సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత అన్నవ్..​ ఇప్పుడు విషెస్ చెప్పనీకి నోరు వస్తలేదా?: కేసీఆర్​కు వెంకట్​రెడ్డి ప్రశ్న

సోనియా తెలంగాణ ఇచ్చిన దేవత అన్నవ్..​ ఇప్పుడు విషెస్ చెప్పనీకి నోరు వస్తలేదా?: కేసీఆర్​కు వెంకట్​రెడ్డి ప్రశ్న
  • బీఆర్ఎస్​ చీఫ్​ కేసీఆర్​కు వెంకట్​రెడ్డి ప్రశ్న
  • బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టుతో నా కల నెరవేరింది
  • అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్ చాట్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ మాట్లాడరా? అని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ లాబీలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ లో మంత్రి కోమటిరెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. “తెలంగాణ వచ్చిన తర్వాత సోనియా గాంధీ దేవత అని ఆమె లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని కేసీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ఆమెకు విషెస్​ చెప్పేందుకు నోరు రావడం లేదు. అసలు అసెంబ్లీకే రావడం లేదు. మేము ఇప్పటికీ టీపీసీసీ అని చెప్పుకుంటాము. కానీ కేసీఆర్ తన పార్టీ పేరులో టీ తీసేసి, బీఆర్ఎస్ అని పెట్టుకున్నరు” అని వెంకట్​రెడ్డి విమర్శించారు.

ఇటీవల సీఎం ప్రారంభించిన బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టుతో తన జన్మ ధన్యం అయిందని అన్నారు. తన కొడుకు మరణించాక ఎంత బాధపడ్డానో ఈ ప్రాజెక్టు కోసం కూడా అంత బాధపడ్డానన్నారు. 20 ఏండ్ల నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని పోరాడుతున్నానని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఇటీవల తన నిజామాబాద్ పర్యటన సందర్భంగా కలెక్టరేట్ లో జరిగిన మీటింగ్ లో ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే మీటింగ్ కు రాలేదని, మా పార్టీ ఇన్ చార్జ్ వచ్చి రోడ్డు సమస్య గురించి చెప్పారని మంత్రి గుర్తు చేశారు. అందులో తప్పు ఏముందన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే తన గురించి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదన్నారు.  రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టి విద్యార్థులకు అందిస్తే చరిత్రలో నిలిచిపోతామన్నారు. వైఎస్ ఆర్ టైమ్ లో ఆర్థిక క్రమశిక్షణ ఉండేదని, ఇపుడు డిప్యూటీ సీఎం భట్టి దగ్గర కనిపిస్తోందన్నారు. కేసీఆర్ పేరుతోనే హరీశ్, కేటీఆర్ లు ఎమ్మెల్యేలు అయ్యారని, తాను, భట్టి ప్రభుత్వ స్కూళ్లలో చదివి కష్టపడి ఈ స్థాయికి వచ్చామని గుర్తు చేశారు. వాళ్లతో మాకు పోలికేంటని ప్రశ్నించారు.

వెంకన్న కల నెరవేరింది: డిప్యూటీ సీఎం భట్టి
బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తి కావటంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కల నేరవేరిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  2004 నుంచి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నారని, అపుడు వైఎస్ ఆర్ తో చర్చించి ఈ ప్రాజెక్టు శాంక్షన్ చేయించారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పట్టించుకోలేదని, నిధులు ఇవ్వలేదని, ఇపుడు నిధులు ఇచ్చి పూర్తి చేయించామని చెప్పారు. 

హైదరాబాద్ లో ఉన్న ఆయన సన్నిహితులను తీసుకెళ్లి ప్రాజెక్టును చూపించాలని కోమటిరెడ్డిని భట్టి కోరారు. ఎస్ఎల్బీ సీ కూడా పూర్తి చేస్తామని, మూసీ పునరుజ్జీవం పూర్తితో నల్గొండ జిల్లా కూడా గోదావరి తరహాలో నీళ్లు పారబోతున్నాయని ఆయన అన్నారు. భూమి ధరలు భారీగా పెరగబోతున్నాయని, నాకు ఒక ఎకరం ఇవ్వవా అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని సరదాగా భట్టి అడిగారు. “భట్టి విక్రమార్క జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ఏం అడిగినా ఒకే అంటున్నారు.. సెక్రటేరియెట్ లో మాత్రం పనికోసం వస్తే పైసలు లేవు అంటున్నారు” అని కోమటిరెడ్డి  వ్యాఖ్యానించారు.