
నిర్మల్, వెలుగు: రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన సీఎం కేసీఆర్‌ను గద్దె దింపేందుకు నిరుద్యోగులంతా సిద్ధం కావాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి కోరారు. ఆయన చేపట్టిన యువ పోరాట యాత్ర గురువారం నిర్మల్‌కు చేరగా.. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్ షోలో శివసేన రెడ్డి మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో లక్షా 70 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపడతామని వెల్లడించారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులపై కేసులు పెడుతూ వేధిస్తోందని మండిపడ్డారు. నిర్మల్‌లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. శ్రీహరి రావు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ మున్నూరు కాపుల ఆత్మ గౌరవాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి తాకట్టు పెట్టాడని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా, జడ్పీటీసీ రాజేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వెడమ బొజ్జు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాజిద్ అహ్మద్ ఖాన్, మాజీ కౌన్సిలర్ గణేశ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
కాగడాల ప్రదర్శన
ఖానాపూర్: కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, ఎంపీ రాహుల్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఖానాపూర్ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి కాగడాల ప్రదర్శన చేపట్టారు. చీఫ్‌గెస్ట్‌గా హాజరైన శివసేన రెడ్డి మాట్లాడారు.రాహుల్ గాంధీ డిస్ క్వాలీఫై ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈ ప్రదర్శనలో కాంగ్రెస్ నాయకులు శ్రీహరిరావు, కిషోర్ నాయక్, బొజ్జు పటేల్, దయానంద్, చారులత తదితరులు పాల్గొన్నారు.