మూడొద్దులైనా మార్చురీలోనే.. జిల్లా ఆస్పత్రుల్లో ఆలస్యంగా పోస్టుమార్టాలు 

మూడొద్దులైనా మార్చురీలోనే.. జిల్లా ఆస్పత్రుల్లో ఆలస్యంగా పోస్టుమార్టాలు 
  • మూడొద్దులైనా మార్చురీలోనే
  • జిల్లా ఆస్పత్రుల్లో ఆలస్యంగా పోస్టుమార్టాలు 
  • మార్చురీల వద్ద మృతుల బంధువుల పడిగాపులు
  • డ్యూటీ టైమింగ్స్ పాటించని ఫోరెన్సిక్ డాక్టర్లు 
  • రాత్రిపూట పోస్టుమార్టాలు ఎక్కడా చేస్తలేరు  
  • పైసలు ఇస్తేనే చేస్తున్నారనే ఆరోపణలు....

హనుమకొండ జిల్లా గోపాల్‍పూర్‍ కోమటిపల్లికి చెందిన సాయికుమార్‍ మార్చి 19న రైలు ఢీకొని చనిపోయాడు. అనుమానాస్పద మృతిగా భావించిన కాజీపేట రైల్వే పోలీసులు 20న ఉదయం వరంగల్‍ ఎంజీఎం మార్చురీకి డెడ్​బాడీని తరలించారు. విచారణ పేరుతో ఆ రోజు పోస్టుమార్టం చేయలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం దాటినా ఫోరెన్సిక్‍ డాక్టర్లు అందుబాటులో లేరని డెడ్​బాడీని మార్చురీలోనే ఉంచారు. చనిపోయి మూడొద్దులైనా పోస్టుమార్టం చేయకపోవడంతో బంధువులు ఆందోళనకు దిగారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడొద్దుల్ల పిట్టకు పెట్టే టైమ్ వచ్చినా, అంత్యక్రియలు కూడా కాకపాయెనని ఆవేదన చెందారు. చివరకు డాక్టర్లు మధ్యాహ్నం 3గంటలకు పోస్టుమార్టం చేసి డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు.

వరంగల్‍/ వరంగల్‍ సిటీ, వెలుగు: రాష్ట్రంలోని సర్కార్ దవాఖాన్లలో పోస్టుమార్టం ఆలస్యమవుతున్నది. ఒక్కోసారి రెండు మూడ్రోజులు పడ్తున్నది. మూడొద్దుల్ల పిట్టకు పెట్టే టైమ్ నాటికి కూడా డెడ్ బాడీలు మార్చురీలు దాటి కాటికి చేరని పరిస్థితి నెలకొంది. హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, అనుమానాస్పద మృతి కేసుల్లో పోలీసుల విచారణకే ఒక రోజంతా పోతున్నది. జిల్లా కేంద్రాల్లోని పెద్దాస్పత్రులకు వచ్చిన డెడ్ బాడీలను వచ్చినట్టే మార్చురీలో వేసి సిబ్బంది తాళం వేస్తున్నారు.

ఆయా దవాఖాన్లలో ఫోరెన్సిక్ డాక్టర్లు ఎప్పుడు వస్తే అప్పుడే పోస్టుమార్టం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. సాయంత్రం 4గంటలు దాటిందంటే ఫోరెన్సిక్ డాక్టర్లు పత్తా లేకుండా పోతున్నారు.​ మళ్లీ మరుసటి రోజు11 గంటలు దాటితేనే ఆస్పత్రిలో కనిపిస్తున్నారు. ఇక ఆదివారాలు, పండుగలు, సెలవు రోజుల్లో అయితే అటువైపే వస్తలేరు. దీంతో మార్చురీల వద్ద మృతుల బంధువులు పడిగాపులు కాస్తున్నారు. 

రాత్రిపూట చేస్తలేరు.. 

గతంలో పగటి పూట మాత్రమే పోస్టుమార్టం చేసేటోళ్లు. కానీ 2021లో రాత్రిపూట కూడా పోస్టుమార్టం చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. లీగల్ సమస్యలు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని 24 గంటలు పోస్టుమార్టాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనూ రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్​రావు అధికారులను ఆదేశించారు. కానీ ఎక్కడ కూడా రాత్రిపూట పోస్టుమార్టం చేస్తలేరు.  

టైమింగ్స్ పాటిస్తలేరు..

రాష్ట్రంలోని మెజార్టీ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్​డాక్టర్లు, స్టాఫ్​డ్యూటీ టైమింగ్స్ పాటించడం లేదు. షిఫ్టుల వారీగా 24 గంటలు పోస్టుమార్టం చేసేలా డాక్టర్లతో కూడిన టీమ్ అందుబాటులో ఉండాల్సి ఉండగా.. ఎక్కడా ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. సాయంత్రం 4  దాటిందంటే మార్చురీకి తాళాలు పడుతున్నాయి. ఆ టైమ్​లో కావాల్సిన సమాచారం ఇచ్చేవాళ్లు కూడా ఉండట్లేదు. పోస్టుమార్టం ఆలస్యంపై బంధువులు ప్రశ్నిస్తే.. డాక్టర్లే ఉల్టా బాధితులపై సీరియస్ అవుతున్నారు. తమకు పోస్టుమార్టం చేయడం ఒక్కటే పని కాదని, మెడికల్ స్టూడెంట్లకు పాఠాలు కూడా చెప్పాలని అంటున్నారు.

ఎంజీఎంలో సౌలతులు కల్పించినా..

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉండే వరంగల్‍ ఎంజీఎం హాస్పిటల్‍ కు రోజూ సగటున నాలుగు నుంచి ఐదు డెడ్​బాడీలు పోస్టుమార్టానికి వస్తుంటాయి. ఇక్కడ నలుగురు ఫోరెన్సిక్‍ డాక్టర్లు, ఇద్దరు హెల్పర్స్ ఉన్నారు. మరో మూడు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇక్కడ రాత్రిపూట పోస్టుమార్టం నిర్వహించేందుకు అవసరమైన సౌలతుల కోసం రూ.85 లక్షలు మంజూరు చేశారు. బిల్డింగ్‍ కన్‍స్ట్రక్షన్‍ చేయడంతో పాటు ఫ్రీజర్‍ కొనుగోళ్లు జరిగాయి. కానీ ఇక్కడ ఒకట్రెండు సార్లు మినహా రాత్రిపూట పోస్టుమార్టం చేసిన దాఖలాలు లేవు. చాలాసార్లు ఫోరెన్సిక్‍ డాక్టర్లు డ్యూటీ సమయాల్లో అందుబాటులో ఉండట్లేదు.

పైసలిస్తేనే పోస్టుమార్టం.. 

దవాఖాన్లలో పైసలు ఇస్తేనే పోస్టుమార్టం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రూ.10 వేల నుంచి రూ.15 వేలు చేతిలో పెడ్తే తప్ప పోస్టుమార్టం చేస్తలేరు. మార్చురీల్లో నలుగురైదుగురు డాక్టర్లు, సిబ్బంది ఉంటే.. వాళ్లలో ఒకరిద్దరు తప్ప మిగిలినోళ్లంతా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేవాళ్లే. దీంతో కేసును బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పోస్టుమార్టం చేసే టైమ్​లో ఫొటో, వీడియో తీయడం కోసమని రూ.500 నుంచి రూ.వెయ్యి దాకా అదనంగా వసూలు చేస్తున్నారు. సహాయకులుగా ఉండేవారికి రూ.2 వేలు, మృతదేహాన్ని చుట్టడానికి అవసరమైన చాప, వైట్‍ క్లాత్‍, సెంట్‍ పేరుతో మరో రూ.2 వేలు అడుగుతున్నారు. మరోవైపు కేసు విచారణ పేరుతో వచ్చే పోలీస్‍ రైటర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో వరంగల్‍ మార్చురీలో ఒక్కో పోస్టుమార్టానికి రూ.20 వేల దాకా వసూలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి..

15 వేలు అడిగిన్రు 

మా అబ్బాయి కెనాల్​లో పడి చనిపోయిండు. రెండోరోజు శవం దొరికింది. మూడో రోజు పోలీస్‍ ఎంక్వైరీ చేసేటోళ్లు రూ.15 వేలు అడిగిన్రు. డాక్టర్లు, చేతికింద ఉండేటోళ్లు, ఫొటోగ్రాఫర్లకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పిన్రు. డబ్బులు లేవంటే పొద్దున చేయాల్సిన పోస్టుమార్టం సాయంత్రం 4 గంటల దాకా ఆపిన్రు. ఇంకో గంట దాటితే మరో రోజు లేటైతదన్నరు. అప్పటికే మూడొద్దులు కావడంతో కొంత ముట్టజెప్పినం.  

- ఎన్‍.రాజయ్య, కేయూసీ, హనుమకొండ 

రాత్రి చెయ్యాలంటే రూల్స్ ఉన్నయ్

ఎంజీఎంలో రాత్రిపూట పోస్టుమార్టం చేసేందుకు సౌలతులు ఉన్నాయి. డాక్టర్లు, సిబ్బంది కొరతేమీ లేదు. అయితే రాత్రి సమయాల్లో పోస్టుమార్టం చేసేందుకు చాలా రూల్స్ ఉన్నయ్. అవసరాన్ని బట్టి రాత్రి టైమ్ లోనూ చేస్తం. ఇక పోస్టుమార్టం చేసే డాక్టర్లకు స్టూడెంట్లకు క్లాసులు చెప్పడం, రికార్డులు చూసే పనులు కూడా ఉంటయ్‍. అందుకే అప్పుడప్పుడు లేట్ అవుతోంది. 

- డాక్టర్‍ మోహన్‍దాస్‍, కేఎంసీ ప్రిన్సిపల్‍