలోని ఓ కీలక జనరల్ పర్యవేక్షణలో టెర్రర్ క్యాంప్ నడుస్తున్నది. అక్కడ వెపన్స్ వినియోగం, ఇతర ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారు. కాశ్మీర్ లో కొన్ని రోజులుగా ఉగ్రదాడులు జరుగుతున్న క్రమంలోనే ఈ టెర్రర్ క్యాంప్ వెలుగులోకి వచ్చింది.
అబోటాబాద్ కేంద్రంగా..
ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ గతంలో పాక్ లోని అబోటాబాద్ లోనే తలదాచుకున్నాడు. ఇక్కడి లాడెన్ సేఫ్ హౌస్ గురించి తెలుసుకున్న అమెరికా.. 2011లో దాడి చేసి అతడిని చంపేసింది. 2012లో ఆ సేఫ్ హౌస్ ను పాకిస్తాన్ కూల్చేసింది. అయితే ఇప్పుడు అదే ప్రాంతంలో టెర్రర్ క్యాంప్ నడుపుతున్నట్టు మన దేశ ఇంటెలిజెన్స్ వింగ్ అనుమానిస్తున్నది. లష్కరే, హిజ్బుల్, జైషే సంస్థలు.. ఇక్కడ రిక్రూట్ మెంట్లు చేసుకుంటున్నట్టు తెలుసుకున్నది. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్, జైషే చీఫ్ మసూద్ అజహర్ ఆధ్వర్యంలోనే ఈ క్యాంప్ నడుస్తున్నట్టు వివరాలు సేకరించింది. వీళ్లు ముగ్గురూ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో ఉన్నారు.