
- డిస్కౌంట్ ఆఫర్‌తో వరంగల్ కమిషనరేట్‌లో 11 లక్షల చలాన్లు క్లియర్
- పెండింగ్‌లో మరో 20 వేల చలాన్లు
- తనిఖీలు చేపట్టి మరీ క్లియర్ చేయిస్తున్న పోలీసులు
హనుమకొండ, వెలుగు : పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించేందుకు ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్‌కు అనూహ్య స్పందన వస్తోంది. వరంగల్ కమిషనరేట్‌లోని మూడు జిల్లాల పరిధిలో లక్షలాది చలాన్లు పేరుకుపోయాయి. ప్రభుత్వం ఆఫర్ ప్రకటించడంతో వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ చలాన్లు క్లియర్ చేసుకుంటున్నారు. ఆఫీసర్లు కూడా ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ పెండింగ్ కేసులు క్లియర్ చేసే పనిలో పడ్డారు. దీంతోనే నెల రోజుల్లోనే వరంగల్ కమిషనరేట్‌కు రూ. 8.86 కోట్ల ఆమ్దానీ సమకూరింది. రేపటితో డిస్కౌంట్ ఆఫర్ ముగియనుంది.
11 లక్షల కేసులు క్లియర్.. పెండింగ్‌లో 20 వేలు
వరంగల్ కమిషనరేట్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలు ఉండగా మొత్తం నాలుగు లక్షలకుపైగా వెహికల్స్ ఉన్నాయి. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘించడంతో పోలీసులు చలానాలు విధించారు. 2021 వరకు కమిషనరేట్ పరిధిలో 19 లక్షలకుపైగా కేసులు బుక్ చేయగా రెండేండ్ల కిందట ప్రభుత్వం ప్రకటించిన రాయితీతో కొంత మేరకు చలాన్లు క్లియర్ కాగా ఇంకా 11.5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రభుత్వం మరోసారి డిస్కౌంట్‌ప్రకటించింది. దీంతో 35 రోజల్లోనే వరంగల్ కమిషనరేట్ పరిధిలో 11,01,276 చలాన్లు క్లియర్ కాగా, వాటికి సంబంధించి మొత్తం రూ.8,86,90,945లు వసూలు అయ్యాయి. ఇంకా 20,193 కేసులు పెండింగ్ ఉండగా వాటికి సంబంధించిన రూ.1,33,46,230 లు వసూలు కావాల్సి ఉందని పోలీస్ ఆఫీసర్లు చెబుతున్నారు.
రేపే లాస్ట్.. చెల్లింపులపై పోలీసుల ఫోకస్
డిసెంబర్ 26న డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రారంభించిన ప్రభుత్వం జనవరి 10 వరకు అవకాశం కల్పించింది. అయితే వాహనదారుల నుంచి అనూహ్య స్పందన రావడం, సర్వర్మొరాయింపుల కారణంగా ఆఫర్‌ను జనవరి 31 వరకు పొడిగించారు. దీంతో సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు సాల్వ్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రభుత్వం రాయితీలు ప్రకటించినప్పటి నుంచి కొత్తగా ఫైన్లు విధించడం ఆపి చలాన్ల చెల్లింపులపై ఫోకస్ చేసి సక్సెస్ అయ్యారు. చెల్లింపు కోసం మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో ట్రై సిటీతో పాటు కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీ చేస్తూ చలాన్లను క్లియర్ చేయిస్తున్నారు.
ఆఫర్‌ను వినియోగించుకోవాలి
ట్రాఫిక్ రూల్స్ పాటించేలా ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఇప్పటివరకు ఫైన్లు పడిన వాహనదారులు రాయితీని వినియోగించుకునేందుకు ముందుకు రావాలి. జనవరి 31లోగా పెండింగ్ ఫైన్లు చెల్లించాలి.
అంబర్ కిశోర్ ఝా, వరంగల్ సీపీ