- నెలలు గడుస్తున్నా హైదరాబాద్లో అందని ధ్రువపత్రాలు
- ఇన్సూరెన్సు, తదితర పనులు కావడంలేదని జనం ఆందోళన
హైదరాబాద్ సిటీ, వెలుగు: హోమ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విషయంలో బల్దియా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో ఇస్తున్న బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లలో దాదాపు 80 శాతం హాస్పిటల్స్నుంచి సర్టిఫై చేసినవే ఉంటున్నాయి. మిగతా 20 శాతం మంది ఇంట్లో పుట్టడం, చనిపోతుండడంతో లేదా హాస్పిటల్స్ కు వెళ్తూ మార్గమధ్యలో చనిపోయిన వారు(బ్రాడ్ డెత్) ఉంటున్నారు. వీరికి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ల విషయంలోనే బల్దియా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. హాస్పిటల్స్ నుంచి వచ్చే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి అధికారులకు పెద్దగా వర్క్ ఉండకపోవడంతో వెంటనే వెంటనే ఇష్యూ చేస్తున్నారు. అదే హోమ్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల విషయానికి వస్తే ప్రతి దరఖాస్తుపై సమగ్ర విచారణ జరిపి అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్అంతా వారం రోజుల్లో పూర్తి చేసి సర్టిఫికెట్లు జారీ చేయాలి. కానీ, నెలలు గడుస్తున్నా సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. దీంతో జనాలు రోజుల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. సర్కిల్ స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ జాప్యం తలెత్తుతోందని తెలుస్తోంది.
సర్టిఫికెట్ల ఆలస్యంతో ఇబ్బందులు
బర్త్, డెత్ సర్టిఫికెట్లు ఆలస్యం అవుతుండడంతో ఇన్స్యూరెన్స్తో పాటు ఇతర పనులు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. మరోవైపు జారీ చేసిన హోమ్ బర్త్ అండ్ డెత్, బ్రాడ్ డెత్ సర్టిఫికెట్లలో తప్పులు పడితే సవరించేందుకు కూడా నెలలు టైం తీసుకుంటున్నారు. కొన్ని దరఖాస్తుల్లో ఏ సర్టిఫికెట్లు ఉన్నాయి..ఏ సర్టిఫికెట్లు లేవు అన్నది కూడా చూడకుండా రిజెక్ట్చేస్తున్నారు. దీంతో మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేయాల్సి వస్తోంది.
ప్రజావాణిలోనూ ఫిర్యాదులు....
బర్త్, డెత్ సర్టిఫికెట్లు టైమ్ కి జారీ చేయకపోవడం, సర్కిల్ఆఫీసుల్లో అడిగితే అధికారులు సరైన సమాధా నాలు ఇవ్వకపోవడంతో జనాలు హెడ్డాఫీసు బాట పడుతున్నారు. చాలామంది ప్రజావాణికి వచ్చి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మరికొందరు ‘ఎక్స్’లో కంప్లయింట్స్చేస్తున్నారు. కాప్రా సర్కిల్స్ కి సంబంధించి ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఏడాది ఏప్రిల్ 30న బ్రాడ్ డెత్ అయ్యాడు. ఇతడి కొడుకు డెత్ సర్టిఫికెట్ కోసం ఆరునెలలుగా తిరుగుతున్నా సర్టిఫికెట్ ఇవ్వడంలేదు. అన్ని పత్రాలు అందజేసినా తిప్పుకుంటున్నారని వాపోతున్నాడు.