తండ్రి సెంటిమెంట్ కలిసొస్తదా? .. కంటోన్మెంట్ లో ఇద్దరు మహిళల మధ్యే పోటీ

హైదరాబాద్, వెలుగు : సికింద్రాబాద్​కు ఆనుకుని ఉండే మిలిటరీ ప్రాంతమైన అసెంబ్లీ సెగ్మెంట్ కంటోన్మెంట్. అక్కడి ప్రజల అవసరాలను తీర్చేందుకే నియోజకవర్గంగా ఏర్పాటైంది. ఎస్సీ రిజర్వ్​డ్​ కావడంతో అన్నిపార్టీలు దృష్టి పెట్టాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్యనందిత, కాంగ్రెస్ ​నుంచి ప్రజా గాయకుడు గద్దర్ ​కుమార్తె వెన్నెల పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ ​నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరిన శ్రీగణేశ్​ ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. అయితే.. బీఆర్ఎస్, కాంగ్రెస్​మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీల నుంచి ఇద్దరు మహిళలు పోటీ పడుతుండగా రాజకీయంగా ఆసక్తి నెలకొంది. కంటోన్మెంట్​లో అరవ మాల సామాజిక వర్గ ఓటర్లే కీలకం.

బొల్లారం, తిరుమలగిరి, కార్ఖానా, రసూల్​పురా, బాలంరాయి వంటి ప్రాంతాల్లో వీరి ఓట్లు దాదాపు 40 వేల వరకు ఉంటాయి. రసూల్​పురా, తిరుమలగిరి, మడ్ ఫోర్ట్​, బాలంరాయి, సిక్ విలేజ్ ప్రాంతాల్లో మైనారిటీ ఓటర్లు దాదాపు 20 నుంచి 25 వేల వరకు ఉంటారు. మారేడ్​పల్లి, కార్జానా, తిరుమలగిరి, వాసవీనగర్​ తదితర ప్రాంతాల్లో  సంపన్నవర్గాలు, వ్యాపారవర్గాలు కీలకంగా ఉన్నారు. అంతేకాకుండా ఆర్మీలో పని చేసే వారి ఓటర్లు కూడా కీలకమే. ఆయా వర్గాల ఓట్లను దక్కించుకునే అభ్యర్థి గెలుపు ఖాయం అవుతుంది. 

గత ఎన్నికల్లో ఇలా..

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్దిగా పోటీ చేసిన జి.సాయన్నకు 65,797 ఓట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్​ నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణకు 28,234 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్దిగా పోటీ చేసిన  శ్రీ గణేశ్​​కు 15,487 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ అభ్యర్ది సాయన్న తన సమీప ప్రత్యర్ది కాంగ్రెస్​ అభ్యర్ది సర్వే సత్యనారాయణపై 37 వేల 563 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు బీఆర్ఎస్​అధిష్టానం సాయన్న కూతురు లాస్యనందితను పోటీలోకి దింపింది.

అలాగే కాంగ్రెస్​ పార్టీ ప్రజా గాయకుడు దివంగత గద్దర్​ కూతురు వెన్నెలకు టికెట్​ ఇచ్చింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన శ్రీ గణేశ్​ మళ్లీ కమలం గూటికి చేరి టికెట్ తెచ్చుకున్నారు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నా ఈ ఎన్నికల్లో ఇద్దరు మహిళా అభ్యర్ధులపైనే ప్రధాన పోటీ నెలకొంది. 

తండ్రి సెంటిమెంట్​పైనే గెలుపు ధీమా

తన తండ్రి సాయన్నకు కంటోన్మెంట్ సెగ్మెంట్​లో ఉన్న మంచిపేరు, ఆయనపై ఉన్న సానుభూతి  తనను గెలిపిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత భావిస్తున్నారు. కంటోన్మెంట్​నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సాయన్నపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాకపోవడంతో పాటు స్థానికులు సదాభిప్రాయంతోనే ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతి కారణంగా సెంటిమెంట్​తో కూతురు లాస్యనందితను గెలిపిస్తారనే నమ్మకం బీఆర్ఎస్ ​నేతల్లో ఉంది. లాస్య నందిత 2016 బల్దియా ఎన్నికల్లో కార్పొరేటర్​గా గెలిచి.. 2020లో ఓడిపోయారు. దీంతో తనకు రాజకీయాలు కొత్త కాదని నిరూపించుకుంటున్నారు.

కాగా.. సెగ్మెంట్ లో గులాబీ నేతల మధ్య వర్గపోరు అధికంగా ఉంది. నియోజకవర్గ ఇన్​చార్జిగా ఇప్పటికే నలుగురు నేతలను మార్చారు. తాజాగా పార్టీ సీనియర్ ​నేత, సాయన్న సన్నిహితుడైన ఎమ్మెన్​ శ్రీనివాస్​కు బాధ్యతలు ఇచ్చారు. ఆయన నియామకంపైనా స్థానిక పార్టీ క్యాడర్​లో  వ్యతిరేకత ఉంది. దీంతో అభ్యర్థి ప్రచారానికి కార్యకర్తలు తప్ప పెద్ద నేతలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 

ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందనే ఆశ 

ఇటీవల చనిపోయిన ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. తెలంగాణ ప్రజల్లో గద్దర్​కు ఉన్న మంచి పేరు తన గెలుపునకు దోహదం చేస్తుందని ఆమె భావిస్తున్నారు. కాంగ్రెస్​కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వస్తుందనుకుంటున్నారు. ముఖ్యంగా బొల్లారం, బాలంరాయి, రసూల్​పురా, కార్జానా, తిరుమలగిరి ప్రాంతాల్లోని అరవ మాలలు, మాదిగలు తనకే ఓటు వేస్తారన్న ధీమాతో ఉన్నారు.

సంపన్న వర్గాలు, బీసీ ఓటర్లు కూడా కాంగ్రెస్​వైపు మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. అయితే.. కాంగ్రెస్ ​కార్యకర్తల్లో కొందరు వెన్నెల అభ్యర్థిత్వంపై కొంత వ్యతిరేకంగా ఉన్నట్టుసమాచారం.  వెన్నెల సెగ్మంట్ వాసులకు పెద్దగా పరిచయం లేకపోవడం కూడా  కొంత నష్టం కలిగించేదిగా చెప్పొచ్చు. మొత్తంగా ఆమె విజయంపై ఆసక్తి నెలకొంది. 

కమలం పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందంటూ..​

ఎన్నటికైనా ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యంతో ఉన్న శ్రీగణేశ్​ గత ఎన్నికల్లోనూ బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్​లో చేరారు. కొంత కాలానికి బీఆర్ఎస్​లో చేరారు. గులాబీ పార్టీ నుంచి  టికెట్ ​రాలేదు. దీంతో మళ్లీ బీజేపీలో చేరి టికెట్ ​దక్కించుకున్నారు. రాజకీయంగా నిలకడ లేని వ్యక్తిగా పేరు పొందిన శ్రీగణేశ్​ కచ్చితంగా గెలుస్తాననే ధీమాతో ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు, మోదీ చరిష్మా, బీఆర్​ఎస్​పై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత తనకు అనుకూలిస్తాయని చెబుతున్నారు.  శ్రీగణేశ్​ పార్టీలు మారడడం,  నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా క్యాడర్​ లేకపోవడం, పార్టీ పెద్ద నేతలెవరూ ఆయనకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడం లేదు.  ఇక్కడ పోటీ ప్రధానంగా కాంగ్రెస్​, బీఆర్ఎస్​ మధ్యే పోటీ నెలకొందని చెప్పవచ్చు.