తెలంగాణ పోరాటంలో విశేష కృషి చేసి ఉద్యమాన్ని, పార్టీని బలోపేతం చేయడానికి సర్వశక్తులొడ్డి కష్టపడి, నష్టపోయిన నాయకులు, అనేక మంది ఉద్యమకారుల గుండెల్లో ఏర్పడ్డ గాయాలు.. చేదు అనుభవాలు ఎన్నటికీ సమసిపోవు. రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీని కూడా నయవంచనకు గురి చేశారు. 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని కేసీఆర్‌కు క్యాబినెట్ పదవి ఇచ్చి, తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రం ఇచ్చిన పార్టీని చీల్చి, ఎన్నికైన ఎమ్మెల్యేలను లాక్కొని ప్రజల్లో ఆ పార్టీ పట్ల విశ్వాసం దెబ్బతీసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఒక బలమైన ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసిన ఘనత ఆయనదే.
పునాదులు వేసింది ఎవరు?
1996లో మేధావులు, విద్యార్థులు మలి దశ తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మారోజు వీరన్న సూర్యాపేటలో జరిపిన సభ, భువనగిరిలో గద్దర్, ప్రొఫెసర్ జయశంకర్, బెల్లి లలిత పాల్గొన్న సభతో పాటు జనసభ, మహాసభల ప్రభావం తెలంగాణ ఉద్యమానికి గట్టి పునాదులు వేశాయి. తెలంగాణ ఉద్యమాన్ని రాజకీయ కోణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నడపడానికి కేసీఆర్‌తో ఉద్యమకారులు మేధావులు, నాయకులు సంప్రదింపులు చేసిన దరిమిలా 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ ఆవిర్భవించింది. ఉద్యమకారులు మేధావులతో పాటు అనేకమంది బీజేపీ, సీపీఐ నాయకులు టీఆర్ఎస్లో చేరి పునాదిరాళ్లు వేశారు. గాదె ఇన్నయ్య, గొట్టే భూపతి, దేశిని చిన్న మల్లయ్య, సంతోష్ రెడ్డి, బండి పుల్లయ్య, మధుసూదనాచారి, డా. విజయ రామారావు, సంతోష్ రెడ్డి, చంద్రశేఖర్, ఎం నారాయణ రెడ్డి, గంగారెడ్డి, డా. నారాయణరెడ్డి, ఓదేలు, రవీంద్ర నాయక్, ముచ్చర్ల సత్యనారాయణ, నగేష్, భూపతి కృష్ణమూర్తి, రాములు నాయక్, ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి, రహమాన్, డా. చెరుకు సుధాకర్ ఇంకా అనేక మంది నాయకులు పార్టీ అభివృద్ధికి బలోపేతానికి కృషి చేసిన వారిలో ఉన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారులను, నాయకులను, మేధావులను వ్యూహాత్మకంగానే దూరం పెట్టడం ప్రారంభించారు కేసీఆర్. పునాదులు వేసి అభివృద్ధి చేసిన నాయకులందరినీ పార్టీలో ప్రభుత్వంలో లేకుండా చేసిన ఘనత వారిదే.
పొమ్మన లేక పొగ బెట్టి..
ఆలే నరేంద్ర బీజేపీకి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేశారు. విజయశాంతి కూడా బీజేపీకి రాజీనామా చేసి తల్లి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ఉద్యమానికి ప్రజల ముందు ఒకే రాజకీయ పార్టీ మాత్రమే ఉండాలని మేధావులు, ఉద్యమకారులు ఈ రెండు పార్టీల నాయకులపై ఒత్తిడి చేయడం వల్ల ముఖ్యంగా ప్రొఫెసర్ జయశంకర్ ఈ రెండు పార్టీల విలీనానికి ప్రధాన పాత్ర పోషించారు. ఇతర పార్టీల విలీనం తర్వాత టీఆర్ఎస్ బలోపేతం అయిన కొద్దీ ముఖ్య నాయకులను ఏదో ఒక సాకుతో పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడితే.. చాలామంది నాయకులు పార్టీని వీడారు. నిజాయతీ, అంకితభావం, ఆత్మగౌరవం గల నాయకులను, మేధావులను, నిర్లక్ష్యం చేయడం, అవమానించడం బహిష్కరించడం కూడా చూశాం. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో జయశంకర్‌ను హనుమకొండ ఎంపీగా ప్రకటించిన తర్వాత వినోద్ రావుకు సీటు ఇవ్వడంతో సార్ ఎంతో మనస్థాపానికి గురయ్యారు. ఈ విషయం ఆయన సహచరులకు, ఆత్మీయులకు నాలాంటి శిష్యులకు మాత్రమే తెలుసు. వారిని రాజ్యసభ సభ్యుడిగా చేస్తానని, ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా చేస్తానని ప్రకటించి మాట తప్పి అవమానానికి గురి చేశారు కేసీఆర్. సకల జనుల సమ్మె, తెలంగాణ ధూంధాంలు, సాగరహారం, మిలియన్ మార్చ్, ఉద్యోగుల నిరవధిక సమ్మె, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన గళాలు, ఉద్యమాన్ని అత్యున్నత స్థాయికి ఎత్తుకున్నాయి.
ఉద్యమకారులు ఎక్కడున్నా ధర్మం మరువొద్దు
2001లో హరీశ్ రావు ఎమ్మెల్యే కాకపోయినా రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించారు కేసీఆర్. కుటుంబ ప్రీతి, బంధు ప్రీతికి అప్పుడే అంకురార్పణ జరిగింది. ఆధిపత్యం, సొంత కుల ప్రాబల్యం పెంచుకున్న కొద్దీ బహుజన సామాజిక వర్గాల నాయకులు చాలామంది పార్టీ నుంచి వైదొలగే పరిస్థితులు సృష్టించారు కేసీఆర్. ఆలే నరేంద్ర, విజయశాంతి, రవీంద్ర నాయక్, విజయ రామారావు, చంద్రశేఖర్, కొట్టే భూపతి, దేశిని చిన్న మల్లయ్య, బండి పుల్లయ్య అచ్చ విద్యాసాగర్, చింత స్వామి, సంగులాల్ లాంటి అనేక మంది నాయకులు పార్టీ, ఉద్యమం కోసం ఆస్తులు పోగొట్టుకొని జీవితాన్ని ఫణంగా పెట్టి చివరికి అవమానం ఎదుర్కొన్నారు. ఎన్నికలు మళ్లీ వస్తున్న సందర్భంలో దగా పడ్డ ప్రజలు, అవమానపడిన ఉద్యమకారులు, మోసపోయిన నాయకులు ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా దండు కట్టాలి. తమ వంతు పాత్ర పోషించి దుర్మార్గపు అవస్థల నుంచి, అవినీతి వ్యవస్థ నుంచి కాపాడాల్సిన ధర్మం ఉందని గుర్తుంచుకోవాలి.
బాపూజీకీ అవమానమే!
తెలంగాణను వ్యతిరేకించి ఉద్యమకారులను అనేక ఇబ్బందులు పెట్టి అక్రమ కేసులు బనాయించి కొట్టించిన, వారిని తిట్టిన, అనేకమంది తెలుగుదేశం నాయకులను పార్టీలోకి, ప్రభుత్వంలోకి ఆహ్వానించి పెద్ద పీట వేసి గౌరవించారు కేసీఆర్. గత తొమ్మిదేండ్ల కాలంలో ఈ బంగారు తెలంగాణ బ్యాచ్.. తెలంగాణ ఉద్యమకారులను, ప్రజలను, బహుజన వర్గాలను అవమానించడం, అణచివేయడం, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలో గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్, ప్రగతి భవన్‌వరకు అవినీతిమయమైపోయి ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని బాధితులు నిత్యం గగ్గోలు పెడుతున్నారు. 2001లో పార్టీ ప్రారంభానికి జలదృశ్యం వేదికనిచ్చి 94 ఏండ్ల వయసులో తెలంగాణ అనేక జిల్లాల్లో తిరిగి రాష్ట్ర సాధనకు కృషిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానించడమే గాక ఆయన కాలం చేస్తే కనీసం సంతాపం తెలియజేయడానికి కూడా పోకపోవడాన్ని తెలంగాణవాదులు గుర్తుంచుకున్నారు.
–కూరపాటి వెంకట నారాయణ,రిటైర్డ్ ప్రొఫెసర్