DDCA Elections 2024: డీడీసీఏ ఎన్నికల్లో రోహన్ జైట్లీ భారీ విజయం

DDCA Elections 2024: డీడీసీఏ ఎన్నికల్లో రోహన్ జైట్లీ భారీ విజయం

ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) ధ్యక్షుడిగా రోహన్ జైట్లీ తిరిగి ఎన్నికయ్యారు. డీడీసీఏ అధ్యక్ష ఎన్నికల్లో 3748 మంది సభ్యులకు గాను మొత్తం 2,413 ఓట్లు పోలవ్వగా.. రోహన్ జైట్లీ 1,577 ఓట్లు సాధించారు. అతనిపై పోటీకి దిగిన భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్‌‌కు కేవలం  777 ఓట్లు పోలయ్యాయి.

రోహన్ జైట్లీ మరెవరో కాదు.. కేంద్ర మాజీ మంత్రి, దివంగత నేత అరుణ్ జైట్లీ కుమారుడు. అరుణ్ జైట్లీ గతంలో 14 సంవత్సరాలు డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేశారు. 

2020లో రజత్ శర్మ తన పదవీ కాలంలో మధ్యలోనే రాజీనామా చేయడంతో రోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఏడాది తరువాత జరిగిన ఎన్నికల్లో రోహన్ జైట్లీ.. న్యాయవాది వికాస్ సింగ్‌ను ఓడించి తొలిసారి డీడీసీఏ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.  

డీడీసీఏ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ సునాయాసంగా విజయం సాధించడానికి ప్రధాన కారణం.. బీసీసీఐ మాజీ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా మద్దతు ఉండటమే. అతను ఢిల్లీ క్రికెట్‌లో 1,000 కంటే ఎక్కువ ఓట్లను నియంత్రించే ప్రభావవంతుడు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన అతని కుమార్తె శిఖా కుమార్ డీడీసీఏ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.