సిద్దిపేట రూరల్, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టింది కేంద్ర బడ్జెట్ కాదని.. అది బిహార్ బడ్జెట్ అని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. పోయినసారి ఆంధ్రకు, ఈసారి బిహార్ కు పెద్దపీట వేసి.. తెలంగాణకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో వరాలు ప్రకటించి, ఎన్నికలు లేని రాష్ట్రాలపై వివక్ష చూపడం సరికాదన్నారు.
శనివారం సిద్దిపేట టౌన్ లోని రంగదాంపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి హరీశ్ మాట్లాడారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు సహా బీజేపీ నుంచి 8 మంది, కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి రూ.8 కూడా అధికంగా తీసుకురాలేదని విమర్శించారు. కాగా.. రైతు భరోసా డబ్బులు టిక్ టిక్ అని పడుతాయని చెప్పారు కానీ, ఇప్పటికీ టిక్ టిక్ లేదు.. టంగ్ టంగ్ లేదని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.