వెలుగు సక్సెస్ : లాటరైట్​ నేలలు

వెలుగు సక్సెస్ :   లాటరైట్​ నేలలు

శిలావరణ ఉపరితలంపై ఏర్పడి ఉన్న అనేక కర్బన, అకర్బన పోషకాలతో కూడుకున్న పలుచని పొరనే నేలలు అని పిలుస్తారు. భూమిపై వృక్షజాతుల పెరుగుదలకు, ఒకే దేశ ఆర్థికాభివృద్ధికి ఇవి అత్యంత కీలకం. నేలల ఏర్పడే విధానాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లిథాలజీ లేదా పీడోజెనసిస్​ అంటారు. నేలలు భౌతిక, రసాయనిక, ధర్మాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పెడాలజీ అని పిలుస్తారు. 

దేశంలో 329 మిలియన్ హెక్టార్లలో భూవనరులు విస్తరించి ఉన్నాయి. ఇందులో 304.88 మిలియన్​ హెక్టార్ల భూభాగం  వినియోగానికి అనుకూలంగా ఉంది. ఇందులో 142.82 మిలియన్​ హెక్టార్ల భూభాగం నివాసయోగ్యంగా ఉంది. ఇందులో 44 శాతం భూభాగం మాత్రమే నీటిపారుదల వసతులు కలిగి ఉండగా, మిగిలిన 56 శాతం భూభాగం వర్షాధార వ్యవసాయం కింద కొనసాగుతోంది. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ దేశంలోని నేలలను 10 రకాలుగా విభజించింది. 


ఒండ్రుమట్టి నేలలు: ఇవి అత్యంత సారవంతమైన, ఉత్పాదక కలిగిన నేలలు. దేశ భూభాగంలో ఇది దాదాపు 43 శాతం (143.1 మిలియన్​ హెక్టార్లు) విస్తరించి ఉన్నాయి. ఇవి గంగా – సింధూ డెల్టా, బ్రహ్మపుత్ర డెల్టా, ఒడిశాలోని మహానది డెల్టా, ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా– గోదావరి డెల్టా, తమిళనాడులోని కావేరి నది డెల్టా, కేరళలోని పశ్చిమ కనుమల పశ్చిమ ప్రాంతం, మధ్యప్రదేశ్​, గుజరాత్​ల్లో నర్మద, తపతి, నదీలోయ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. విభిన్న ప్రాంతాల నుంచి నదులు తీసుకువచ్చిన, భిన్న రకాల ఖనిజ పోషకాలతో నిక్షేపించిన నేలలు ఇవి. ఈ నేలలు ఎక్స్​సిటు రకానికి చెందినవి. వీటిలో పొటాష్​, సున్నం, పాస్ఫరిక్​ ఆమ్లాలు ఎక్కువగా ఉండి, నత్రజని, హ్యుమస్​లు లోపించి ఉంటాయి. మైదానంలోని పాత ఒండ్రు మట్టి నేలలనే భంగర్​ అని, కొత్త ఒండ్రు మట్టి నేలలను ఖాదర్​ అని పిలుస్తారు. 


నల్లరేగడి నేలలు: దేశ భూభాగంలో నల్లరేగడి నేలలు దాదాపు 15.09 శాతం భూభాగం ఆక్రమించి ఉన్నాయి. వీటికి నల్లటి రంగు రావడానికి కారణం అందులో కరిగి ఉన ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్​. ఇవి ప్రధానంగా బసాల్ట్​ శిలల విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడ్డాయి. అమెరికాలోని ప్రయారీ ప్రాంతంలోని చెర్నోజమ్స్​ నేలలను ఇవి పోలి ఉంటాయి. వీటినే రెగర్​ నేలలని, తనను తాను దున్నుకునే నేలలు అని కూడా పిలుస్తారు. పత్తి పంటకు ఇవి అత్యంత అనువైనవి. 

ఇవి ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్​, ఉత్తర కర్ణాటకలోని దక్కన్​ నాపలు, మధ్యప్రదేశ్​లోని మాల్వా పీఠభూమి, తమిళనాడులోని కోయంబత్తూర్​, ఆంధ్రప్రదేశ్​లోని ఉత్తర – పశ్చిమ తెలంగాణ, అనంతపురం, నంద్యాల ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వర్షం పడినప్పుడు జిగటగా మారి ఉబ్బడం, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు పగుళ్లు ఏర్పడటం, ప్లాస్టిసిటీ, అంటుకుపోవడం వీటి ముఖ్య లక్షణాలు. నేలలన్నింటిలోనూ నీటిని నిలుపుకొనే సామర్థ్యం వీటికే ఎక్కువ. ఈ నేలలో నత్రజని, ఫాస్ఫరస్​, హ్యుమస్​ తక్కువగా ఉంటాయి. 


ఎర్ర నేలలు: దేశ భూభాగంలో ఇవి దాదాపు 18.49 శాతం ఆక్రమించి ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఇవి ఎక్కువగా విస్తరించాయి. ప్రధానంగా గ్రానైట్​ శిలలు విచ్చిన్నం చెందడం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. ఇవి ఎర్రటి వర్ణంలో ఉండటానికి కారణం అందులో కరిగి ఉన్న ఐరన్​ ఐక్సైడ్​, ​తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక, ఛత్తీస్​గఢ్​, జార్ఖండ్​, అసోం రాష్ట్రాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో నత్రజని, ఫాస్పరస్​, హ్యుమస్​ తక్కువగా ఉండి ఐరన్​, పొటాషియం అధికంగా ఉంటాయి. 


లాటరైట్​ నేలలు: ఇవి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. దేశ భూభాగంలో 3.70 శాతం ఆక్రమించి ఉన్నాయి. పర్వత శిఖర భాగాలు, పీఠభూమి ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఏర్పడ్డాయి. లీచింగ్​ అనే భూ స్వరూప ప్రక్రియ ద్వారా ఇవి రూపుదిద్దుకున్నాయి. ఇవి ఇటుక ఎరుపు వర్ణంలో ఉంటాయి. కారణం అందులో కరిగి ఉన్న ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్​. ఇవి అధిక వర్షపాతం , అధిక ఉష్ణోగ్రతలు ఒక దాని తర్వాత ఒకటి సంభవించే ప్రాంతాల్లో ఏర్పడ్డాయి. కేరళలోని పశ్చిమ కనుమల శిఖర భాగాలు, మధ్యప్రదేశ్​లోని వింధ్య, సాత్పురా పర్వత ఉపరితలాలు, తెలంగాణలో మెదక్​ జిల్లాలోని జహీరాబాద్​, నారాయణఖేడ్​, ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, నెల్లూరు జిల్లాలోని కావలి, సూళ్లూరుపేట, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమల శిఖర భాగాలు, ఒడిశాలోని తూర్పు కనుమలు, మేఘాలయ, జార్ఖండ్​ రాష్ట్రాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. 

వీటిని యుగోస్లోవియాలోని టెర్రరోసా నేలలను పోలి ఉంటాయి. ఈ నేలల్లో నైట్రోజన్​ శాతం తక్కువగా ఉండి, అల్యూమినియం, ఐరన్​, టైటానియంలు ఉంటాయి. కాఫీ, తేయాకు, జీడి మామిడి, రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి పంటలకు ఈ నేలలు అనుకూలమైనవి. 


ఎరుపు, నల్లటి నేలలు: ఇవి 5.40 శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఇది దేశంలో ఎక్కువగా బుందేల్​ఖండ్, ఆరావళి తూర్పు ప్రాంతం, గుజరాత్​ల్లో అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. తక్కువ సారవంతమైనవి. నీటి వసతులు కల్పించుకోగలిగితే మొక్కజొన్న, సజ్జలు, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజల పంటలకు అనుకూలమైనవి. 
బూడిద, గోధుమ వర్ణపు నేలలు: ఇవి 1.09 శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలో ఐరన్​ ఆక్సైడ్​ కరిగి ఉండటంతో బూడిద, గోధుమ వర్ణంలో ఉంటాయి. ఇవి రాజస్తాన్​, గుజరాత్​ల్లో విస్తరించి ఉన్నాయి. 


ఉప పర్వత ప్రాంత నేలలు: ఇవి 1.73 శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి. జమ్ముకశ్మీర్​ నుంచి అసోం వరకు విస్తరించి ఉన్న టెరాయ్​ ప్రాంతమంతా విస్తరించి ఉన్నాయి. సారవంతమైనవి, దట్టమైన వృక్షజాతులు పెరగడానికి అనుకూలమైనవి.

 
మంచుతో కూడిన నేలలు: ఇవి 1.21 శాతాన్ని ఆక్రమించి ఉన్నాయి. హిమాద్రి, కారాకోరం, లఢక్​, జస్కర్​ పర్వత ప్రాంతాల్లో పూర్తిగా పరిణతి చెందని నేలలు. ఇవి వ్యవసాయానికి పనికిరావు.

ఎడారి, ఇసుక నేలలు

శుష్క, అర్ధశుష్క శీతోష్ణస్థితి గల దేశ వాయవ్య ప్రాంతాలు, తీర ప్రాంతాల వెంట ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఈ నేలలో నత్రజని, హ్యుమస్​లు లోపించి ఉంటాయి. నీటిని నిల్వ చేసుకొనే సామర్థ్యం అతి తక్కువ. వీటిలో పాస్ఫరస్​ సమృద్ధిగా ఉంటుంది. నీటిపారుదల సౌకర్యాలు కల్పించగలిగితే గోధుమ, బార్లీ పంటలకు అనుకూలమైనవి. ఇవి దేశ భూభాగంలో 4.42 శాతం ఆక్రమించి ఉన్నాయి. 

పర్వత ప్రాంత నేలలు

దేశ భూభాగంలో ఇవి 5.50 శాతం ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలో హ్యుమస్​ ఎక్కువ. ఇవి ఆమ్లరహిత పోడ్జోల్​గా ఉంటాయి. హిమాలయ, వింధ్య, సాత్పురా, తూర్పు, పశ్చిమ కనుమల వాలులో ఇవి ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. కాఫీ, తేయాకు తోటలకు అనుకూలమైనవి.