ఇరాకీ టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చిచంపారు..వీడియోలు చేసినందుకేనా?

బాగ్దాద్:ఇరాకీ టిక్‌టాక్ స్టార్ ఓం ఫహద్ ను కాల్చి చంపారు గుర్తు తెలియని దుండగులు. ఇంటిబయట ఉండగా బైక్ పై వచ్చిన దుండగుడు ఆమెపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దుండగుడు లోపలికి ప్రవేశించి ఫహద్ ను కాల్చిన చంపిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.ఫహద్ హత్య పై విచారణ జరిపేందుకు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి శాఖ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఫహద్ ను టిక్ టాక్ వీడియోలు చేసినందుకు కాల్చి చంపారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 

ఓం ఫహద్ అసలు పేరు ఘుఫ్రాన్ సవాడి, పాప్ మ్యూజిక్ కు డ్యాన్స్ చేస్తూ వీడియోలను టిక్ టాక్ లో పోస్ట్ ,చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. ఈమె వీడియోలకు దాదాపు అర మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వీడియోల్లో కొన్నింటిని ఒక  మిలియన్ కంటే ఎక్కువ చూశారు. 

2023 ఫిబ్రవరిలో ఫహద్ కుఆరు నెలల జైలు శిక్ష విధించింది ఇరాక్ కోర్టు.ఇరాక్ ప్రజల నైతికతను దెబ్బతీసే విధంగా ఆమె వీడియోలు చేస్తుందని నిర్ధారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఆమెతో పాటు మరో ఐదుగురు ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్లకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. మరికొంత మందిపై విచారణ జరుగుతుంది. 

అయితే ఫహద్ కు జైలు శిక్ష పడటంపై హ్యూమన్ రైట్స్ సంఘాలు ఖండించాయి. ఫహద్ పై నేరారోపణకు ఎటువంటి ఆధారాలు లేవని,వ్యక్తిగత స్వేఛ్చ పరిమితులకు లోబడే ఆమె  కంటెంట్  ఉందని జెనీవాకు చెందిన యూరో మెడ్ హ్యూమన్ రైట్స్ మానిటర్  తన నివేదికలో పేర్కొంది.