సోషల్ మీడియాకూ నిబంధనలు పెట్టాలె:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

సోషల్ మీడియాకూ నిబంధనలు పెట్టాలె:పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
  • ఇన్స్టా, స్నాప్ చాట్తో యువత దారి తప్పుతోంది
  • రాహుల్, రేవంత్ యూత్ గురించి ఆలోచిస్తుండ్రు
  • రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ ఏర్పాటైంది

హైదరాబాద్: సోషల్ మీడియాకూ కొన్ని నియమాలు పెట్టాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. హెఐసీసీలో యూత్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ టుమారో సెషన్ లో ఆయన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..యువత స్నాప్ చాట్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో మునిగిపోతే ప్రయోజనం ఉండదన్నారు. అందుకే సోషల్ మీడియాకు కొన్ని నియమాలు పెట్టాలని ఆకాంక్షించారు.  

ఇప్పటికే  సోషల్ మీడియాలో కంటెంట్ను నియంత్రించేందుకు రెగ్యులేటర్స్ కొన్ని పాలసీలను అమలు చేస్తున్నారు. పెరుగుతున్న టెక్నాలజీతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. టెక్నాలజీ వినియోగం, డిజిటల్ ఇంపాక్ట్ పైన తమిళనాడు ప్రభుత్వం విద్యార్థులకు ఆటోమోటివ్ అవగాహన ప్రొగ్రామ్స్ నిర్వహిస్తోందని ఉదహరించారు.దేశ యువత టెక్నాలజీని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అవగాహన కల్పించాల్సిన అవసరం, ఓ పాలసీని తేవాల్సిన అవసరం ఉందన్నారు.    

నిరుద్యోగం అనేది దేశానికి మంచిది కాదని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని అన్నారు. ముఖ్యంగా స్కిల్స్  పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్  రెడ్డి యువత గురించే ఆలోచిస్తారని చెప్పారు. అందులో భాగంగానే రాష్ట్రంలో స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేశారని అన్నారు.  పార్లమెంటులో 35 ఏళ్లలోపు 60 మంది ఎంపీలు ఉన్నారని, తాను కూడా వాళ్లలో ఒకడిని అని చెప్పారు.