రామోజీకి తుది వీడ్కోలు .. 2 గంటల పాటు కొనసాగిన అంతిమయాత్ర  

రామోజీకి తుది వీడ్కోలు .. 2 గంటల పాటు కొనసాగిన అంతిమయాత్ర  
  • ఫిల్మ్ సిటీలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు  
  • పాడె మోసిన టీడీపీ చీఫ్ చంద్రబాబు 
  • మంత్రులు తుమ్మల, జూపల్లి, సీతక్క హాజరు

హైదరాబాద్, వెలుగు: ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. పోలీసులు గౌరవ వందనం చేసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఉదయం 9 గంటలకు ఫిల్మ్ సిటీలోని రామోజీరావు నివాసం నుంచి అంతిమయాత్ర మొదలై, దాదాపు 2 గంటల తర్వాత స్మారక వనం వద్దకు చేరుకుంది. అనంతరం స్మారక వనంలో 
రామోజీరావు చితికి ఆయన పెద్ద కుమారుడు కిరణ్ నిప్పంటించారు. రామోజీ కోడళ్లు శైలజా కిరణ్, విజయేశ్వరి, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. 

రాష్ర్ట ప్రభుత్వం తరఫున మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, రాచకొండ సీపీ తరుణ్ జోషి, ఏపీ ప్రభుత్వం నుంచి ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతిమయాత్రలో మాజీ ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పలువురు ఏపీ, తెలంగాణ ఎమ్మెల్యేలు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఈనాడు గ్రూపు సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, రామోజీరావు అంతిమయాత్రలో పాల్గొన్న టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పాడె మోశారు. శనివారం ఫిల్మ్ సిటీకి వచ్చిన ఆయన.. ఆదివారం వరకు అక్కడే ఉన్నారు.  

రామోజీ మృతిపై ప్రధాని ఆర్టికల్..  

రామోజీరావు మృతిపై  ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆర్టికల్ రాశారు. “గడిచిన కొద్ది వారాల నుంచి తీరిక లేకుండా ఉన్నాను. ఎన్నికలు ముగిశాక కొత్త ప్రభుత్వ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాను. ఇదే సమయంలో నాకు ఈ విషాద వార్త అందింది.  రామోజీరావు మృతి చెందారని తెలిసింది. మా ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగా వ్యక్తిగతంగా ఆయన మృతి నాకు తీరని నష్టం. రామోజీరావు గురించి ఆలోచించగానే నా మనసులో ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి మెదిలారు. ఆయనకు ఆయనే సాటి. వ్యవసాయ రంగం నుంచి వచ్చిన రామోజీ అన్ని వ్యాపారాల్లో సక్సెస్ అయ్యారు. ఆయన తన మూలాలను ఎన్నడూ మరువలేదు. ఈ గొప్ప లక్షణాలే ఆయన్ని అనేక మందికి గొప్ప వ్యక్తిగా మార్చాయి” అని తన ఆర్టికల్​లో పేర్కొన్నారు. ఆ ఆర్టికల్ ను ఆదివారం తన ‘ఎక్స్’ పోస్ట్ చేశారు.

ముందుగానే స్మృతి వనం.. 

రామోజీరావు తన స్మృతి వనం ముందే నిర్మించుకున్నారు. ఫిల్మ్ సిటీలో ఎకరం విస్తీర్ణంలో స్మారక కేంద్రాన్ని గతంలోనే నిర్మించారు. అక్కడే తన చిన్న కుమారుడు సుమన్ అంత్యక్రియలు నిర్వహిం చారు. అదే ప్లేస్ లో తన అంత్యక్రి యలు కూడా నిర్వహించాలని కుటుంబసభ్యులకు రామోజీ ముందే చెప్పారు. ఆయన కోరిక మేరకు అక్కడే అంత్యక్రియలు చేశారు.