స్ట్రీమ్ ఎంగేజ్ : రెండు వేర్వేరు మార్గాలు

స్ట్రీమ్ ఎంగేజ్ : రెండు వేర్వేరు మార్గాలు

టైటిల్ : డియర్ నాన్న

ప్లాట్​ ఫాం : ఆహా
డైరెక్షన్ : అంజి సలాధి

కాస్ట్ :  చైతన్య రావు, సూర్య కుమార్ భగవాన్ దాస్, సి.వి.ఎల్ నరసింహారావు, సంధ్య జనక్, మధు నందన్, శశాంక్, యశ్న చౌదరి, వినయ్ నల్లకాడిసూర్య(చైతన్య రావు) చెఫ్‌ కావాలని కలలు కంటుంటాడు. అతని తండ్రి మెడికల్‌ షాపు నడుపుతుంటాడు. దాంతో కొడుకుని కూడా ఫార్మసిస్ట్‌ చేయాలి అనుకుంటాడు. చదువు పూర్తికాగానే తన షాపు బాధ్యతలు కొడుక్కి అప్పగించాలి అని నిర్ణయించుకుంటాడు. కానీ.. సూర్యకి ఆ ఫీల్డ్‌ అంతగా నచ్చదు. ఈ ఇద్దరి మ‌న‌స్తత్వాలు చాలా భిన్నంగా ఉంటాయి. దానివల్ల తండ్రీకొడుకుల మధ్య దూరం ఎలా పెరిగింది? తండ్రి కోరిక‌ను కొడుకు నెర‌వేర్చాడా? కొడుకు క‌ల‌ల‌ను తండ్రి అర్థం చేసుకున్నాడా? 

అన్నాదమ్ముల దారులు వేరు!

టైటిల్ : అబాంగ్‌ ఆదిక్‌ 
ప్లాట్​ ఫాం : నెట్‌ఫ్లిక్స్‌
డైరెక్షన్ : ఓంగ్ జిన్ 
కాస్ట్ :  వు కాంగ్ రెన్, జాక్ టాన్, సెరెన్ లిమ్, టాన్ కిమ్ వాంగ్ 

మలేసియాలోని కౌలాలంపూర్‌లో అబాంగ్ (వు కాంగ్-రెన్), ఆదిక్ (జాక్ టాన్) అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్లు అనాథలు. చిన్నప్పటినుంచి చాలా కష్టాలు పడతారు. పెద్దవాడు అబాంగ్‌కి వినికిడి సమస్య. పైగా మూగవాడు. అయినా.. ఏదో ఒక పని చేస్తూ.. తమ్ముడిని చూసుకుంటాడు. ఇద్దరూ టీనేజ్‌కి వచ్చేసరికి పెద్దవాడు కష్టపడి పనిచేసే వ్యక్తిగా పరిణతి చెందుతాడు. కానీ.. చిన్నవాడు ఆదిక్ మాత్రం తప్పుడు మార్గాలను ఎంచుకుంటాడు. అబాంగ్ ఒక మాంసం కొట్టులో కోళ్లను కోసి, క్లీన్‌ చేసే పనిలో చేరతాడు. దాంతోపాటు ఖాళీ దొరికినప్పుడల్లా దొరికిన ప్రతి పని చేస్తుంటాడు. ఆదిక్‌ మాత్రం ఆ దేశానికి వచ్చిన అక్రమ వలసదారులకు దొంగదారుల్లో చట్టబద్ధత కల్పించేందుకు ఒక మోసపూరిత ఏజెంట్‌తో కలిసి పనిచేస్తాడు. కొన్నాళ్లకు వాళ్లు ఒక హత్య కేసులో చిక్కుకోవడంతో వాళ్లిద్దరి జీవితాలు అయోమయంలో పడతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హత్య కేసుతో వీళ్లకు ఉన్న సంబంధం ఏంటి? తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

అనుకోకుండా మర్డర్..  ఆ తర్వాత ఏం జరిగింది? 

టైటిల్ : పరువు
ప్లాట్​ ఫాం : జీ5
డైరెక్షన్ : సిద్ధార్థ్ నాయుడు, రాజ‌‌శేఖ‌‌ర్ వ‌‌డ్లపాటి 
కాస్ట్ :  నరేశ్‌‌ అగస్త్య, నివేదా పేతురాజ్‌‌, నాగబాబు, రమేశ్‌‌, సునీల్‌‌ కొమ్మిశెట్టి, ప్రణీత పట్నాయక్‌‌, మొయీన్‌‌, రాజ్‌‌కుమార్‌‌ కసిరెడ్డి, బిందు మాధవి

ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన పల్లవి (నివేదా పేతురాజ్‌‌), తెలంగాణ అబ్బాయి సుధీర్‌‌ (నరేశ్‌‌ అగస్త్య)ను ప్రేమిస్తుంది. ఇద్దరూ పెండ్లి చేసుకుంటారు. కానీ.. వాళ్ల కులాలు వేరు కావడంతో పల్లవి కుటుంబానికి ఈ పెళ్లి ఇష్టం ఉండదు. దాంతో పల్లవి తన కుటుంబానికి దూరం కావాల్సి వస్తుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌‌లో ఉంటారు. ఒకరోజు తన పెదనాన్న చనిపోయాడనే విషయం పల్లవికి తెలుస్తుంది. దాంతో చాలా బాధపడుతుంది. 

చివరిసారి పెదనాన్నని చూసేందుకు భర్తతో కలిసి సొంతూరికి బయల్దేరుతుంది. తనకు ఇష్టం లేకపోయినా పల్లవి బావ చందు (సునీల్‌‌ కొమ్మిశెట్టి) వాళ్లను తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్తాడు. అయితే.. మార్గం మధ్యలో చందు.. సుధీర్‌‌ను తక్కువ చేసి మాట్లాడడంతో ఇద్దరికీ గొడవ జరుగుతుంది. పల్లవి కూడా చందుతో గొడవ పెట్టుకుంటుంది. అప్పుడే చందు దగ్గర తుపాకీ ఉన్నట్టు పల్లవికి తెలుస్తుంది. దాంతో పల్లవికి తమని చంపడానికే చందు తుపాకీ తెచ్చాడని అనుమానం మొదలవుతుంది. మన కోసం కాదని సుధీర్‌‌ చెప్పినా వినిపించుకోకుండా చందుతో గొడవ పెట్టుకుంటుంది. 

ఆ గొడవలో సుధీర్‌‌.. చందుని రాడ్డుతో కొడతాడు. దాంతో చందు చనిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? చందుతో పెళ్లి నిశ్చయమైన స్వాతి (ప్రణీత పట్నాయక్‌‌) ఏం చేసింది? ఈ కథలోకి ఎమ్మెల్యే రామయ్య (నాగబాబు) ఎలా వచ్చాడు? చందు హైదరాబాద్‌‌ వెళ్లడానికి కారణమేంటి? ఎవరిని చంపేందుకు తుపాకీ తీసుకున్నాడు? తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

వంద మంది బలయ్యారా?

టైటిల్ : యక్షిణి
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్‌‌స్టార్‌‌
డైరెక్షన్ : తేజ మార్ని
కాస్ట్ :  రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి, అజయ్

మహాకాళ్ (అజయ్)ది నాగలోకం. అతని కన్ను యక్షలోకం మీద పడుతుంది. ఆ లోకాన్ని వశం చేసుకుని, యక్షులను తమ బానిసలుగా చేసుకోవాలి అనుకుంటాడు. ఆ లక్ష్యంతోనే యక్షిణి అయిన మాయ (వేదిక)ను ప్రేమ పేరుతో ఏమారుస్తాడు. ఆమె ద్వారా రహస్య మందిర ద్వారం గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. కానీ.. ఈ విషయం యక్షలోక అధిపతి కుబేరుడికి తెలిసిపోతుంది. దాంతో.. మహాకాళ్‌‌ని ప్రేమించిన మాయని శపించి యక్ష లోకానికి దూరం చేస్తాడు. కానీ.. ఆమె బతిమాలడం వల్ల ఒక మార్గం చెప్తాడు. అదేంటంటే.. మాయ ‘తమో రజో గుణం’తో వందమంది పురుషులని చంపేస్తే.. శాపవిమోచనం కలుగుతుంది. అందుకే భూలోకంలో 99 మందిని అలాగే హత్య చేస్తుంది. 

అయితే.. 100వ వ్యక్తి విషయంలో మాత్రం ఒక నియమం ఉంటుంది. అదేంటంటే.. అతను నిష్ట కలిగిన బ్రహ్మచారి అయి ఉండాలి. అందుకే అలాంటి వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణ (రాహుల్‌‌ విజయ్‌‌) పరిచయం అవుతాడు. అతను ఒక హోటల్‌‌లో మేనేజర్‌‌గా పనిచేస్తుంటాడు. అతన్ని తన వలలో వేసుకోవడానికి మాయ ప్రయత్నాలు మొదలుపెడుతుంది. మరి మాయ వలలో కృష్ణ చిక్కాడా? అతన్ని చంపేసిందా? ఈ క్రమంలో మాయ కోసం మహాకాళ్​ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు?

కొడుకు కిడ్నాప్​

టైటిల్ : రష్‌‌‌‌ 
ప్లాట్​ ఫాం : ఈటీవి విన్‌‌‌‌
డైరెక్షన్ : సతీష్‌‌‌‌ పొలోజు
కాస్ట్ : డైసీ బొపన్న, రవిబాబు, కార్తిక్‌‌‌‌ ఆకృతి, మెతుకు అనురాగ, వెంకట్ శౌర్య 

ఆదిత్య (కార్తీక్‌‌‌‌ ఆకృతి), కార్తీక (డైసీ బోపన్న) దంపతులకు ఇద్దరు సంతానం. అబ్బాయి రిషి (వెంకట్ శౌర్య), అమ్మాయి రియా (మెతుకు అనురాగ). వాళ్ళది హ్యాపీ ఫ్యామిలీ. ఆదిత్య ఉద్యోగం చేస్తుంటాడు. పిల్లల్ని స్కూల్‌‌‌‌కి తీసుకెళ్లడం, తీసుకురావడం లాంటివి కార్తీక చేస్తుంటుంది. అలా ఒకరోజు ఆదిత్య ఆఫీస్‌‌‌‌కు వెళ్లిన తర్వాత అతనికి ఒక కాల్‌‌‌‌ వస్తుంది. అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ‘మీ భూములు ఎవరో కబ్జా చేశారు’ అని చెప్తాడు. దాంతో హడావిడిగా బయల్దేరతాడు. కారులో వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. దాంతో హాస్పిటల్‌‌‌‌లో చేరతాడు. 

ఈ విషయం తెలిసిన కార్తీక భర్త దగ్గరికి బయల్దేరుతుంది. హైవే మీది నుంచి వెళ్తుండగా నలుగురు బైకర్స్‌‌‌‌తో ఆమెకు పెద్ద గొడవ జరుగుతుంది. దాంతో వాళ్ల బైక్‌‌‌‌లకు డ్యాష్‌‌‌‌ ఇచ్చి ఆమె తప్పించుకుని వెళ్లిపోతుంది. పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో ఉన్న హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌ని తీసుకురావడానికి వాళ్లను నర్సింగ్ (వీరన్న చౌదరి) అనే రౌడీ పంపిస్తాడు. వాళ్లకు అప్పగించిన పని కార్తీక వల్ల ఆగిపోవడంతో కార్తీక కొడుకు రిషిని కిడ్నాప్ చేస్తాడు నర్సింగ్‌‌‌‌. 

పోలీసుల దగ్గర ఉన్న హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌ తీసుకొస్తేనే కొడుకుని వదిలిపెడతానని బెదిరిస్తాడు. కొడుకు కోసం కార్తీక పోలీస్ స్టేషన్‌‌‌‌కు వెళ్లిందా? కొడుకుని కాపాడుకుందా? మధ్యలో శివ (రవిబాబు) చేసిన ఇన్వెస్టిగేషన్ ఏమిటి? భర్తను కలిసిందా? లేదా? తెలియాలంటే రష్​ చూడాలి. 

ఇంతకీ ఎవరు పెండ్లి చేసుకున్నారు?

టైటిల్ : లవ్ కి అరేంజ్ మ్యారేజ్
ప్లాట్​ ఫాం : జీ5
డైరెక్షన్ : ఇష్రత్ ఆర్ ఖాన్
కాస్ట్ : సన్నీ సింగ్, అవనీత్ కౌర్, అన్నూ కపూర్, సుప్రియా పాఠక్

లవ్ (సన్నీ సింగ్), ఇషికా (అవనీత్ కౌర్)ని చూడగానే ప్రేమలో పడతాడు. తర్వాత ప్రపోజ్ చేయాలి అనుకుంటాడు. కానీ.. వాళ్ల మధ్య కొన్ని విభేదాలు వస్తాయి. చివరకు ఇద్దరూ ఒకరికొకరు ‘ఓకే’ చెప్పుకున్న తర్వాత ఇంట్లో చెప్పాలని డిసైడ్ అవుతారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. లవ్ తండ్రి ప్రేమ్ కుమార్ (అన్నూ కపూర్) భార్య చనిపోయి ఒంటరిగా ఉంటాడు. 

ఇషికా తల్లి సుప్రియ (సుప్రియా పాఠక్) కూడా తన భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీళ్లలో ఏ జంట పెండ్లి చేసుకుంది? అది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.