తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ మరో అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు తమ మార్కులు, హాల్‌టికెట్, తదితర వివరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసే సమయంలో.. తప్పులు దొర్లితే సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ కల్పించింది. అభ్యర్థులు సెప్టెంబరు 12, 13 తేదీల్లో వివరాలు సరిచేసుకోవచ్చు.
రాష్ట్రంలో మొత్తం 11వేల 062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ రాతపరీక్షలకు సంబంధించిన తుది ఆన్సర్ 'కీ' విడుదలైన విషయం తెలిసిందే. దరఖాస్తుల్లో కొంతమంది అభ్యర్థులు టెట్ వివరాల తప్పులను సవరించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో అవి సవరించకుండా డీఎస్సీ జనరల్ ర్యాంకు లిస్ట్(జీఆర్‌ఎల్) ఇస్తే సమస్యలు ఎదురవుతాయని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అభ్యర్థుల వివరాల్లో మార్పులకు ఇదే చివరి అవకాశమని, సెప్టెంబరు 13 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణకు అవకాశం ఇవ్వబోమని, అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజులపాటు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినట్లు వ్యక్తిగతంగా అభ్యర్థుల ఫోన్లకు కూడా మెస్సేజ్ లు పంపినట్లు అధికారులు తెలిపారు.